గ్రామ పంచాయితీలకు కార్యదర్శులు పెట్టుబడి..!

– జేబులో నుంచి ఖర్చులు పెడుతున్న వైనం 
– మరమ్మతులు, నిర్వహణ ఖర్చుల కోసం ఇక్కట్లు
– రికవరీ చేసుకోవడం ఎలా? అని దిగాలు 
నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్రంలో ఒకవైపు ఎన్నికల హడావిడి, మరోవైపు అధికారులు ఎన్నికల విధుల్లో బిజీ గా ఉండడంతో గ్రామ పంచాయతీల నిర్వహణను పట్టించుకునే నాథుడే లేకుండా పోయింది. దీనికి తోడు జీపీ ఖజానా సైతం ఖాళీ కావడంతో, గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం పంచాయతీ కార్యదర్శులు తమ జేబులో నుంచి వేలాది రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ ఖాతాలో నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జనవరి 31 న పాలకవర్గం పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. వారిలో చాలామంది గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదని బహిరంగంగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నిధులు లేమి వల్ల మల్టీపర్పస్ వర్కర్లు సైతం నెలలు తరబడి వేతనాలు రాకపోవడంతో పస్తులుంటూ, పనులు ఎలా చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. చేసేదేమీలేక పంచాయతీ కార్యదర్శులు చేతులెత్తేస్తున్నారు.
జీపీ నిర్వహణ కోసం కార్యదర్శులు పెట్టుబడి:
సుమారు గత రెండేళ్లుగా నిధులు లేమితో ఆయా గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి జాప్యం వాటిల్లుతుంది. గ్రామ సమస్యలు పరిష్కారమయ్యేదేలా అంటూ సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలు, కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐ చెల్లింపు వంటి ఖర్చుల కోసం పంచాయతీ కార్యదర్శులు స్వంతంగా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2 నుంచి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. వీరికే గ్రామ పరిపాలన, పర్యవేక్షణ బాధ్యతలను సైతం అప్పగించింది. అంతేగాక కార్యదర్శి తో కలిసి చెక్ పవర్ కూడా ఇచ్చారు. 15 వ ఆర్థిక సంఘం నిధులు సరిపడా రావడం లేదు. జనరల్ ఫండ్స్ తో పాటు మిగతా చాలీచాలని నిధులతో పల్లెల్లో పాలన నెట్టుకు రావడం కార్యదర్శులకు తలనొప్పిగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో తాము పెట్టిన పెట్టుబడి ఎప్పుడూ, ఎలా తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు దిగాలు చెందుతున్నారు.