కాళేశ్వరంపై విచారణ చేసి

– సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
– పార్లమెంటు ఎన్నికల్లో లబ్దిపొందేందుకే ఆ సమస్యను వాడుకుంటున్నారు
– మాజీ మంత్రి టి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాళేశ్వరం సమస్యపై విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలనీ, అలా కాకుండా..వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్దిపొందేందుకే ఆ సమస్యను కాంగ్రెస్‌ వాడుకుంటున్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే టి హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం అసెంబీలోని మీడియా పాయింట్‌ వద్ద మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కడియం శ్రీహరి, చామకూర మల్లారెడ్డి, సునితా లక్ష్మారెడ్డితో కలిసి మాట్లాడారు. శాసన సభలో సభా సంప్రదాయాలను ఉల్లంఘిం చారని విమర్శించారు. అధికారపక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోవటం సభా సంప్రదాయాలకు విరు ద్ధమని చెప్పారు. మేడిగడ్డ పర్యటన ద్వారా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లబ్ధిపొందిన ప్రజలను అడగాలని ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదనీ,.. అది మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌ స్టేషన్లు, 21 పంప్‌ హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్‌, 98 కిలోమీటర్ల ప్రెజర్‌ మెయిన్స్‌, 141 టీఎంసీల స్టోరేజ్‌ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్‌, 240 టీఎంసీల ఉపయోగం కలగలిసిన సమూహమేనని చెప్పారు. ఒక్క బ్యారేజీలో ఒకటి రెండు కుంగిపోతే బూతద్దంలో పెట్టి చూపెడుతున్నారనీ, కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని విమర్శించారు. మేడిగడ్డ సందర్శనలో భాగంగా మీరు వెళ్లే దారిలో ఉన్న రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడాలని వారికి సూచించారు. కాళేశ్వరం ఫలితాలను గురించి రైతులను అడిగి తెలుసుకోవాలన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రంగనాయకసాగర్‌ను చూసి అద్భుతమని మెచ్చుకున్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టును సరిదిద్దే ప్రయత్నం చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ హయాంలో పంజాగుట్ట ఫ్లై ఓవర్‌ కూలి 20 మంది చనిపోయారనీ, దేవాదుల పైపులు పేలి నీళ్లు ఆకాశమంత ఎగిరాయన్నారు. అలాంటి ఘటనలు జరగడం బాధాకరమని చెప్పారు. కానీ తాము ముందుకు వెళ్లాం కదా అని తెలిపారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించొద్దని తాము నిద్ర లేపితే లేచారనీ, ఈ రోజు బీఆర్‌ఎస్‌ సభకు పోటీ కార్యక్రమం పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు.