ఒకవైపు గాజా నుంచి సైన్య ఉపసంహరణ వార్తలు, మరోవైపు ఆలోగా మిగిలి ఉన్న నివాసాలను పూర్తిగా నాశ నం చేయటం, సాధ్యమైనంత మంది పాలస్తీనియన్ల ప్రాణా లను హరించేందుకు వైమానిక, టాంకులతో ఇజ్రాయిల్ మిలిటరీ విరుచుకుపడుతున్నట్లు సమాచారం. నిబంధనలను తోసిరాజని అమెరికా భారీ ఎత్తున మిలిటరీ సాయం. పాలస్తీనా జాతిని తుడిచి పెట్టేందుకు పూనుకున్న ఇజ్రాయిల్ మీద విచా రించాలంటూ అంతర్జాతీయ కోర్టు (ఐసిజె)లో దక్షిణాఫ్రికా కేసు దాఖలు. ఎమెన్ కేంద్రంగా ఉన్న హౌతీ సాయుధులు ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు, వారి మీద అమెరికా యుద్ధనౌకల నుం చి ప్రతిదాడులు. పది మంది హౌతీల మరణం, ఈ పూర్వరంగంలో మంగళవారం నాడు ఎర్ర సముద్రంలోకి ఇరాన్ తన యుద్ధనౌక అల్‌బోర్జ్‌ను నడిపింది. ఈ పరిణామంతో అంతర్జాతీయ మా ర్కెట్లో స్వల్పంగా ముడిచమురు ధరలు పెరిగాయి. హిందూ మహా సముద్రంతో ఎర్రసముద్రాన్ని కలిపే ఏడెన్ జలసంధి నుంచి ఎర్ర సముద్రం దక్షిణ ప్రాంతంలోకి ఇరాన్ నౌక ప్రవే శించింది. తాము కూడా ఆ ప్రాంతంలో ప్రయాణించే నౌక లకు రక్షణ కల్పించేందుకే అని ఇరాన్ ప్రకటించింది. అదే పేరుతో అమెరికా, బ్రిటన్ ఇతర దేశాల నౌకలు ఉన్నాయి. 2009 నుంచి నియమిత కాలాల్లో తమ నౌక ఆ ప్రాంతంలో గస్తీకి రావటం మామూలేనని, ఎవరికీ చెందని జలాల్లోకి ఇ తర దేశాల యుద్ధ నావలు ఎలా వస్తున్నాయో తమది కూడా అంతేనని ఇరాన్ చెప్పింది.2021లో ఏడెన్ జలసంధిలో రెండు చమురు టాంకర్లపై సముద్ర దొంగల దాడిని తమ అల్‌బోర్జ్ తిప్పికొట్టిన అంశాన్ని గుర్తు చేసింది. ఎర్ర సము ద్రంలో నౌకల స్వేచ్చా విహారానికి విఘాతం కలిగిస్తున్న హౌతీల మీద ప్రత్యక్ష చర్యకు దిగుతామని బ్రిటన్ బెదిరిం చింది. ఇవీ మధ్యప్రాచ్యంలో వర్తమాన పరిణామాలు.
