శివుని పల్లి జీపీ నిధుల దుర్వినియోగంపై విచారణ

– రూ. 12.78లక్షలు నిధులు దుర్వినియోగం
– పూర్తి విచారణ జరిపి చర్యలు : డీపీఓ రంగాచారి
నవతెలంగాణ – స్టేషన్ ఘన్ పూర్
మండలంలోని శివునిపల్లి గ్రామ పంచాయితీలో గతంలో జరిగిన నిధుల దుర్వినియోగం వాస్తవమేనని జిల్లా పంచాయితీ అధికారి రంగాచారి తెలిపారు. గ్రామంలో ఏకైక వార్డు సభ్యులు బూర్ల విష్ణు గతంలో 2019 నుంచి పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన కాలంలో పంచాయితీ కార్యదర్శి వెంకట కిషోర్ పై అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, రికార్డులన్నీ తప్పుల తడకగా మార్చి ఇష్టారీతిన వ్యవహరించారని ఆరోపిస్తూ రాష్ట్ర విజిలెన్స్, పంచాయితీ రాజ్ కమీషనర్ ఇచ్చిన పిర్యాదు మేరకు బుధవారం జీపీ కార్యాలయంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా డీపీఓ, డీఎల్పీఓ వర ప్రసాద్, ఎంపిఓ, గ్రామ ప్రత్యేకాధికారి సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో రికార్డులన్నీ పరిశీలించిన పిమ్మట విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో జియో నెట్ వర్క్ కంపనీ కేబుల్ ఏర్పాటు కొరకు జీపీ అనుమతి కోసం 2019లో రూ. 7లక్షల28వేల 560లను డీడీ రూపములో ఇచ్చారని తెలిపారు. కాగా ఏలాంటి చలానా కూడా జీపీ ఖాతాలో జమచేయలేదని, రూ. 4లక్షలు వివిధ శాఖల రూపేణ వచ్చిన నిధులు రూ. 4లక్షలను స్థానికంగా జీపీ ఖాతా ఉన్నప్పటికీ, ములుగు రోడ్డులోని హెచ్డీఎఫ్సీ ఖాతాలో జమచేసి దుర్వినియోగం చేశారని, గతంలో కూడా చిల్పూర్ మండలంలో ఫతేపూర్ లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రూ. 13వేలు కూడా జమ చేయలేదని ఒప్పుకున్నట్లు తెలిపారు. 2018- 19 జీపీ ఎన్నికల నేపథ్యంలో రూ. ఒక లక్షా డీడీ రూపంలో తీసినప్పటికీ జమ చేయలేదని అన్నారు. ఇంకా చిన్న చిన్న జరిగిన తప్పిదాలకు సరైన రుజువు లేనందున ఉన్నవాటిపై విచారణ జరిపి, ఇంకా పూర్తిస్థాయిలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు భావిస్తున్నామని, ఆడిటర్ వద్ద రికార్డులు ఉన్నాయని చెబుతున్నాడే తప్పా, సంబంధిత రశీదులు లేవని స్పష్టం చేశారు. విచారణ నివేదికలన్నింటిని ఉన్నత అధికారులకు అందించి, తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాను జీపీ నిధుల్లో ఏలాంటి దుర్వినియోగానికి పాల్పడలేదని, రికార్డులు ఆడిటర్ వద్ద కలవని ఈఓ వెంకట కిషోర్ వివరణ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఇంచార్జీ పంచాయితీ కార్యదర్శి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.