– కోల్‌కతలో తొలి, ఫైనల్ మ్యాచ్
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మార్చి 21 నుంచి ఆరంభం కానుంది. ఆదివారం ముంబయిలో సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ మేరకు ఐపీఎల్ షెడ్యూల్‌పై చర్చించింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కత నైట్‌రైడర్స్ సొంత మైదానం ఈడెన్‌గార్డెన్స్‌లో ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆరంభ వేడుకలు, ముగింపు వేడుకలకు చేయాల్సిన ఖర్చు సహా ఇతర అంశాలపై గవర్నింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ మెగా వేలం సమయంలో ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 15న ఆరంభం అవుతుందని, మే 25న ఉంటుందని ప్రకటించారు. కానీ చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న షురు కానుండగా.. మార్చి 9న ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మ్యాచులకు, ఐపీఎల్‌కు రెండు వారాల సమయం ఉండాలని మార్చి 21న ఐపీఎల్ తొలి మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను విస్తరించేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా డబ్ల్యూపీఎల్ వేదికలను పెంచేందుకు నిర్ణయించింది. ముంబయి, బెంగళూర్‌తో పాటు బరోడ, లక్నోలోనూ మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచులను నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.