– గరిష్ట టికెట్ ధర రూ.30 వేలు
– కనిష్ట టికెట్ ధర రూ.1500
నవతెలంగాణ, హైదరాబాద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌కు సిద్ధమవుతున్న తెలంగాణ క్రికెట్ అభిమానులకు సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి షాక్ ఇచ్చింది. ఈ సీజన్ టికెట్ల ధరలను అమాంతం పెంచేసిన సన్‌రైజర్స్ యాజమాన్యం.. సగటు అభిమానులు స్టేడియంలో రావటం గగనం చేసింది. ఈ నెల 27న ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌కు టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ఈ మ్యాచ్‌కు టికెట్ ధర కనిష్టంగా రూ.1500గా నిర్దారించారు. దీనికి జిఎస్‌టి అదనం. గరిష్టంగా కార్పోరేట్ బాక్స్ టికెట్ ధర రూ.30 వేలుగా నిర్ధారించారు. ఇతర స్టాండ్స్ టికెట్ల ధరలు రూ.2500, రూ. 4000, రూ. 4500, రూ.7500, రూ.15000, రూ.22000గా ఉన్నాయి. హైదరాబాద్ ఇటీవల వరుసగా క్రికెట్ మ్యాచులకు ఆతిథ్యం వహించింది. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సహా భారత్, ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్‌లకు టికెట్ల ధరలు సాధారణ అభిమానులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. కానీ ఐపీఎల్ టికెట్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం భారీగా పెంచింది. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లను టెర్రస్ 2 నుంచి వీక్షించేందుకు టికెట్ ధర రూ.500-750 వరకు ఉండేది. కానీ సీజన్‌లో ఇదే టికెట్ ధర మూడు రెట్లు అదనంగా ఉండటంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.