తనకు లొంగని దేశాలను కొండచిలువ మాదిరి అమాంతం మింగివేయాలని అమెరికా చూస్తుంది. అయితే దానికి సాధ్యం కావటం లేదు. అందుకే శతవిధాలుగా దెబ్బతీసేందుకు చేయని యత్నం ఉండదు. ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు చేద్దామని ఇజ్రాయెల్ ప్రతిపాదిస్తే.. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వద్దని వారించినట్లు వార్తలు వచ్చాయి. ఎందుకు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. నిజానికి గతంలోనే అలాంటి ప్రయత్నం జరిగింది. నాటంజ్ అణుకేంద్రంలో 2021లో సంభవించిన పేలుడు- విధ్వంసం వెనుక ఇజ్రాయెల్ హస్తం వుందన్నది బహిరంగ రహస్యం. అయితే ఏ మేరకు నష్టం జరిగిందన్నది ఇప్పటికీ వెల్లడి కాలేదు. అణుబాంబు తయారీ నుంచి ఇరాన్ వెనక్కు తగ్గాలంటూ 2015లో ఒక ఒప్పందం కుదరింది. డోనాల్డ్ ట్రంప్ తొలిసారి అధికారానికి వచ్చిన తరువాత 2018 మే నెలలో దాన్నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకుంది. దాంతో ఇరాన్ తన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. ఎంత వేగంగా అణ్వాయుధాన్ని చేయగలదు, దానికి ఉన్న అవకాశాలు, అవరోధాలు ఏమిటని ఆ రంగ నిపుణులు తర్జన భర్జన పడుతున్నారు. అణుపరీక్ష జరిపితే అధికారికంగా గుర్తింపు పొందిన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలుగాక అణ్వాయుధాలు ఉన్నట్టు ప్రకటించిన భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా, సరసన అణ్వాయుధాలున్న పదవ దేశంగా ఇరాన్ అవతరిస్తుంది. ట్రంపు ఆ దిశగా నెట్టేట్లు కనిపిస్తున్నాడు.
కొందరి అంచనా ప్రకారం అణ్వాయుధ రూపకల్పనలో కీలకమైనది బాగా శుద్ధి చేసిన యురేనియం. దాన్ని సమకూర్చుకున్న తరువాత కొన్ని నెలలు లేదా గరిష్టంగా ఒక ఏడాది కాలంలో ఆయుధం అందుబాటులోకి వస్తుందని కొందరు చెబుతున్నారు. అయితే చైనా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే కేవలం మూడు నుంచి ఐదు వారాల్లోనే సిద్ధం చేయవచ్చన్నది ఒక అభిప్రాయం. ఏడాదైనా-ఐదు వారాలైనా ఇరాన్ అణ్వాయుధం తయారు చేయగలదన్నదే అమెరికాకు పట్టుకున్న భయం. అందుకే 2024లో అణుకేంద్రాలపై దాడి చేసేందుకు జో బైడెన్ సంశయించటం లేదా వద్దని వారించటం వెనుక ఉన్న అసలు కారణం అని చెప్పవచ్చు. ఆయుధ తయారీలో ఒకటి అణు సంబంధిత పదార్ధాలు, రెండవది అణేతర పరికరాలు కావాలి. ముందు అణు పదార్ధాలు సమకూరిన తరువాతే ఇతర పరికరాలకు రూపకల్పన చేయటం అమెరికా, ఇతర దేశాల అనుభవం. అదే చైనా విషయానికి వస్తే రెండింటి తయారీ సమాంతరంగా ఏకకాలంలోనే ప్రారంభించి తక్కువ వ్యవధిలో రూపొందించి పరీక్ష చేయటం మరో ప్రక్రియ. ఇప్పుడు ఇరాన్ దీన్నే అనుసరిస్తోందని భావిస్తున్నారు. సమయ అవసరం ఉండదు.
