రాపల్లిలో ప్రయివేటు విద్యుత్‌ సైన్యం అక్రమాలు

– ప్రభుత్వ విద్యుత్‌ స్తంభాలు, వైర్లు అపహరణ
– చోద్యం చూస్తున్న మండల విద్యుత్‌ అధికారులు
నవతెలంగాణ – బోనకల్‌
విద్యుత్‌ అధికారులు అనుమతి లేకుండా ఓ ప్రైవేటు విద్యుత్‌ సైన్యం ప్రభుత్వ విద్యుత్‌ స్తంభాలను, వైర్లను అపహరించి యథేచ్ఛగా ఇతర పొలాలలో విద్యుత్తు స్తంభాలు వైర్లను వేస్తున్నారు. ఈ విషయంపై నిలదీసిన గ్రామస్తులను బెదిరింపులకు దిగారు. ‘మా నాయకుడు వేయమన్నాడు, మేము వేసుకుంటున్నాము. మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి’ అంటూ అక్రమంగా ఓ రైతు పొలంలో విద్యుత్తు స్తంభాలు, వైర్లను వేస్తున్న సంఘటన మండల పరిధిలోని రాపల్లి గ్రామంలో గురువారం జరిగింది. ఈ విషయంపై మండల విద్యుత్‌ ఏఈ దొండేటి ఉమామహేశ్వరరావుకి గ్రామస్తులు ఫిర్యాదు కూడా చేశారు. గ్రామస్తులు తోట చలపతి, కొనకల్ల హనుమంతరావు, కే.రాధాకృష్ణ, చల్లా బాబురావు, బి శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రాపల్లి గ్రామంలో వ్యవసాయ పొలాలలో నిరుపయోగంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను, వైర్లను అక్రమంగా దొంగలిస్తూ రాపల్లి గ్రామానికి చెందిన కొండపల్లి బిక్షంరెడ్డి వ్యవసాయ పొలంలో అక్రమంగా దొంగలించిన స్తంభాలను, వైర్లను ట్రాక్టర్‌ ద్వారా వేస్తున్నారు. ఈ విషయం తెలిసిన బిక్షం రెడ్డి తన సహచర రైతులతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్‌ అధికారులు లేకుండా, తన అనుమతి లేకుండా మీరు విద్యుత్‌ స్తంభాలు, వైర్లు ఎందుకు వేస్తున్నారని నిలదీశాడు. దీంతో వారు మా నాయకుడు వేసుకోమన్నాడు. మేము వేసుకుంటున్నాము. మీరు ఏమి చేసుకుంటారో చేసుకోపోండంటి బెదిరింపులకు దిగాడు. మధిర మండలం జాలిమూడి గ్రామానికి చెందిన సుధాకర్‌ రెడ్డి ట్రాక్టర్‌ను ఇందుకు వినియోగించుకున్నారని, డ్రైవర్‌గా రాపల్లి గ్రామానికి చెందిన పెనుగొండ ఏడుకొండలు ఉన్నాడని తెలిపారు. రాపల్లి గ్రామానికి చెందిన కర్నాటి బాబురావు ఆ ట్రాక్టర్‌ ద్వారా రాపల్లిలోని వివిధ ప్రాంతాలలో నిరుపయోగంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను, వైర్లను అక్రమంగా అపహరించుకు వచ్చాడని గ్రామస్తులు తెలిపారు. విద్యుత్‌ అధికారుల అనుమతి లేకుండానే ట్రాన్స్ఫార్మర్లలో విద్యుత్తు సరఫరాలను నిలిపివేసి ఈ స్తంభాలు వేస్తున్నట్టు వారు తెలిపారు. అదేవిధంగా రాపల్లి గ్రామంలో అక్రమంగా ఇళ్లకు కలెక్షన్లు ఇస్తూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా తెలిపారు. ఇదే విషయంపై మండల విద్యుత్‌ ఏఐ దొండేటి ఉమామహేశ్వరరావుకి తాము లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాము సమస్యను వివరిస్తుంటే విద్యుత్‌ అధికారులు తమ పట్ల విచిత్రంగా ప్రవర్తించారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కొంతమంది అక్రమంగా దొంగలిస్తున్నారని, తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేస్తే అందుకు అనుగుణంగా స్పందించవలసిన విద్యుత్‌ అధికారులు తమ పట్ల అవమానకరంగా, అవహేళనగా మాట్లాడారని తెలిపారు. ప్రైవేటు విద్యుత్‌ సైన్యంతో మండల విద్యుత్‌ అధికారులకు సంబంధం లేకపోతే ఎందుకు వెంటనే స్పందించకుండా పైగా తమ పట్ల అవమానకరంగా మాట్లాడారని వారు ప్రశ్నిస్తున్నారు.