ఒకేషనల్‌ కాలేజీల గుర్తింపునకు దరఖాస్తుల ఆహ్వానం

– తుది గడువు జనవరి 30 : ఇంటర్‌ విద్యా కమిషనర్‌ శ్రీదేవసేన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో షార్ట్‌టర్మ్‌ ఒకేషనల్‌ కోర్సులు నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీలతోపాటు ఎన్జీవోలు నడిపే సంస్థల యాజమాన్యాలు 2024-25 విద్యాసంవత్సరానికి అనుబంధ గుర్తింపు పొందాలని ఇంటర్‌ విద్యా కమిషనర్‌ శ్రీదేవసేన తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. గురువారం నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌ (షషష.రఱఙవ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ) లో సమర్పించాలని కోరారు. దరఖాస్తుల సమర్పణకు వచ్చే ఏడాది జనవరి 30 వరకు గడువుందని తెలిపారు. అనుబంధ గుర్తింపు పొందడంతోపాటు అదనపు సెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. కనీసం రెండు, గరిష్టంగా తొమ్మిది కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. షార్ట్‌టర్మ్‌ ఒకేషనల్‌ కోర్సులు 53 వరకు ఉన్నాయని వివరించారు. దరఖాస్తు, తనిఖీ ఫీజు ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీలకు రూ.200, ప్రయివేటు కాలేజీలకు దరఖాస్తు ఫీజు రూ.500, తనిఖీ ఫీజు రూ.2,500, గుర్తింపు ఫీజు రూ.ఐదు వేలు (ఒక్కో కోర్సుకు), గుర్తింపు పునరుద్ధరణ ఫీజు ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీలు రూ.200, ప్రయివేటు కాలేజీలు రూ.ఐదు వేలు (ఒక్కో కోర్సుకు), కాలేజీ తరలింపు, సొసైటీ, కాలేజీ పేరు మార్పునకు ప్రయివేటు కాలేజీలు రూ.పది వేలు చెల్లించాలని కోరారు.