– హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ను ఏడో రోజూ ప్రశ్నించిన ఏసీబీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలో కలకలం రేపిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కోట్లాది రూపాయల అక్రమాస్థుల కేసులో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులను పిలిచి ఏసీబీ అధికారులు విచారించినట్టు తెలిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బాలకృష్ణను మంగళవారం ఏడోరోజు కూడా ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని సుదీర్ఘంగా విచారించారు. కాగా, బాలకృష్ణను ఎనిమిది రోజుల పాటు విచారించటానికి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. బాలకృష్ణకు 120 ఎకరాల భూమిని రియల్‌ఎస్టేటర్లు ఎందుకు ఇచ్చారనే కోణంలో విచారణ సాగినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఆదిత్య, ఫిలిప్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన ముఖ్యులను పిలిచి ఏసీబీ అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. ఏ కారణం చేత విలువైన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాలకృష్ణకు ఇచ్చారనే కోణంలో ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం.
గత ప్రభుత్వ కీలక మంత్రికున్న లింకును బయటపెట్టే విధంగా…
మరోవైపు, మైత్రివనంలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో కూడా మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, హెచ్‌ఎండీఏలో బాలకృష్ణకు అత్యంత సన్నిహితులుగా మెలిగి, అతని అక్రమ వ్యవహారాలలో సహకరించారని అనుమానిస్తున్న మరో 8 మంది అధికారులను కూడా ఏసీబీ విచారించనున్నట్టు తెలిసింది. వీరిని విచారించటం ద్వారా గత ప్రభుత్వానికి చెందిన ఒక కీలక మంత్రికి బాలకృష్ణ అక్రమాస్థుల కేసులో ఉన్న లింకును బయటపెట్టటానికి కూడా ఏసీబీ అధికారుల దర్యాప్తు సాగుతున్నట్టు విశ్వసనీయంగా సమాచారం.