మెదక్‌ చరిష్మాలో హ్యాట్రిక్‌ సాధ్యమేనా?

– ఇప్పటి వరకు 16 ఎన్నికల్లో చుక్కెదురు
– అభ్యర్థులను వరించని వరుస విజయాలు
– బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మకు ప్రజాశీర్వాదం దక్కేనా..?
– చర్చనీయాంశంగా మారిన ఎన్నికలు
నవతెలంగాణ – మెదక్‌
దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన మెదక్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ చరిష్మాలో హ్యాట్రిక్‌ విజయం సాధ్యమేనా అనే చర్చ జోరుగా సాగుతోం ది. మెదక్‌ నియోజకవ ర్గంలో ఇప్పటి వరకు జరిగిన 16 ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి వరుస విజయాలను సొంతం చేసుకొని హ్యాట్రిక్‌ రికార్డును కైవసం చేసుకున్న దాఖలాలు లేవు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కరణం రాంచందర్‌రావుకు రెండుసార్లు హ్యాట్రిక్‌ విజయం దూరమైంది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండుసార్లు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మెదక్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మాదేవేందర్‌రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం మూడోసారి సైతం టిక్కెట్‌ కేటాయించడంతో ప్రజాశీర్వదం దక్కేనా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. మెదక్‌ నియోజకవర్గంలో 1952 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 16 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులను ఓటర్లు ఆదరించారు. ఆరుసార్లు తెలుగు దేశం పార్టీకి, 5 సార్లు కాంగ్రెస్‌, రెండు సార్లు టీఆర్‌ఎస్‌, సీపీఐ, జనతా, స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కోసారి అవకాశం కల్పించారు. 1980లో మెదక్‌ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఇందిరాగాంధీని దేశ ప్రధాన మంత్రిగా, మెదక్‌ ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలుపొందిన కరణం రాంచందర్‌ రావు టీడీపీ ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా, తెలంగాణ ఏర్పాటు తరువాత ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మాదేవేందర్‌ రెడ్డిని తెలంగాణ తొలి మహిళా డిప్యూటీ స్పీకర్‌గా అందించిన ఘనత ఈ ప్రాంతానికి ఉంది.
పద్మకు హ్యాట్రిక్‌ సాధ్యమేనా..?
మెదక్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈసారి 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటేశ్వర్‌రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1957లోనూ వెంకటేశ్వర్‌రావు వరుసగా రెండోసారి గెలుపొందారు. 1962లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం పార్టీ నుంచి ఆనందాబాయి గెలుపొందడంతో వెంకటేశ్వర్‌ రావు హ్యాట్రిక్‌ విజయం దూరమైంది. ఆ తరువాత 1967లో రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 1972లో కరణం రాంచందర్‌రావు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. 1978లో ఎస్‌. లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచారు.1983లో రాంచందర్‌రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలిచి గెలిచారు. ఆ తరువాత 1985లో జరిగిన ఎన్నికల్లో తిరిగి రాంచందర్‌రావు గెలిచారు. కానీ 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి నారాయణరెడ్డి గెలవడంతో రాంచందర్‌ రావుకు రెండో సారి హ్యాట్రిక్‌ విజయం దూరమైంది. 1994 లో రాంచందర్‌రావు తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచారు. 1999లో మరోసారి గెలుపొందిన రాంచందర్‌రావు 2002లో హఠాన్మరం చెందడంతో అతడి సతీమణి కరుణం ఉమాదేవి ఉప ఎన్నికల్లో నిలిచి గెలిచింది. ఆ తరువాత 2004లో పట్లోళ్ల శశిధర్‌ రెడ్డి జనతా పార్టీ నుంచి బరిలో నిలిచి గెలిచారు. 2009లో మైనంపల్లి హనుమంతరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014లో పద్మాదేవేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలిచి భారీ మెజారిటీతో గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ పద్మాదేవేందర్‌రెడ్డికి టిక్కెట్‌ రావడంతో భారీ మెజారిటీతో గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం ముచ్చటగా మూడోసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మకు అవకాశం కల్పించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం పద్మకు సాధ్యమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రజాశీర్వాదంతో పద్మాదేవేందర్‌రెడ్డి ఈసారి ఎనికల్లో గెలిస్తే చరిత్రాత్మకం అవుతుందని అభిప్రాయం.