– ఎన్నికల హింసపై డిజిపికి సిట్ నివేదిక
– 33 చోట్ల హింసాత్మక ఘటనలు
– 1370మంది నిందితులు
– పలు కేసుల్లో ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్పునకు ప్రతిపాదన
అమరావతి : ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై జరిగిన పోలీస్ దర్యాప్తులో అనేక లోపాలు చోటుచేసుకున్నట్లు సిట్ నిర్ధారించింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ , డిజిపి హరీష్‌కుమార్ గుప్తాకు సోమవారం అందించారు. 150 పేజీల ఈ నివేదికలో అల్లర్లు, హింసకు సంబంధించిన కేసుల దర్యాప్తులో అనేక లోపాలున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి అనేక అంశాలను వివరించారు. వీటిన కూడా పరిగణలోకి తీసుకుని ఎఫ్ఐఆర్లో మరికొన్ని సెక్షన్లు చేర్చాలని ప్రతిపాదించారు. ఏయే సంఘటనల్లో ఏయే సెక్షన్లు చేర్చవచ్చో కూడా వివరించినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా ఆయా ప్రాంతాల్లో సంఘటన ఎలా జరిగింది? ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులెవరు? సంఘటన జరగకుండా ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? సంఘటన జరుగుతున్న సమయంలో అల్లర్లు జరగకుండా తీసుకున్న చర్యలేమిటీ? ఘటనలకు సంబంధించి ఎన్ని ఎఫ్ఐఆర్లు చేశారు? ఏయే సెక్షన్లు వేశారు? అసలైన నిందితులను కేసులో పెట్టారా? లేక రాజకీయ వత్తిళ్లలకు లొంగి వారిచ్చిన పేర్లను కేసుల్లో ఇరికించారా? లాంటి విషయాలన్నింటిని స్ధానికులు, పోలీసుల నుంచి వివరాలు రాబట్టిన సిట్ ఆ అంశాలను కూడా నివేదికలో పొందుపరిచింది. పల్నాడు , అనంతపురం, తిరుపతి మూడు జిల్లాల్లో ఈ సంఘటనలకు సంబంధించి 33 కేసులు నమోదయ్యాయని, వీటిలో మొత్తం 1370మంది నిందితులుగా ఉన్నారని ఆ నివేదికలో పొందుపరిచారు. ఈ మొత్తం నిందితుల్లో ఇప్పటి వరకు 124మందిని అరెస్ట్ చేయగా, 1152మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని, మరో94 మందికి 41-ఎ కింద నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు పలు కేసుల్లో నిందితుల జాబితా పెరిగే అవకాశమున్నట్లు స్పష్టమవుతోంది. వీరిలో పలువురు అజ్ఞాతంలో ఉండటంలో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కూడా సూచించినట్లు సమాచారం.