సామాజిక తనిఖీలో బయటపడిన అక్రమాలు

Irregularities found in social inspection– రూ. 7.15 లక్షల నిధులు పక్కదారి 
– చెట్లు లేకపోయినా డబ్బులు చెల్లింపు
– నామమాత్రంగా సాగిన సామాజిక ‘తనిఖీ’ 
– పారదర్శకత కోసమే తనిఖీలు: ఏపీడీ శాంత కుమారి 
నవతెలంగాణ – పెద్దవంగర
మండల కేంద్రంలోని రైతు వేదికలో గత రెండు రోజులుగా నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక మంగళవారం ముగిసింది. మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో 1 ఏప్రిల్ 2023 నుండి 31 మార్చి 2024 వరకు జరిగిన ఉపాధి హామీ పనులు, పంచాయతీరాజ్ పనులు, మన ఊరు-మన బడి పనులపై నిర్వహించిన సామాజిక తనిఖీ నామమాత్రంగా సాగింది. ఈ తనిఖీల్లో ఓ శాఖకు సంబంధించిన అధికారి లేకుండానే తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు కేటాయించిన జిల్లా రిసోర్స్‌ పర్సన్లు నివేదికలను చదివి సభా దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధి, పీఆర్, మన ఊరు -మన బడి పనులకు సంబంధించి సుమారు మండలంలో రూ. 9 కోట్లతో పనులు చేపట్టగా, రూ. 7.15 లక్షల నిధులు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ఉపాధి కూలీల మస్టర్ కొట్టివేతలు, పనికి రాని వారికి హాజరు వేయడం, ఒకరికి బదులుగా మరొకరు పనులకు వచ్చినట్లు చూపించడం, హరిత హారం మొక్కల్లో తేడా, ఎవెన్యూ ప్లానిటేషన్‌ పనుల్లో మొక్కలు లేకుండా నీళ్లు పోసినట్టు సొమ్ములు చెల్లింపు..సగం మొక్కలు ఉంటే రెట్టింపు మొక్కలకు నీళ్లు పోసినట్టు, చెట్లు లేకపోయినా డబ్బులు చెల్లింపు, ఉపాధి కూలీల డబ్బుల విషయమై అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన సర్వేలో వెలుగు చూశాయి. దాదాపుగా మండలంలోని అన్ని గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. పలు పనులకు సంబంధించిన రిజిస్టర్లు సక్రమంగా లేకపోవడం పట్ల ఏపీడీ శాంత కుమారి అధికారులను నిలదీశారు.
పారదర్శకత కోసమే తనిఖీలు: ఏపీడీ
సామాజిక తనిఖీలు నిర్వహించి ప్రజా వేదిక ద్వారా పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఏపీడీ శాంత కుమారి తెలిపారు. తనిఖీ బృంద సభ్యులిచ్చిన నివేదికల్లోని తప్పులు పునరావృతం కాకుండా ఉపాధిహామీ సిబ్బంది చూసుకోవాలన్నారు. చక్కటి పని తీరును ప్రదర్శించి జిల్లాకు మంచిపేరు తేవాలన్నారు. నివేదికల ఆధారంగా రూ. 7.15 లక్షల నిధులు రికవరీకి వెళ్లినట్లు తెలిపారు. ఉపాధి పనుల్లో అవకతవకలకు తావులేకుండా సిబ్బంది జవాబుదారీతనంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా అంబుడ్స్ మెన్ అధికారి ఆదాం, ఎంపీడీవో వేణుమాధవ్, ఎస్టీఏ సాయి జ్ఞానేందర్, ఎస్ఆర్పీ కుమార్, రమేష్ ఇన్చార్జి ఏపీఓ బిందు, ఏఈ లు దయాకర్, యుగేంధర్, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.