అమెరికా, దానితో జతకట్టిన ఇతర దేశాల బెదిరింపుల పూర్వరంగంలో చైనా తనదైన శైలిలో అణ్వాయుధ రూపకల్పన చేసింది. బహిర్గతమైన సమాచారం ప్రకారం అణుబాంబు తయారీకి అవసరమైన యురేనియం 1964 జనవరి నాటికి సిద్దమైంది. రెండు బాంబులు తయారు చేసేందుకు సమకూర్చుకుంది. దాన్ని ఆయుధంగా రూపొందించ టానికి అవసరమైన ఇతర పరికరాల తయారీ ప్రక్రియను 1963నాటికే సిద్దం చేశారు. దీంతో 1964 మే ఒకటవ తేదీ నాటికి తొలి బాంబు తయారీకి అవసరమైన ఏర్పాట్లను శాస్త్రవేత్తలు-ఇంజనీర్లు సంయుక్తంగా రూపొందించారు. తరువాత అవసరమైన తనిఖీలు, తుది మెరుగులు దిద్ది ఆగస్టు 20 నాటికి రెండు బాంబుల రూపకల్పనకు రంగం సిద్దం చేశారు. క్వింగ్‌హై అణ్వాయుధ కేంద్రంలో మొదటి బాంబును కేవలం మూడు రోజుల్లోనే తయారు చేశారు. తొలి ప్రయోగాల తరువాత దాన్ని విడదీశారు. చైనా తొలి అణుపరీక్ష కేంద్రానికి వాటిని తరలించిన తరువాత కేవలం పది గంటల్లోనే తిరిగి అమర్చి బాంబును తయారు చేశారు. బాంబు తయారీకి అవసరమైన విధంగా యురేనియంలో మార్పులు, ఇతర పరికరాల తయారీ, వాటిని ఒకదగ్గర చేర్చి బాంబుగా మార్చేందుకు మొత్తం పట్టిన సమయం మూడు నుంచి ఐదు వారాలు మాత్రమే. ఆరు దశాబ్దాల క్రితం చైనా వద్ద అవసరమైన ఆధునిక పరికరాలు లేనప్పటికీ స్వయం కృషితో వారాపని చేశారు. ఇప్పుడు ఇరాన్ లేదా మరొక దేశం ఏదైనా బాంబుల తయారీకి పూనుకుంటే అన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. చైనా తయారీ శాంతి కాలంలో జరిగింది. అదే ఇరాన్ ఇప్పుడు ఎదుర్కొంటున్న బెదిరింపుల వంటి పూర్వరంగంలో తలచుకుంటే మూడు వారాల్లోనే తయారు చేయవచ్చని చెబుతున్నారు.
గతంలో ఇజ్రాయెల్ సంపాదించినట్టు చెబుతున్న సమాచారం ప్రకారం 1999 నుంచి 2003వరకు అమద్ ప్లాన్ పేరుతో ఇరాన్ యురేనియం శుద్ధితో సమాంతరంగా బాంబుల తయారీకి అవసరమైన ఇతర ఆయుధ భాగాల రూపకల్పన చేపట్టింది. ఐదు అణ్వాయుధాలను తయారు చేయాలని, వాటిలో మూడింటిని సాహెబ్-3 ఖండాంతర క్షిపణులకు అమర్చాలని, ఒకదానితో భూ గర్భంలో పరీక్ష జరపాలన్నది ఇరాన్ కార్యక్రమంలో ఉన్నట్టు చెప్పారు. ఇదే వాస్తవమైతే చైనా తొలి బాంబుల మాదిరే ఇరాన్ కార్యక్రమం కూడా ఉందని చెబుతున్నారు. పశ్చిమ దేశాల నిపుణుల విశ్లేషణల ప్రకారం అమెరికా 1945లో జపాన్‌లోని నాగసాకి పట్టణంపై వేసిన ఫాట్ మాన్ బాంబు మాదిరే చైనా తన తొలి బాంబుకు రూపకల్పన చేసినట్టు, ఇప్పుడు ఇరాన్ కూడా అదే మాదిరి పథకాలతో ఉందని భావిస్తున్నారు. అయితే చైనా తొలి రూపకల్పనకు, ఫాట్‌మాన్‌కు చాలా తేడా ఉందని కొందరు విబేధిస్తున్నారు. సాంకేతికపరమైన అంశాలు పాఠకులలో అత్యధికులకు అంతగా ఒక పట్టాన ఎక్కేవి కాదు గనుక వాటి జోలికి పోవటం లేదు. ఏ దేశం రూపొందించినా బాంబు బాంబే, దాన్ని ఎక్కడ ప్రయోగించినా అపారనష్టం కలిగిస్తుంది. అమెరికా తన దగ్గర ఎంతటి విధ్వంసక ఆయుధం ఉందో చూడండి అంటూ ప్రపంచాన్ని భయపెట్టేందుకు జపాన్ నగరాల మీద వేసింది తప్ప నిజానికి అవసరం లేదు. ఆ సమయానికి జపాన్ చేతులెత్తేసి లొంగుబాటలో ఉంది, యుద్దం చివరి దశలో ఉంది. ఆ తరువాత అణుకార్యక్రమం చేపట్టిన దేశాలన్నీ కూడా మా ఇల్లు మీకెంత దూరమో మీ ఇల్లు కూడా మాకు అంతేదూరం కబడ్దార్ అమెరికా అని హెచ్చరించేందుకు బాంబులకు రూపకల్పన చేశాయి. ఆధిపత్యం కోసం అమెరికాచేస్తే, ఆత్మరక్షణకు మిగతా దేశాలు పూనుకున్నాయి. అందుకే ప్రతి దేశానికీ అణ్వాయుధం రూపొందించుకొనే హక్కు ఉందని, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ ఒప్పదం వివక్షతో కూడుకున్నదని అనేక దేశాలు భావిస్తున్నాయి. వాటిలో మనదేశం కూడా ఉన్నందున ఆ ఒప్పందం మీద సంతకం పెట్టేందుకు నిరాకరించింది.
ఇరాన్ బాంబుల రూపకల్పన గురించి ప్రపంచానికి అంతగా తెలియదు. ఎంతో రహస్యంగా జరుపుతున్నది. అణు పరిజ్ఞానం కూడా అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నది. పాకిస్థాన్ అణుకార్యక్రమ పితామహుడిగా పరిగణించే అబ్దుల్ ఖాదిర్ ఖాన్ చైనా అణ్వాయుధం 548 నమూనాను లిబియాకు అందచేశాడన్న ఆరోపణ ఉంది.చైనా బాంబుల మాదిరే ఇరాన్ రూపకల్పన కూడా ఉందని కొందరు పోల్చుతున్నారు. అయితే ఇరాన్ కూడా అలా పొందిందా లేదా అన్నది తెలియదు. అణు విద్యుత్ కేంద్రాలున్న ప్రతి దేశమూ అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం శుద్ది చేపట్టే సామర్ధ్యం కలిగి ఉంటుందన్నది ఒక అభిప్రాయం. అందుకే అనేక దేశాల వద్ద అణుబాంబులు ఉన్నాయని చెబుతారు. ఏవిధంగా చూసినప్పటికీ ఇరాన్ వద్ద కావాల్సిన పరిజ్ఞానం ఇప్పటికే ఉన్నదని, ఏ క్షణంలోనైనా బాంబులను రూపొందించగలదని భావిస్తున్నారు. అమెరికా జాతీయ గూఢచార కార్యాలయ అంచనా ప్రకారం 2015 అణు ఒప్పందం జరగటానికి ముందు ఇరాన్ వద్ద అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంలేదని అయితే 2024 జూలై నాటికి చూస్తే అణ్వాయుధ తయారీకి అవసరమైన పరిజ్ఞానంలో మెరుగైన స్థానంలో ఉందని, తలచుకొంటే ఆ పని చేస్తుందని పేర్కొన్నట్లు వార్తలు.అయితే బాంబులను తయారు చేసేదీ లేనిదీ ఇంతవరకు బహిరంగంగా ఇరాన్ సూచన ప్రాయంగా కూడా చెప్పలేదు. గత ఏడాది ఇజ్రాయెల్ చర్యలను, అమెరికా తీరుతెన్నులను చూసిన తరువాత, ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి అదికారానికి వచ్చిన పూర్వరంగంలో ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేయనుందని భావిస్తున్నారు. వివరాలతో నిమిత్తం లేకుండా 2022 నుంచి ఇరాన్ అధికారులు తమ అణుకార్యక్రమం గురించి బహిరంగంగా మాట్లాడటాన్ని పెంచారు. కొన్ని నివేదికల ప్రకారం 70శాతం మంది ఇరాన్ పౌరులు అణ్వాయుధాలు కలిగి ఉండాలని భావిస్తున్నట్లు తేలింది.
