– బీజేపీతోనే.. సౌభాగ్య తెలంగాణ
– కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్బన్ పేపర్ లాంటిది
– ఎస్సీ,ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం చేసింది ఆ రెండు పార్టీలే..
– ఎస్సీ వర్గీకరణ ప్రణాళికలు సిద్ధం : ప్రధాని మోడీ
నవతెలంగాణ-కామారెడ్డి/ రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
బీజేపీ మాట ఇస్తే దానిపై నిలబడుతుందని, 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తామని చెప్పి చేసి చూపించామని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. సకల సౌభాగ్య తెలంగాణను ఇవ్వడమే లక్షమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి విముక్తిని కోరుకుంటున్నారన్నారు. బీజేపీ గెలిస్తే చెరకు రైతులకు తీపికబురు ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ఇరిగేషన్ పథకాలను ఇరిగేషన్ స్కామ్‌లుగా మార్చారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక తరగతులకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అన్యాయం చేశాయన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తెస్తే తొలి బీసీని సీఎం చేసే బాధ్యత తనదే అన్నారు. మోడీ మాట ఇస్తే తప్పడు అని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి, చేవెళ్ల నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో ప్రధాని మాట్లాడారు. కామారెడ్డి సభలో.. ‘నా కుటుంబ సభ్యులారా’ అని ప్రధాన మోడీ తన ప్రసంగానికి ముందు అనడంతో ప్రజల నుంచి హర్షద్వానాలు వినిపించాయి. కేసీఆర్ అధికారంలోకి రాకముందు దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తనే ఆ కుర్చీని కబ్జా చేశాడని అన్నారు. సామాజిక సమన్వయ సాధికారత కోసమే బీజేపీ పని చేస్తుందని తెలిపారు. బీసీలకు తగిన గౌరవం ఇస్తూ వారికి సీట్లు కేటాయించామన్నారు. తెలంగాణ వికాస యాత్రలో మాదిగ సామాజిక తరగతికి అన్యాయం జరిగిందని, దాన్ని సవరించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు డబ్బులు అవసరం పడితే ఏటీఎం దగ్గరికి వెళ్తారని, బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం.. ప్రాజెక్టులకు కొత్త ప్రాజెక్టులు నమోదు చేసి వారి జేబులు నింపుకుంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతుల నుంచి బాయిల్డ్ రైస్ తీసుకుంటామనీ, ఈ ఖరీప్‌లో అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. చెరకు రైతులకు లాభం కలిగేలా పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతున్నట్టు తెలిపారు. ఇథనాల్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని, దాంతో కామారెడ్డి రైతులకు లాభం జరుగుతుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన సభలో ఆయన మాట్లా డుతూ.. కాంగ్రెస్ నేతల గర్వాన్ని, అహంకారాన్ని అణచాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్ కార్బన్ పేపర్‌గా మారుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకటేనని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్‌ఎస్ కు వేసినట్టే.. అని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. సుప్రీంకోర్టులో మాదిగ సామాజిక తరగతి తరపున న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో బీజేపీ పాలనపై నమ్మకం పెరుగు తోందన్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకే ఉందన్నారు. ఈ సమావేశం లో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.