– తెలంగాణ ఒలింపిక్ సంఘానికి దక్కని గుర్తింపు
– జాతీయ క్రీడలకు చెఫ్ డీ మిషన్‌గా శాట్ ఎండీ
– భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు ఉష నిర్ణయం
తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) మళ్లీ సంక్షోభంలో కూరుకుంది. గత నాలుగేండ్లుగా అధ్యక్షుడు లేకుండానే కార్యకలాపాలు సాగించిన టీఓఏ.. ఇటీవల ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డిని ఎన్నకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిబంధనల విరుద్ధంగా సాగిన తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికలను భారత ఒలింపిక్ సంఘం గుర్తించలేదు!. ఉత్తరాఖాండ్‌లో జరుగనున్న జాతీయ క్రీడలకు సైతం చెఫ్ డి మిషన్‌ను ఎంపిక చేసే అధికారం టీఓఏకు ఇవ్వలేదు. దీంతో తెలంగాణ ఒలింపిక్ సంఘం కథ మళ్లీ మొదటికొచ్చింది.
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ ఒలింపిక్ సంఘానికి (టీఓఏ)కు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. న్యాయ పరమైన అడ్డంకులను దాటుకుని ఇటీవల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా.. భారత ఒలింపిక్ సంఘం నుంచి ఎటువంటి గుర్తింపు దక్కలేదు. ఎన్నికల ప్రక్రియ, ఎలక్రోరల్ కాలేజ్ తయారీలో తీవ్రమైన తప్పిదాలు జరిగినట్టు ఐఓఏ భావించటంతో.. తెలంగాణ ఒలింపిక్ సంఘం మరోసారి సంక్షోభంలో కూరుకుంది. 38వ జాతీయ క్రీడలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖాండ్‌లో జరుగనున్నాయి. జాతీయ క్రీడల్లో పోటీపడే రాష్ట్రాల నుంచి చెఫ్ డీ మిషన్ అధికారుల ఎంపిక సాధారణంగా రాష్ట్ర ఒలింపిక్ సంఘాలకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) కార్యవర్గం సమావేశమై.. చెఫ్ డి మిషన్‌ను ఎంపిక చేసింది. ఇక్కడ తెలంగాణ ఒలింపిక్ సంఘానికి గుర్తింపు ఇవ్వని ఐఓఓ.. జాతీయ క్రీడలకు తెలంగాణ జట్లను పంపేందకు వీలుగా సొంతంగా చెఫ్ డి మిషన్ అధికారులను స్వయంగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఐఓఏ అధ్యక్షురాలు పి.టి ఉష జనవరి 6న రాష్ట్ర ప్రభుత్వ క్రీడల ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌కు ఓ లేఖ ద్వారా సమాచారం అందించారు.
చెఫ్ డి మిషన్‌గా శాట్ ఎండీ :
జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ బృందానికి చెఫ్ డి మిషన్‌గా ఐఎఫ్‌ఎస్ అధికారిణి సోనీబాలా దేవి వ్యవహరించనున్నారు. సోనీ బాలాదేవి ప్రస్తుతం తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) వైస్ చైర్మెన్, ఎండీగా కొనసాగుతున్నారు. డిప్యూటీ టీఓఏ మాజీ కోశాధికారి, తెలంగాణ పెంటాథ్లాన్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర్, ఆర్చరీ సంఘం కార్యదర్శి సంజీవ్ రెడ్డిలను ఎంపిక చేశారు. ఈ మేరకు ఐఓఏ అధ్యక్షురాలు పి.టి ఉష లేఖ రాశారు. చెఫ్ డి మిషన్ నియామకంతో తెలంగాణ నుంచి జాతీయ క్రీడల్లో పోటీపడే జట్లు, క్రీడాకారుల ఎంపిక ఇతర అంశాల నుంచి తెలంగాణ ఒలింపిక్ సంఘాన్ని దూరం చేసినట్టు అయ్యింది.
ఎందుకీ నిర్ణయం? :
తెలంగాణ ఒలింపిక్ సంఘం పనితీరు, ఎన్నికల ప్రక్రియపై ఐఓఏకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో టీఓఏలో ఏం జరుగుతుందో తెలుసుకుని నివేదిక ఇవ్వాలని ఏక సభ్య కమిటీని సైతం నియమించింది. ఓ వైపు ఐఓఏ నియమిత కమిషనర్ నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. మరోవైపు టీఓఏకు ఎన్నికలు నిర్వహించారు. భారత ఒలింపిక్ సంఘం నిబంధనల ప్రకారం జిల్లా ఒలింపిక్ సంఘాలకు ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు. కానీ తెలంగాణలో జిల్లా సంఘాలకు ఓటు హక్కు కల్పించారు. ఇక 70 ఏండ్ల పైబడిన వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఒకవేళ ఎన్నికైన కొంత కాలం తర్వాత 70 ఏండ్ల వయసు వస్తే అప్పటి నుంచి పదవిలో కొనసాగేందుకు అర్హత కోల్పోతారు. ఇక ఎలక్ట్రోరల్ కాలేజ్ (ఓటర్ల జాబితా) తయారీలోనూ పారదర్శకత లోపించిందని భారత ఒలింపిక్ సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. దీంతో తెలంగాణ ఒలింపిక్ సంఘానికి ఇటీవలే ఎన్నికలు ముగిసి, నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టినా… ఐఓఏ నుంచి గుర్తింపు లభించలేదు.
ఒలింపిక్ అసోసియేషన్ రూల్స్ ప్రకారం రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ఐఓఏ నుంచి పరిశీలకులు వస్తారు. పరిశీలకులు లేకుండా జరిగిన ఎన్నికలను గుర్తించరు. జిల్లా ఒలింపిక్ సంఘాలు, రాష్ట్ర క్రీడా సంఘాల ఎన్నికలకు సైతం టీఓఏ పరిశీలకులను పంపిస్తుంది. లేకుంటే, ఆ ఎన్నికలను అధికారికంగా గుర్తింపు ఇవ్వదు. ఐఓఏ పరిశీలకుడు లేకుండా జరిగిన ఎన్నికలకు గుర్తింపు ఉండదని తెలంగాణ ఒలింపిక్ సంఘం పెద్దలకు తెలిసినా.. నిబంధనలను తుంగలో తొక్కి ఎన్నికల ప్రక్రియను ముగించారు.
అడ్‌హాక్ కమిటీకి చాన్స్? :
జాతీయ క్రీడలకు తెలంగాణ జట్లను పంపించే అధికారం, చెఫ్ డి మిషన్ నియామకం అధికారాన్ని లాగేసుకున్న భారత ఒలింపిక్ సంఘం.. త్వరలోనే తెలంగాణ ఒలింపిక్ సంఘం నిర్వహణ బాధ్యతలను సైతం చేతుల్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జాతీయ స్పోర్ట్స్ కోడ్, ఒలింపిక్ నిబంధనలను పాటిస్తూ.. ఎన్నికలు నిర్వహించే వరకు అసోసియేషన్ రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, మంగళవారం ఎల్బీ స్టేడియం ఆవరణలోని ఒలింపిక్ భవన్‌లో ఏపీ జితేందర్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఒలింపిక్ సంఘం సమావేశమైంది. కార్యదర్శి మల్లారెడ్డి, కోశాధికారి సతీశ్ గౌడ్ సహా ఆఫీస్ బేరర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. అర్బిట్రేషన్, వివాద పరిష్కార కమిటీలను ఏర్పాటు చేస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భారత ఒలింపిక్ సంఘం తీసుకున్న నిర్ణయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు.