ఉద్రిక్తతల సడలింపుపై ఇరాన్‌, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రుల టెలిఫోన్‌ చర్చలు

Foreign Ministers of Iran and Pakistan held telephone talks on de-escalation of tensionsఇస్లామాబాద్‌ : పరస్పర దాడులతో పాకిస్తాన్‌, ఇరాన్‌ల మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు టెలిఫోన్‌ చర్చలు జరుపుతారని భావిస్తున్నారు. తీవ్రవాద స్థావరాలపై దాడుల పేరుతో తొలుత ఇరాన్‌, పాక్‌పై దాడి జరిపింది. దాంతో పాకిస్తాన్‌ ప్రతీకార దాడికి దిగింది. ఇరు పక్షాల విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు సుహృధ్భావ సందేశాలను పంపుకున్న తరుణంలో తాజా పరిణామం నెలకొంది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జలీల్‌ అబ్బాస్‌ జిలానీ, హుస్సేన్‌ అమిర్‌ అబ్దుల్లాలు సమావేశం కానున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒకటి రెండు రోజుల్లో పరిస్థితులను చక్కదిద్దే దిశగా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఇరు పక్షల మధ్య విశ్వాసం పునరుద్ధరించడం ఇక్కడ చాలా ముఖ్యమైన అంశమని పాక్‌ విదేశాంగ కార్యాలయం అదనపు కార్యదర్శి వ్యాఖ్యానించారు. మిలటరీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లతో పాక్‌ ప్రధాని శుక్రవారం అత్యవసర భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సంయమనంతో వుండాలి ఐక్యరాజ్యసమితి, అమెరికా పిలుపు
సంయమనం పాటించాల్సిందిగా ఐక్యరాజ్య సమితి, అమెరికాలు శుక్రవారం ఇరాన్‌, పాకిస్తాన్‌ల కు పిలుపిచ్చాయి. ఉద్రిక్తతలు రెచ్చగొట్టకుండా ఇరు పక్షాలు గరిష్టంగా సంయమనంతో వ్యవహరించా లని ఐక్యరాజ్య సమితి చీఫ్‌ ఆంటానియో గుటెరస్‌ కోరారు. ఇటీవల దాడుల పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ మాట్లాడుతూ, ఇక్కడ పరిస్థితులను అమెరికా నిశితంగా పర్యవేక్షి స్తోందన్నారు. పాక్‌ అధికారులతో నిరంతరంగా సంబంధాలను కలిగివుందన్నారు. ఇలాంటి ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య మరోసారి పెచ్చరిల్ల కూడదని భావిస్తున్నట్లు కిర్బీ తెలిపారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ రూపంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదన్నారు.