సిద్ధరామయ్యపై దర్యాప్తు జరపండి

– లోకాయుక్తకు ప్రత్యేక కోర్టు ఆదేశాలు
బెంగళూరు : మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ (ఎంయుడిఎ) స్థలం కేటాయింపు కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పోలీసులతో దర్యాప్తు జరపాల్సిందిగా ప్రత్యేక కోర్టు బుధవారం లోకాయుక్తను ఆదేశించింది. సిద్ధరామయ్య భార్య పార్వతికి ఎంయుడిఎ 14 స్థలాలను కేటాయించడంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో సిద్ధరామయ్యపై దర్యాప్తు చేపట్టేందుకు గవర్నర్‌ గెహ్లాట్‌ అనుమతి మంజూరు చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది.ఈ నేపథ్యంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్‌ గజానన్‌ భట్‌ ఆదేశాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రిపై వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆదేశిస్తూ ఆగస్టు 19న ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలను కూడా హైకోర్టు రద్దు చేసింది. గవర్నర్‌ విచారణకు అనుమతించడాన్ని సవాలు చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది.