– పీడీఎస్యూ, ఏఐడీఎస్ఓ, యూఎస్ఎఫ్ఐ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ
– ఓయూలో భారీ ర్యాలీీ
నవతెలంగాణ-ఓయూ
నీట్ ప్రవేశ పరీక్షలో అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పీడీఎస్యూ, ఏఐడీఎస్ఓ, యూఎస్ఎఫ్ఐ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. నీటి లీకేజీకి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి ఉస్మానియా ఉమెన్స్ హాస్టల్ వరకు విద్యార్థులు నల్ల గుడ్డలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉస్మానియా ఉమెన్స్ హాస్టల్ ఎదుట ఎన్టీఏ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష ఫలితాలు నోటిఫికేషన్ నియమ నిబంధనల ప్రకారం ఈనెల 14న విడుదల కావాల్సి ఉండగా పరీక్షల నిర్వహణలో లోపాలు బయటకు రాకుండా ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు ఈనెల 4వ తేదీన విడుదల చేయడం అనేక అనుమానాలకు దారితిస్తున్నాయని తెలిపారు. పరీక్షలో విద్యార్థులకు చిత్ర విచిత్రమైన మార్కులు వచ్చాయని కొంత మంది విద్యార్థులకు 718, 719 మార్కులు ఎలా వచ్చాయని ఎన్టీఏ ఏజెన్సీని ప్రశ్నించారు. యూజీసీ మాత్రం గ్రేస్ మార్కులు కలిపామని చేతులు దులిపెసుకునే ప్రయత్నం చేస్తూ దాటివేసే ధోరణిలో ఉందన్నారు. అలాగే గ్రేస్ మార్కులు కలపాలని నీట్ యూజీ నియమ నిబంధనలలో లేకున్నా ఎలా కలిపారని ప్రశ్నించారు. ఇప్పటికే విడుదలైన పరీక్ష ఫలితాలలో ఒకే పరీక్ష కేంద్రంలో వరుసగా ఉన్న విద్యార్థిలకు ఒకే విధంగా మార్కులు రావడం ప్రవేశ పరీక్ష లోపాలను ఎత్తిచూపుతుందన్నదని తెలిపారు. పేపర్ లికేజీ అయిందని వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ విచారణ చేపట్టకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకునే విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని వారు వాపోయారు.
అలాగే నీట్ ప్రవేశ పరీక్షను కేవలం హిందీ, ఇంగ్లీష్లలో నిర్వహించడం వలన దక్షణాది రాష్ట్రాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ యూజీ పరీక్షను స్థానిక బాషలలో కూడా నిర్వహించి దక్షణాది రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా నీట్ యూజీ ప్రవేశ పరీక్షను నిర్వహించాలని, అక్రమాలపై వస్తున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకుని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకత విద్యా వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించవద్దని హెచ్చరించారు. ఇప్పటికైనా నీట్ పరీక్షలు లీకేజీపై దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తక్షణమే స్పందించి నీట్ పై తమ వైఖరి స్పష్టం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించకుంటే, ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తామని హెచ్చరించారు. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి, ఏఐడీఎస్ఓ మల్లేష్, యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి నాయకులు రంజిత్ ,రాజేష్, నిఖిత్, అభిషేక, నాగరాజు, మహేష్, సూర్య, హరీష్ రాకేష్, శ్రీనాథ్, మమత, మౌనిక స్వప్న, రజితలతోపాటుగా విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.