– గవర్నర్, సీఎం, డిసీఎంలకు ఇన్విటేషన్
హైదరాబాద్ : న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 13 నుంచి 19 వరకు జరుగనున్న ఖోఖో ప్రపంచకప్‌కు రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను రాష్ట్ర ఖోఖో సంఘం ఆహ్వానించింది. ఆరు ఖండాల నుంచి 24 దేశాలు పోటీపడుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌కు న్యూఢిల్లీలోని ఇంధిరాగాంధీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. తెలంగాణ ఖోఖో సంఘం అధ్యక్షులు, ఆయిల్‌ఫెడ్ కార్పోరేషన్ చైర్మెన్ జంగా రాఘవరెడ్డి టోర్నమెంట్ నిర్వహణ కమిటీ తరఫున ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. తొలిసారి భారత్‌లో జరుగున్న ఖోఖో ప్రపంచకప్ పోటీలను చూసేందుకు తప్పకుండా ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని రాఘవరెడ్డి తెలిపారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, తెలంగాణ ఖోఖో సంఘం కార్యదర్శి కృష్ణమూర్తి, అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు పండుగ ఆనంద్ కుమార్, ఖోఖో సంఘం సభ్యులు పి. రమేశ్ రెడ్డి, కోట్ల అరుణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.