కోడెల విక్రయాల్లో అక్రమాలు అవాస్తవం

– దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలను అక్రమంగా విక్రయించినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ అంశంలో ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో భక్తులు సమర్పించిన కోడెల సంఖ్య పెరిగిందని అన్నారు. వాటి నిర్వహణ భారంగా మారడంతో కొన్ని మరణించాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల విన్నపాల మేరకు వాటి నిర్వహణకు విధివిధానాలను రూపొందించేందుకు సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ చైర్మెన్‌గా, ఆలయ ఈవో కన్వీనర్‌గా కమిటి ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ రూపొందించిన మార్గదర్శకాల మేరకే జీవో విడుదల చేశామని చెప్పారు. పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌ కార్డు, ఫోన్‌ నెంబర్‌, సంబంధిత మండల వ్యవసాయ అధికారి ధ్రువీకరణ పత్రం ఉంటేనే ఒక రైతుకు రెండు కోడెల చొప్పున పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.