పాలస్తీనా జాతిని తుడిచిపెట్టి, గాజా ప్రాంతాన్ని నామ రూపాల్లేకుండా చేసేందుకు పూనుకున్న ఇజ్రాయిల్ మీద విచారణ జరపాలని దక్షిణాఫ్రికా ఐసిజెలో కేసు దాఖలు చేసింది. పాలస్తీనియన్లు యూదు దురహంకారుల అణచివే తకు గురవుతున్నట్లే శతాబ్దాల తరబడి శ్వేత జాతి దుర హంకారుల వివక్ష, అణచివేతకు దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్లు బలైన సంగతి తెలిసిందే. ఆ బాధ ఏమిటో వారికి తెలిసి నంతగా మరొకరికి అవగతం కాదు, ఈ కారణంగానే పాలస్తీ నియన్లకు మద్దతుగా కేసుదాఖలు చేసినట్లు భావిస్తున్నారు. అది ఏమౌతుందో చెప్పలేము గానీ ఇజ్రాయిల్ మీద ఒత్తిడి పెంచుతుంది. బహుశా దాని ప్రభావం వల్లనే పెద్ద సంఖ్య లో సేనలను గాజా నుంచి వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటిం చిందా? అబ్బే అదేమీ లేదు, పోరులో ఉన్నవారికి విశ్రాంతి నిచ్చేందుకు, వారి స్థానంలో కొత్తవారిని దించుతామని ఇజ్రాయిల్ అధికారులు ప్రకటించింది వాస్తవమా? చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు గాజాలో ఇరవై రెండువేల మందికి పైగా పౌరులను చంపారు. ఎనిమిది వేల మంది హమాస్ తీవ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయిల్ చెప్పుకోవటం తప్ప దానికి తగిన ఆధారాలను చూపలేదు, ఎవరూ నమ్మ టం లేదు. ఈ ఏడాది అంతటా తమ దాడులు కొనసా గుతాయని ప్రకటించారు. అంతర్జాతీయ వ్యవస్థలో ఐసిజె సివిల్ కోర్టు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసిసి) నేరాలను విచారిస్తుంది. ఐరాసలో రెండు దేశాలూ సభ్యులే కనుక కోర్టు నిర్ణయాలకు బద్దులు కావాల్సి ఉంది.తమ దేశంలో 1994లో అంతమైన జాత్యంహకార పాలనలో శ్వేతజాతి మైనారిటీలు జనాన్ని బలవంతంగా వేర్వేరుగా ఉంచారని, ఇప్పుడు ఇజ్రాయిల్ విధానాలు కూడా అలాగే ఉన్నట్లు దక్షి ణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా చెప్పాడు. అక్టోబరు ఏడు నుంచి గాజాలో ఇజ్రాయిల్ చర్యలు జాతుల అంతంపై ఐరాస తీర్మానాలకు విరుద్దంగా ఉన్నాయని అందువలన తక్షణమే విచారణ జర పాలని కోర్టును దక్షిణాఫ్రికా అభ్యర్ధించింది. గాజాలో కాల్పుల విరమణ జరిపేవరకు ప్రిటో రియాలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించటమే గాక అన్ని రకాల దౌత్య సంబంధాలను పక్కన పెడు తున్నట్లు దక్షిణాఫ్రికా చాలా రోజుల క్రితమే ప్రకటించింది. తమ మీద చేసిన అభియోగాలకు ఆధారం లేదని, రక్తపు మర కలను తమకు అంటిస్తున్నారని ఇజ్రాయిల్ ఆరోపిం చింది. గాజాలోని పౌరులు తమకు శత్రువులు కాదని చెప్పుకుంది. మరోవైపు గాజాలో అమాయకు లెవరూ లేరని ఇజ్రాయిల్ అధ్యక్షుడు హర్‌జోగ్ ప్రక టించాడు. అక్కడి జనం మానవ మృగాలు గనుక వారికి సామూహిక శిక్ష విధిస్తామని రక్షణ మంత్రి చెప్పాడు. ప్రధాని నెతన్యాహు బైబిల్‌లోని అంశా లను ఉల్లేఖించటం జాతి నిర్మూలనకు పిలుపుని వ్వటం తప్ప మరొకటి కాదని అనేక మంది చెప్పా రు. దక్షిణాఫ్రికా చర్యను పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వశాఖ స్వాగతించింది. వెంటనే కోర్టు స్పందించాలని, పౌరులకు మరింత హాని జరగకుండా చూడాలని కోరింది.
గాజాలో ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా ఎర్ర సముద్రం లోని బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి ద్వారా రాకపోకలు సాగి స్తున్న నౌకలపై తాము దాడులు చేస్తామని ఎమెన్ కేంద్రంగా ఉన్న హౌతీ సాయుధ దళాలు ప్రకటించాయి. తమ సేనలు మూడు హౌతీ పడవలను ముంచివేసి పదిమందిని హతమా ర్చినట్లు అమెరికా వెల్లడించింది. తొలిసారిగా ప్రత్యక్ష దాడుల కు దిగటం ఇదే ప్రధమం. ఎమెన్ కాలమానం ప్రకారం ఆది వారం నాడు ఉదయం ఆరున్నర గంటలకు హంగఝౌ అనే కంటెయినర్ నౌక మీద చిన్న పడవల నుంచి దాడులు జరగ టంతో తమను రక్షించాలని నౌకలో ఉన్నవారు కోరిన వెంటనే యుద్ధ నౌకలు, కొన్ని హెలికాప్టర్లను పంపి హౌతీలపై అమెరి కన్లు దాడులు జరిపారు. బహుళజాతి సముద్రయాన రక్షణ దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబరు 19న అమెరికా ప్రక టించగా సుముఖత చూపిన పందొమ్మిది దేశాలు సంతకాలు చేసినప్పటికీ కేవలం తొమ్మిది మాత్రమే ఈ ప్రయత్నంలో ఉన్నట్లు తమ పేర్లు పేర్కొనాలని చెప్పాయి. ఒక్క బ్రిటన్ మా త్రమే తమ యుద్ధ నౌకలను పంపింది. అనేక అరబ్బు దేశాలు పరిణామాలు, పర్యవసానాల గురించి ఆందోళన చెందుతు న్నాయి. ఇజ్రాయిల్‌కు సంబంధం ఉన్న నౌకల రక్షణకు తా మెందుకు మద్దతు ఇవ్వాలని అవి ఆలోచిస్తున్నాయి. హౌతీల దాడుల గురించి అమెరికా రక్షణశాఖ ఆందోళన చెందు తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. హౌతీలు కేవలం రెండువేల డాలర్ల విలువగల డ్రోన్లతో దాడులు చేస్తుంటే తాము 21 లక్షల డాలర్ల విలువగల క్షిపణులను వాటిని కూల్చేందుకు వినియోగించాల్సి రావటం భారంగా భావిస్తున్నట్లు చెబుతు న్నారు. గడచిన రెండు నెలల కాలంలో ఎర్రసముద్రంలో 38 డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా చెప్పుకుంది. ఇరాన్ తయారు చేస్తున్న డ్రోన్ల కనిష్ట ధర రెండు వేల డాలర్లు కాగా గరిష్టంగా ఇరవైవేల డాలర్లు ఉంది. ప్రస్తుతం అమెరికా మధ్యధరా సముద్రం, ఏడెన్ గల్ఫ్‌కు రెండు విమాన వాహక యుద్ధ నౌకలు, నాలుగు డెస్ట్రాయర్లు, ఒక క్రూయిజర్‌ను పంపింది. సూయజ్ కాలువ ద్వారా హిందూ మహాసము ద్రంలో ప్రవేశించే మార్గం ద్వారా ప్రపంచ వాణిజ్యంలో పన్నెం డు శాతం రవాణా జరుగుతుంది. ఎర్ర సముద్రంలో తలెత్తిన పరిస్థితి కారణంగా నౌకలు గుడ్‌హౌప్ ఆగ్రం వరకు వెళ్లి ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వచ్చే పాత మార్గానికి మళ్లుతున్నాయి. ఇది ఖర్చుతో పాటు ప్రయాణ సమయాన్ని కూడా పెంచు తుంది. ఇజ్రాయిల్ చెబుతున్నట్లు ఈ ఏడాది అంతా గాజా మీద దాడులు జరిపితే ఎర్రసముద్రంలో దాడులు కూడా కొన సాగుతాయి. ఎవరి ఎత్తుగడలు వారికి ఉంటాయి. అమెరికా నేరుగా రంగంలోకి దిగటంతో తమ దాడులను కూడా తీవ్రం చేస్తామని హౌతీలు ప్రకటించారు.
