ఉక్కు మనిషి బీఎన్‌

ఉక్కు మనిషి బీఎన్‌– స్టన్‌ గన్‌ పట్టి పోరాడిన ధీరుడు
– ప్రజాప్రతినిధిగా ఎంతో అభివృద్ధి
నవతెలంగాణ-మఠంపల్లి
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి నేటి తరానికి ఆదర్శవంతుడు. భీమిరెడ్డిని అందరూ బీఎన్‌ అని అభిమానంగా పిలుస్తారు. బీఎన్‌ అంటే ఒక ధైర్యం, ఒక తెగింపు. ఉక్కు మనిషిగా పిలుచుకుంటారు. ఆయన పోరాట పటిమ అలాంటిది. దున్నేవాడికే భూమి కావాలని.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం 1941 నుంచి 1951 వరకు సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బీఎన్‌ పాత్ర కీలకం.
నేటి సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి కరివిరాల కొత్తగూడెంలో సామాన్య భూస్వామ్య కుటుంబంలో జన్మించారు బీఎన్‌. పేదలకు జరుగుతున్న అన్యాయం, కుల వివక్షపై పోరాటం సాగించేందుకు ఆనాడు తనతోపాటే చెల్లెల్ని, తమ్ముడిని పోరాటాల్లోకి తీసుకొచ్చారు. 1942లో చిలుకూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు బీఎన్‌ తన చెల్లెలు స్వరాజ్యం, తమ్ముడు కుశలవరెడ్డిని వెంటబెట్టుకుని వెళ్లారు. నిజాం సైన్యాలను, జమీందారులను, భూస్వాములను గడగడలాడించిన యోధుడు. చాకలి ఐలమ్మకు చెందిన పంట భూములను కాపాడి కడవెండి దొర గడీని, అతని అనునాయాయులను తరిమికొట్టిన ధీరుడు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగుతున్న రోజుల్లోనే 1948లో హైదరాబాద్‌ను నిజాం సర్కార్‌ భారతదేశంలో విలీనం చేశారు. దీంతో గ్రామాల్లో నిజాం సైన్యాలతో పాటు కేంద్ర బలగాలు మోహరించి సాయుధ దళాలను అణచివేయాలని దాడులు చేశారు. ఈ క్రమంలో 1949లో ఎల్లంపల్లి కొండల్లో జాతీయ నాయకులు కామ్రేడ్‌ సత్యపాల్‌ డాంగ్‌, దేవులపల్లి వెంకటేశ్వరరావుతో కలిసి దళం సమావేశమైంది. ఈ విషయాన్ని గుర్తించిన నిజాం సైన్యాలు కొండను చుట్టుముట్టంతో అప్రమత్తమైన బీఎన్‌ ఒక చేత్తో చంటి పిల్లాడిని సంకలో వేసుకొని, మరో చేతితో స్టన్‌ గన్‌తో నిజాం మూకలపై కాల్పులు జరిపారు. ఆ విధంగా దళ నాయకుల్ని, దళాన్ని కాపాడారు. బీఎన్‌ దళ నాయకుడిగా పాత సూర్యాపేట, దేవరుప్పల్‌, ఆలేరు, కరీంనగర్‌, ఖమ్మం తదితర ప్రాంతాల్లో పని చేశారు.
ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో..
పోరాట విరమణ అనంతరం ప్రజాప్రతినిధిగా 1957 నుంచి 62 వరకు సూర్యాపేట ఎమ్మెల్యేగా, 1967 నుంచి 1971 వరకు నాగారం ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్టీ చీలిక అనంతరం సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. పార్టీ విస్తరణలో విశేష కృషి సల్పారు. మిర్యాలగూడ ఎంపీగా 1971, 1984, 1991లలో గెలిచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మం రైల్వే స్టేషన్‌ కోసం కృషి చేశారు. పార్లమెంట్‌లో బీయన్‌ మైక్‌ కట్‌ చేసినా రెండ్రోజులు అలాగే ప్రసంగం సాగించి రైల్వే స్టేషన్‌ సాధించారు. ఏ ప్రాంతంలో కార్యకర్తకు ఆపద వచ్చినా నేనున్నానంటూ.. వెంటనే అక్కడ వాలిపోయేవారు. ప్రజల హృదయాల్లో, తెలంగాణ రేణువుల్లో, దేశంలో జరిగిన భూసంస్కరణలో బీఎన్‌ కనిపిస్తారు. నేడు దేశంలో జరుగుతున్న అనేక భూపోరాటాలకు నాంది నాటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆ పోరాటంలో పాల్గొన్న ప్రతి వ్యక్తి, నాయకుడూ గొప్ప చరిత్ర ఉన్నవారే.
కుటుంబ నేపథ్యం
తండ్రి రాంరెడ్డి, తల్లి చొక్కమ్మ. బీఎన్‌కు ఇద్దరు చెల్లెళ్లు శశిరేఖ, స్వరాజ్యం, తమ్ముడు కుశలవ రెడ్డి. బీఎన్‌కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
బండెనక బండికట్టి..
బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో వస్తవ్‌ కొడుకో.. నా కొడక ప్రతాపరెడ్డి.. అనే పాట పాడిన యాదగిరి బీఎన్‌ దళ సభ్యుడే. పోరాటంలో ఒక్కొక్కరుగా ఒరిగిపోతూ నాలుగు వేలమంది అమరులైనా మొక్కవోని ధైర్యంతో మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు స్థాపించి, పదిలక్షల ఎకరాల భూములు పంచిన దాంట్లో బీఎన్‌ పాత్ర మరువలేనిది.