ఫార్ములా-ఈ-రేస్, కేటీఆర్‌ల బంధం వివాదంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పుష్ప2 సినిమా బెనిఫిట్ షో తొక్కిసలాట వివాదం జనం ఇంకా మరచిపోలేదు. ఇలాంటి సంచలన వార్తల వెనుక పన్నుల విధానం ప్రజలకు కనిపించ కుండా పోతున్నది. వీటి మూలాలేమి టన్నదే అసలు ప్రశ్న. విధివిధానాలు పాటించ కుండానే, కేవలం కేటీఆర్ ఫోన్‌కాల్‌తో హెచ్‌ఎండీఏ అధికారులు ప్రైవేటు కంపెనీకి డబ్బు ఇవ్వటం చట్ట విర్ధుమన్నదొక్కటే సమస్య కాదు. ఒక మంత్రి ఫోన్ కాల్‌తో రూ.45.7కోట్లు ప్రజల డబ్బును ఏ సంబంధం లేని ప్రయివేటు కంపెనీకి హెచ్‌ఎండీఏ ఎట్లా పంపిందన్నది అనేక అనుమానాలకు అవకాశమిస్తున్నది. ఇది బయటకు పొక్కింది. ఇలాంటివి ఎన్ని జరిగి ఉంటాయి? వ్యక్తుల ప్రయోజనాలు లేకుండానే, ఇంత పెద్ద మొత్తాలు, అవలీలగా చేతులు మారుతాయా? ఇలాంటివే అనేక ప్రశ్నలు. ఇది కేవలం నిబంధనలు పాటించకపోవటం లేదా కొందరు వ్యక్తుల అవినీతికి అవకాశాలున్న ఘటనగానే కాదు… అంతకన్నా లోతుగా అర్ధం చేసుకోవాలంటే మరికొన్ని ఘటనలు గుర్తు చేసుకోవాలి. 1971లో నగర్‌వాలా అనే వ్యక్తి, నాటి ప్రధాని ఇందిరాగాంధీ గొంతుతో ఫోన్ చేసి ఒక బ్యాంకు నుంచి రూ.60లక్షలు పొందిన ఘటన ‘నగర్‌వాలా కుంభకోణం’గా చరిత్రలో నిలిచింది. 2001లో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్న బంగారు లక్ష్మన్, తెహెల్కా డాట్ కామ్ స్టింగ్ ఆపరేషన్‌లో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఒక రక్షణ సంబంధమైన ఆయుధాల డీలర్ నుంచి థర్మల్ బైనాక్యులర్స్ రక్షణ శాఖకు సరఫరా జరిగేటట్టు చూస్తానని ఈ లంచం స్వీకరించారు. భద్రతకు సంబంధించిన సరఫరాలు కూడా నాణ్యత, చట్టపరమైన జాగ్రత్తలు లేకుండా, లంచం తీసుకుని చేయవచ్చా అన్న విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. స్టింగ్ ఆపరేషన్ ఇంత సులభంగా జరిగిందంటే, ఇలాంటి అవినీతి చర్యలు నిత్యకృత్యమే అయి ఉండవచ్చునన్నదే అందరి ఆందోళన. అధికారంలో ఉన్నవారు ఎంతటి అవినీతికైనా పాల్పడే అవకాశాలున్నాయనీ ఎవరికైనా సులభంగానే అర్ధమవుతుంది.
అటల్ బిహారీ వాజ్‌పేయి నిజాయితీగల నాయకుడన్న పేరుంది. ఆయన మంత్రివర్గంలోని మంత్రే బంగారు లక్ష్మణ్. మన్మోహన్ సింగ్ విషయంలో కూడా నిజాయితీకి తిరుగులేని నాయకుడని చాలామంది ప్రశంసించారు. ఆయన ప్రధానిగా ఉండగానే 2జి స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణాలు దేశాన్ని కుదిపివేశాయి. ఆయన మంత్రివర్గ సహచరులు ముద్దాయిలుగా నిలబడవల్సి వచ్చింది. ఇప్పుడు మోడీ గురించి కూడా నిజాయితీకి నిలువుటద్ధమన్నట్టు ఆయన సమర్ధకులు పొగడ్తల వర్షం కురిపిస్తారు. మోడీ మంత్రివర్గంలో 19మంది మీద అవినీతి, హత్యాయత్నంతో సహా అనేక క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్) ప్రకటించింది.
పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల అపవిత్ర బంధమే అనేక అవినీతి కుంభకోణాలకు పునాదిగా బట్టబయలవుతున్నది. ఉద్యోగులలో అవినీతి పిచ్చుకల స్థాయిదేననీ, అసలు ఘనకార్యాల బాధ్యులంతా బడాబాబులేనని తేలుతున్నది. పెట్టుబడితో పెన వేసుకున్న బంధమే అసలు మూలంగా తేలిపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్థితో పాటు అవినీతి కూడా పెరిగింది. అందుకే సరళీకృత ఆర్థిక విధానాల కాలంలోనే విచ్చలవిడిగా అన్ని రంగాలకు విస్తరించింది. పైనుంచి కిందకు పాకింది. లాభం కోసం ఏం చేసినా రైటేనన్న భావన బలపడుతున్నది. చట్టం, న్యాయం స్థానంలో ‘లాబీయింగ్’ చేరింది. పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత స్థాయికి చేరిన అమెరికాలో ‘లాబీ యింగ్’ కూడా ఉన్నతస్థాయికి చేరింది. లైసెన్స్‌లు, అనుమతులు, కాంట్రాక్టుల కోసం లంచం ప్రయోగించటం పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణం. ఇది మరింత ముందుకు సాగి పాలకులకు సన్నిహితులైన పెట్టుబడిదారులకు వడ్డించిన విస్తరిగా మారింది. దీనినే ఆశ్రిత పెట్టుబడిదారీ విధా నం అంటున్నారు. మరింత ఆధునికంగా మోడీ పాలనలో ఎలక్టోరల్ బాండ్స్ రూపం దాల్చింది. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇస్తుందో కూడా గోప్యంగా ఉంచుతూ అధికార పార్టీ లాభం పొందే విధానమిది. బలమైన ఆశ్రిత పెట్టుబడి బంధం ఇది.
పుష్ప2 బెనిఫిట్ షో ఘటన కూడా ఈ కోణం నుంచే చూడాలి. తొక్కిసలాటలో మహిళ చనిపోయింది. బాలుడు చావుబతుకుల్లో ఉన్నాడు. కిందపడిన మహిళను కాపాడాలన్న స్పృహ ఎవరికీ లేదు. అదొక మాస్ హిస్టీరియా. మాస్ హిస్టీరియాలో మానవత్వానికి చోటు లేదు. మరి హిస్టీరియాను ఎవరు, ఎందుకు సృష్టించారు. పోలీసుల పాత్ర ఏమిటి? పెద్దఎత్తున పెట్టుబడి పెట్టారు కదా లాభమే పరమావధి. ప్రమో ట్ చేసి బాగా లాభం గడించాలనుకున్నారు. పెట్టుబడికి, లాభతృష్ణకు మానవత్వం ఉండదు కదా? మనిషికి అవసరమైన సరుకుని ఉత్పత్తి చేసి అమ్మకానికి పెట్టడం ఒక పద్ధతి. ఇప్పుడు సరుకును ఉత్పత్తి చేసి కొనుగోలుదారులను సృష్టించుకుంటున్నారు. సరుకును సృష్టించి దానికి మార్కెట్ సృష్టించుకుంటారు. కొత్త మోడల్ కారు, ఫ్రిజ్, నగలు ఏవైనా కావచ్చు. ఫలానా ఫలానా లక్షణాలతో కూడిన సరుకు నాకోసం ఉత్పత్తి చేయండి అని వినిమయదారులు అడగరు. ఫలానా ఫలానా లక్షణాలున్న సరుకు మీకు బాగా ఉపయోగమని మిరుమిట్లు గొలిపే వ్యాపార ప్రకటనలతో కొనుగోలుదారులను ఆకర్షిస్తారు. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణం. పుష్ప2 సినిమా కూడా అట్లా నిర్మించిందే. చూసేవారిని ఆకర్షించేందుకు బెనిఫిట్ షో పేర ఆ సినిమా హీరోనే పిలిచారు. కిక్కిరిసిన జనంతో రాష్ట్రమంతా వార్త కావాలి కదా! అది మాస్ హిస్టీరియా అయినా పెట్టుబడికి బాధ లేదు. దానికి వినిమయదారులు (ఇక్కడ ప్రేక్షకులు) కావాలి. లాభం కోసం ఏమైనా చేయటం పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణం. మరి పోలీసుల నిర్లక్ష్యం మాటేమిటి? పోలీసు అనుమతి లేదని చెపుతున్నారు. తొక్కిసలాటకు అవకాశమున్నదని పోలీసులకు తెలుసు. సాధారణ ప్రజల నిరసన ప్రదర్శనల సందర్భంగా అనుమతులిచ్చి కూడా జనం రాకుండా గ్రామాల్లోనే అరెస్టులు చేస్తున్నారు. జనం కదలిక ఎక్కువగా ఉన్నదని ఇంటలిజెన్స్ రిపోర్టులు ఉన్నాయని కారణం చెపుతారు. పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా వస్తున్న జనం పోలీసులకు కనిపించలేదా? తమ నిఘా వ్యవస్థ నిద్రపోయిందా? సినిమా హీరో ఇంటిదగ్గర బయలుదేరినపుడే ఆపి ఉండాలి కదా? నిఘా వ్యవస్థ నిద్ర పోవడం కాదు. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కూడా పెట్టుబడి సేవలోనే తరిస్తారు. ప్రజల సమస్యలు, పెట్టుబడి ప్రయోజనంలో ఏదో ఒకటి ఎంచుకోవలసి వచ్చినపుడు వీరు పెట్టుబడి ప్రయోజనాన్నే ఎంచుకుంటారు.
