– విదేశీ ఊహాగానాలకు చెక్
– త్వరలోనే పూర్తి షెడ్యూల్
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ పూర్తిగా భారత్‌లోనే జరుగనుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ రెండో దశ మ్యాచులను విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్ షెడ్యూల్ విడుదల కావటంతో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌పై భారత క్రికెట్ వర్గాలు కసరత్తు చేయనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. ఐపీఎల్ 17పై స్పందించిన జై షా ‘ఈ సీజన్ ఐపీఎల్ పూర్తిగా భారత్‌లోనే జరుగుతుంది. విదేశాల్లో నిర్వహించే ఆలోచన బోర్డుకు లేదు’ అని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరుగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. ఐపీఎల్ 17 సీజన్ తొలి దశ షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశారు. మార్చి 22న ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఆడనుంది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు 22 మ్యాచులకు షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో త్వరలోనే పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఐపీఎల్ టైటిల్ పోరు మే 26న జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ గతంలోనే తాత్కాలిక పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ప్రాంఛైజీలతో పంచుకున్నట్టు తెలుస్తోంది. దీంతో కోల్‌కత నైట్‌రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ టీమ్ ప్రాక్టీస్ సెషన్లో ఆటగాళ్లతో మాట్లాడుతూ ఫైనల్ మే 26న ఉంటుందని తెలిపాడు. జూన్ 2 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుండగా కనీసం వారం పది రోజుల ముందే ఐపీఎల్‌ను ముగించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తుంది.
18 నుంచి టికెట్లు : ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ టికెట్లు ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్ ధోనికి ఇది ఆఖరు సీజన్ అని అభిమానులు భావిస్తున్న తరుణంలో చెపాక్‌లో జరుగనున్న సీజన్ ఆరంభ మ్యాచ్ టికెట్లకు భారీగా డిమాండ్ ఉండనుంది. కనీస టికెట్ ధర రూ.1700, గరిష్ట టికెట్ ధర రూ.7500గా చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా టికెట్ల ధరలను, ఆన్‌లైన్ భాగస్వామి వివరాలను వెల్లడించింది.