
గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయ పరిచడమే కాకుండా సమగ్ర సమాచారం సేకరించి ప్రజాప్రతినిధులకు అందించడానికి.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించి ఇటీవలే వారిని రెగ్యులర్ చేసి జీతాలు సైతం పెంచిన విషయం తెలిసిందే. పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ పరిధిలోనే నివసిస్తూ గ్రామ పంచాయతీ ఆధీనంలో పనిచేయాలి. అయితే, ఈ నిబంధనలను తుంగలో తొక్కి వాటికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు పంచాయతీ కార్యదర్శులు. ఐదు రోజుల క్రితం సర్పంచ్ ల పదవి కాలం ముగిసిన పోవడంతో గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. మండలంలో 31 గ్రామ పంచాయతీలుండగా పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో ఉండటం లేదని ఆరోపణలున్నాయి. మల్టీపర్పస్ వర్కర్లలోనే తమకు అనుకూలంగా ఉన్నవారికి ఒకరికి సగం బాధ్యతలు అప్పగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ తీరు మండలంలో ప్రత్యక్షంగా కనబడుతోంది. దీంతో ఇప్పటికీ కొన్ని పంచాయతీల్లో మల్టీ పర్పస్ వర్కర్లలదే హవా కొనసాగుతోంది. దీనంతటికి కారణం మండల అధికారుల నిర్లక్షమేనమి స్పష్టమవుతోంది. కమీషన్లకు కక్కుర్తి పడి కార్యదర్శులను పర్యవేక్షించాల్సిన మండల అధికారులే వారు చేస్తున్న తప్పులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం మండలంలోని కొన్ని గ్రామపంచాయతీ లను పరిశీలిస్తే ఉదయం 11గంటలు దాటుతున్న గ్రామాలలోని గ్రామపంచాయతీ కార్యాలయాలకు తాళాలు వేసి పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో అందుబాటులో లేకపోవడం విశేషం.. గతంలో పంచాయతీ కార్యదర్శులతీరుపై వార్తలు వచ్చినప్పటికి, కొంతమంది మండల అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు వారిని సమర్ధిస్తు వారిని వెనకేసుకొని రావడం ఆశ్చర్యం కలిగిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ విధులను బాధ్యతారహితంగా వ్యవహరించడమే కాక వారి విధులను సైతం మల్టీపర్పస్ వర్కర్లకే అప్పగిస్తూ వాళ్ళు మాత్రం మొక్కుబడికి కార్యాలయానికి వస్తుండటంతో అలాంటి పంచాయతీ కార్యదర్శులు మాకెందుకని, ఇటువంటి వారిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమైందని వివిధ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. తక్షణమే ఇటువంటి బాధ్యతలేని కార్యదర్శులపై జిల్లా అధికారులు చర్యలు తీసుకొని, గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాలని అభివృద్ధి దిశలో నడిపించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామపంచాయతీలో అందుబాటులో లేకపోతే చర్యలు తీసుకుంటాము.. ఎంపీవో గోపి.. ఉదయం 9గంటలకు పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీలలో విధులకు హాజరు కాక పోతే చర్యలు తీసుకుంటాము.