విద్య, వైద్యం కూడా సరుకులుగా మారాయి. కార్పొరేట్ సంస్థల హస్తగతమైనాయి. ఒకప్పుడు విద్యాసంస్థలు, వైద్యశాలల వ్యాపార ప్రకటనలంటే జనం ఆశ్చర్యపోయేవారు. సామాజిక ప్రయోజనంతో పని చేయవలసిన ఈ సంస్థలు వ్యాపార ప్రకటనలు ఇవ్వటమేమిటన్న ప్రశ్న వేసేవారు. ఒకప్పుడు లంచం అడిగినవారిని లంచావతారులుగా ఈసడించుకునేవారు. క్రమంగా లంచం తిన్నా పని చేశారులే అని సర్దుకుపోయే ధోరణి వచ్చింది. అక్కడనుంచి లంచం తింటే తప్పేముంది? లంచం తీసుకోనివారెవరు? అని సమర్ధించేవరకూ చేరింది. లాబీయింగ్‌కు గౌరవప్రదమైన స్థానం వచ్చేసింది. చివరకు ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో లంచం కూడా చట్టబద్ధమైంది. అవినీతికి, పెట్టుబడికి మధ్య ఉన్న బంధం అలాంటిది. ఓటు, ఎమ్మెల్యే టిక్కెట్టు, ఎంపీ టిక్కెట్టు, మంత్రి పదవి కూడా సరుకులుగానే మారాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్‌ఎస్ శాసనసభ్యులతో బీజేపీ చేసిన బేరసారాలు కూడా ఇలాంటివే. జనసేన పార్టీ ప్రారంభించిన పవన్‌కళ్యాణ్ వారం రోజుల్లోనే మోడీ దగ్గర పార్టీని బేరం పెట్టారు. రాజకీయ నాయకులు హోర్డింగుల ద్వారా ప్రకటనలు ఇవ్వటం కూడా ఇలాంటివే. ప్రజల కోసం పని చేస్తూ, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ ప్రజలకు నాయకులు కావాలి. ఈ పని చేయనపుడు ప్రజల్లో గుర్తింపు ఉండదు కదా. పెట్టుబడి పెట్టి లాభం సంపాదించడం కోసం రాజకీయాలలోకి వస్తున్నపుడు ఇలాంటి ప్రకటనల ద్వారా తమను తాము ప్రచారం చేసుకుంటారు. గుర్తింపుకు తాపత్రయపడతారు. ఇదంతా భవిష్యత్తు లాభాలకు పెట్టుబడి. రాజకీయాలలో కూడా పెట్టుబడి పెట్టి అధికారానికి వచ్చేవారు పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాకుండా ప్రజల ప్రయోజనాలు చూడరు కదా. రూ.లక్షల కోట్లు ఎగవేతకు పాల్పడుతున్న పెద్దపెద్ద పెట్టుబడిదారుల అప్పులను రద్దు చేయటం లేదా మొండి బకాయిలుగా చూపటం ఇందులో భాగమే.
అవినీతి రొంపిలో కూరుకుపోయిన వైసీపీ అధినేత పాలనలో జరిగిన అదానీ సోలార్ విద్యుత్తు కుంభకోణం ఇప్పుడు బయటపడింది. ఆశ్చర్యకరంగా చంద్రబాబు ప్రభుత్వం ఆ కుంభకోణం సంగతి తేల్చడానికి సిద్ధంగా లేదు. జగన్-అదానీ, చంద్రబాబు- అదానీల బంధం మర్మమేమిటి? బడాబడా పారిశ్రామిక వేత్తలకన్నా సాధారణ, మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్నులే ఎక్కువ కావటం కూడా ఇందులో భాగమే. అయోధ్య కేసు చూసిన ప్రజలకు న్యాయం కూడా సరుకుగా మారిందన్న భయం మొదలైంది. ఆ తీర్పునిచ్చిన కొందరు న్యాయమూర్తులు రిటైర్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలే ఈ భయాందోళనలకు కారణమైనాయి. రాజ్యాంగ ప్రాతిపదికను పక్కనపెట్టి విశ్వాసాల ప్రాతిపదికన తీర్పునివ్వటం చర్చనీయాంశమైంది. ప్రతిదీ సరుకుగా మారటమే పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణం కదా! అదే జరుగుతున్నది. సరుకు స్థానంలో మానవీయ విలువలు చేరాలంటే పెట్టుబడికి పట్టం కట్టే విధానం అంతం కావల్సిందే! పెట్టుబడిదారీ వ్యవస్థ మీద పోరాడవల్సిందే.
ఎస్.వీరయ్య