పశ్చిమాసియా, ఉక్రెయిన్ సంక్షోభాలలో డ్రోన్ల వినియో గం యుద్ధ తీరుతెన్నులనే మార్చివేసిందంటే అతిశయోక్తి కాదు. భారీ ఖర్చుతో కూడిన అమెరికా, ఇతర నాటో దేశాల ఆధునిక ఆయుధాలు స్వల్ప ఖర్చుతో రూపొందించే నాటు రకం డ్రోన్లను కూల్చేందుకు ఉపయోగించాల్సి రావటం ఎంతో వ్యయంతో కూడుకున్నది. అందువలన ఇప్పుడు డ్రోన్లను కూ ల్చేందుకు శక్తివంతమైన లేజర్ కిరణాలను పంపే విధంగా కొత్త వ్యవస్థలను రూపొందించాల్సిన అగత్యం అమెరికాకు ఏర్పడింది. రష్యా ఇప్పటికే తన డ్రోన్లు పనిచేయకుండా స్థం భింపచేసే ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను వమ్ము చేసేందుకు మాజిక్ రేడియో పేరుతో రక్షణ కల్పిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.దీన్ని బట్టి రానున్న రోజుల్లో సినిమాల్లో మాదిరి కిరణాల యుద్ధాలు జరగనున్నాయని చెప్పవచ్చు. శక్తివంతమైన లేజర్ కిరణాలను పంపి డ్రోన్లు, క్షిపణుల మీద దాడి చేసినపుడు వాటినుంచి వెలువడే ఉష్ణం వాటి ని మండించి పనికి రాకుండా చేస్తుంది. హమస్, హౌతీ సాయుధులు ఉపయోగిస్తున్న మానవ రహిత ఆత్మాహుతి డ్రోన్లతో అమెరికా రక్షణశాఖను ఆతురతలోకి నెట్టారు. ఈ డ్రోన్లన ఇరాన్ వీరితో పాటు రష్యాకూ సరఫరా చేస్తున్నది. వాటితో ఉక్రెయిన్ మౌలిక సదుపాయాల వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న సంగతి తెలిసిందే.కేవలం యాభైవేల డాలర్ల విలువ గల రష్యా డ్రోన్లను కూల్చేందుకు అమెరికా అందచేసిన 30లక్షల డాలర్ల ఖరీదు చేసే పేట్రియాట్ క్షిపణులను జెలెన్‌స్కీ సేనలు ప్రయోగిస్తున్నాయి. వీటిని ప్రయోగించే మొత్తం వ్యవస్థకయ్యే ఖర్చు 110 కోట్ల డాలర్లు. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు ఉక్రెయిన్ వద్ద నిండుకున్నట్లు, అందుకే పరిమి తంగా వాటిని వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. డ్రోన్ల గుంపు అంటే ఎన్ని అన్నది కూడా అర్ధంకాని స్థితి ఉంది.కొన్ని డజన్లు అంత కంటే ఎక్కువ దూసుకువచ్చినపుడు శక్తివంతమైన లేజర్ కిరణాలు వాటన్నింటినీ కూల్చివేసే అవకాశం లేదని చెబుతున్నారు. వీటిని ప్రయోగించాలంటే వాటిని ఉంచిన కేంద్రాలలో నిరంతరం విద్యుత్ సరఫరా కూడా ఉండాలి.
తాము నిర్మించినవే గనుక ఉక్రెయిన్‌లో విద్యుత్ సరఫరా వ్యవస్థలన్నీ రష్యన్లకు కొట్టినపిండి. ఇరాన్ సరఫరా చేసిన దీర్ఘ శ్రేణి డ్రోన్లలో ముందుగానే లక్ష్యాలను నిక్షిప్తం చేసి వదులు తున్నందున అక్కడి వ్యవస్థలను ధ్వంసం చేయగలుగు తున్నాయి. గాజాపై దాడులను విరమించకపోతే తాము ఇజ్రా యిల్‌లో మంటలు రేపుతామని హమాస్ తీవ్రవాదులు హెచ్చ రిస్తున్నారంటే వారి దగ్గర ఇలాంటి డ్రోన్లు ఇప్పటికే చేరి ఉండాలి. ఉక్రెయిన్ వద్ద రాడార్లను, లేజర్ కిరణాలను తప్పిం చుకుంటూ సముద్రాల మీద తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు ఉన్న కారణంగానే అజోవ్ సముద్రంలోని వంతెన పేల్చివేత, సెవాస్తపూల్‌లోని రష్యా నౌకలపై దాడులు సాధ్యమైందని చెబుతున్నారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్ యుద్ధాలలో వీటిని చూసిన తరువాత ప్రపంచ దేశాలలో ఆందోళన తలెత్తుతు న్నది, భారీ ఆయుధాలు, జెట్ విమానాలను కూల్చటమెట్లా అని ఇప్పటి వరకు ఆలోచిస్తున్న దేశాలు ఇప్పుడు ఇలాంటి చిన్న వాటిని పసిగట్టేవాటిని తయారు చేయటం మీద కేంద్రీకరించాయి.
ఎం కోటేశ్వరరావు
8331013288