తొలిసారిగా ఫాసిస్టు లక్షణాలు గలిగిన డోనాల్డ్ ట్రంప్‌ను అమెరికన్లు గతంలో ఒకసారి, ఇప్పుడు రెండవసారి ఎన్నుకున్నారు. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగిన డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడేం చేస్తారన్న చర్చ ప్రారంభమైంది. తిరిగి ఇరాన్‌తో అవగాహనకు వస్తాడా లేక బెదిరింపులతో నిరోధించేందుకు చూస్తాడా? అణుకేంద్రాల మీద దాడులు చేస్తే ఆ కార్యక్రమం నుంచి వైదొలుగుతుందని ఎవరూ భావించటం లేదు. అక్కడ ఉన్న పాలకులను మార్చి తొత్తులను గద్దెనెక్కించటం లేదా ఇరాన్‌ను భౌతికంగా ఆక్రమించుకోవటం తప్ప మరొక మార్గం లేదని కొందరు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో దీన్లో ఏదీ జరిగేది కాదు. ట్రంప్ వదరుబోతుతనం, ఉన్మాద చర్యలకు పాల్పడితే ఇరాన్ అణుకార్యక్రమం మరింత వేగం అందుకుంటుంది. ప్రచ్ఛన్న యుద్దంలో తామే గెలిచామని అమెరికా చెప్పుకున్నప్పటి నుంచి అణ్వాయుధాలను మరింతగా పెంచుకుంటూ పోతున్నది. ట్రంప్ ఏలుబడిలో ఇంకా పెరిగి ఏటా రెండులక్షల కోట్ల డాలర్ల మేర ఖర్చు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో అమెరికా అనుకుంటున్నది ఒకటి జరుగుతున్నది మరొకటి అన్నట్లుగా పరిణామాలు ఉన్నాయి. అణు ఒప్పందం నుంచి వైదొలిగితే ఇరాన్‌లో ఉన్న పాలకులు అధికారాన్ని కోల్పోయి కొత్తవారు వస్తారనే తప్పుడు సలహాను ట్రంప్ బుర్రలోకి సలహాదారులు ఎక్కించిన కారణంగానే 2018లో వైదొలిగినట్లు ఒక అభిప్రాయం. అయితే దానికి భిన్నంగా అణుకార్యక్రమం మరింత వేగవంతమైంది, పట్టుదల పెరిగింది. తమ పౌర అణుకార్యక్రమం గురించి ట్రంప్ ఈసారి మరింత ఆచరణాత్మక, వాస్తవ ప్రాతిపదికన వ్యవహరిస్తారని, తమతో సంప్రదింపులు ప్రారంభించాలని ఇరాన్ ఉపాధ్యక్షుడు, వ్యూహాత్మక వ్యవహారాలను చూసే నిపుణుడు మహమ్మద్ జావేద్ జరిఫ్ జనవరి మూడవ వారంలో బహిరంగా కోరాడు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో ఈ మాటలు చెప్పాడు. గతంలో తప్పుదారి పట్టించి మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌లను దూరం పెట్టారని కూడా గుర్తు చేశాడు. అమెరికా వైదొలిగిన కారణంగానే తమ కార్యక్రమం మరింత వేగం పుంజుకుందని కూడా చెప్పాడు. తాము అణ్వాయుధాల నిర్మాణం చేయాలనుకోవటం లేదని, అలా అనుకొని ఉంటే ఎప్పుడో చేసి ఉండేవారమన్నాడు. ఇరాన్ వైపు నుంచి వచ్చిన ఈ అవకాశాన్ని డోనాల్డ్ ట్రంప్ వినియోగించుకుంటాడా? తలబిరుసుతనంతో మరింతగా రెచ్చగొట్టి మరో అణ్వాయుధ దేశాన్ని రంగంలోకి తెస్తాడా, బంతి ట్రంప్ కోర్టులో ఉంది.
ఎం కోటేశ్వరరావు
8331013288