– అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక ఆరోపణల అంశంలో విచారణ ఎదుర్కొనున్నాడు. ఈ మేరకు న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (ఏసీఎంఎం) ప్రియాంక రాజ్‌పుత్ ఆదేశాలు జారీ చేశారు. ఐపీసీ సెక్షన్ 506(1), 354, 354(ఏ) ప్రకారం బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా అభియోగాలు నమోదు చేసేందుకు సరిపోయే ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం గుర్తించిందని న్యాయమూర్తి తెలిపారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల అంశంలో అభియోగాల నమోదు, విచారణపై న్యాయస్థానం పూర్తి తీర్పు కాపీలు రావాల్సి ఉంది.
ఆధారాలు ఉన్నాయి : బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై అభియోగాల నమోదుకు అవసరమైన ఆధారాలు ఉన్నాయని ఓపెన్ కోర్టులో న్యాయమూర్తి తెలిపారు. అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్ (సెక్షన్ 354), లైంగిక వేధింపులు (సెక్షన్ 354 (ఏ)) సహా క్రిమినల్ ఇంటిమిడేషన్ (సెక్షన్ 506(1)) ఆరోపణల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై శిక్షార్హమైన అభియోగాలు నమోదు చేయనున్నారు. సెక్షన్ 354, 354(ఏ) కింద ఐదుగురు మహిళా రెజ్లర్లను వేధించినట్టు ఆధారాలు ఉండగా.. సెక్షన్ 506(1) ప్రకారం ఇద్దరు రెజ్లర్లపై వేధింపులకు దిగినట్టు ప్రాథమికంగా న్యాయస్థానం గుర్తించింది. సస్పెన్షన్‌కు గురైన భారత రెజ్లింగ్ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌పై సెక్షన్ 506(1) కింద అభియోగాలు నమోదు చేయనున్నారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు సహకరించిన ఆరోపణల నుంచి వినోద్ తోమర్‌కు న్యాయస్థానం ఉపశమనం కలిగించింది.
న్యాయం దిశగా.. : బిజెపి నాయకుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై సుదీర్ఘ పోరాటం న్యాయస్థానం చొరవతో బాధిత మహిళా రెజ్లర్లకు న్యాయం అందించే దిశగా సాగుతుందని మల్లయోధులు భావిస్తున్నారు. ’18 నెలల న్యాయ పోరాటంలో ఇది పెద్ద మైలురాయి. 2023 జనవరిలో వీధుల్లో మొదలైన పోరాటం.. ఇప్పుడు న్యాయస్థానంలో ముగిసింది. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. పారదర్శక, న్యాయమైన విచారణ జరిపి మహిళా రెజ్లర్లకు న్యాయం చేస్తారని ఎదురుచూస్తున్నాను’ అని సాక్షి మాలిక్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారత అగ్రశ్రేణి రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్‌లు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నెలల పాటు ఆందోళన చేపట్టగా.. మే 2023లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 1,000 పేజీలతో చార్జ్‌షీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించారు. అభియోగాల నమోదుకు ఆదేశాలు జారీ చేస్తున్న సమయంలో న్యాయస్థానంలో ఉన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. ‘ఆరోపణలు అన్నీ అబద్ధాలు, ప్రేరేపితం’ అని అన్నారు.