అంబేద్కర్‌ భావజాలం హిందూత్వ రాజకీయాలకు అనుకూలమా?

Is Ambedkar's ideology compatible with Hindutva politics?లోక్‌సభలో బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ను హోంశాఖ మంత్రి అమిత్‌ షా అవమానించిన తీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అంబేద్కర్‌ కూడా సావర్కర్‌, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అనుకూలంగా ఉన్నాడనే కథనాన్ని సష్టించేందుకు మితవాద హిందూ జాతీయవాద సిద్ధాంతకర్తలు ప్రయత్నం చేస్తున్నారు. హిందూత్వ భావజాలాన్ని అంబేద్కర్‌ ఎంతగా ప్రశంసించాడో తెలియజెప్పేందుకు అంబేద్కర్‌ చేసిన బహత్తర కషిని ఎంచుకొని అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అంశాలను తీసుకొని వారు ఒక చిత్రాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. వారు అంబేద్కర్‌ను ఉదహరిస్తూ, అస్పశ్యులలో స్వామి శ్రద్ధానంద అత్యంత గొప్ప, క్రమశిక్షణాయుతమైన యోధుడని” అంటున్నారు. ‘ముస్లింలు, హిందూ మతంలోకి మారాలని’ చేపట్టిన ‘శుద్ధి’ కార్యక్రమంలో పాల్గొన్నది ఇదే స్వామి శ్రద్ధానంద అనే వాస్తవాన్ని వారు పరిగణనలోకి తీసుకోలేదు. ఇది ముస్లిం మత పెద్దలకు ఆగ్రహం కలిగించింది.
”హిందూ మతం మనుగడ సాగించాలంటే, దాని సంఖ్యను పెంచడం గురించి కాక, దానికి సంఘీభావాన్ని పెంచడం గురించి ఆలోచించాలి, అంటే కులనిర్మూలన గురించి ఆలోచించాలని అర్థం. కుల నిర్మూలనే హిందువులకు నిజమైన సంఘటన. కులాలను నిర్మూ లించడం ద్వారా సంఘటనను సాధించినప్పుడు, ‘శుద్ధి’ కార్యక్రమాల అవసరం ఉండదని” అంబేద్కర్‌ ‘శుద్ధి’ పై ప్రతిస్పందించాడు. ఇది, హిందువులను ఇస్లాం మతంలోకి మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్న తబ్లిఘి జమాత్‌చే నిర్వహించ బడుతున్న తన్జీమ్‌కు సమాంతరమైనది, వ్యతిరేకమైనది. తరువాత కాలంలో శ్రద్ధానంద భారత జాతీయ కాంగ్రెస్‌లో భాగస్వామి అయినప్పటికీ, హిందూమత రాజ్య స్థాపనకు కట్టుబడి, పునరుజ్జీవించబడిన హిందూ మహాసభలో భాగంగా ఉన్న హిందూ సంఘటనలో కూడా భాగస్వామిగా ఉన్నాడు.
అంబేద్కర్‌, సావర్కర్‌లు ఒకే నాణేనికి ఇరువైపులుగా ఉన్నారనే కొత్త వివరణలు తెరపైకి వస్తున్నాయి. దేవాలయాల్లోకి దళితుల ప్రవేశాన్ని అనుమతించే పతిత పావన్‌ దేవాలయాలను సావర్కర్‌ ప్రారంభించింది వాస్తవం. బాబాసాహెబ్‌ చెప్పేదాని ప్రకారం, అంటే ఇది, కేవలం దళితులు మాత్రమే ప్రవేశం పొందే ఒక ప్రత్యేక దేవాలయాన్ని సష్టిస్తుంది. ”అంబేద్కర్‌, ప్రారంభం నుంచి పతిత పావన్‌ దేవాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించాడు. ఈ దేవాలయాలనే తర్వాత కాలంలో అస్పశ్యుల దేవాలయాలని పిలుస్తారని ఆయన విశ్వసించినట్లు,”బహిష్కత భారత్‌” పత్రిక 12 ఏప్రిల్‌1929 నాడు ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొన్నారు.అయితే అంబేద్కర్‌, అవి అసంబద్ధమైనవని భావించి నప్పటికీ సావర్కర్‌ ప్రయత్నాలను ప్రశంసించాడు. ఇవి, హిందూత్వ సిద్ధాంతకర్తలు లేవనెత్తుతున్న కొన్ని అంశాలు. కాంగ్రెస్‌తో అంబేద్కర్‌ సంబంధాల గురించి వివరించే క్రమంలో వారు చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. గాంధీ, పటేల్‌ల మరణం తరువాత నెహ్రూ చాలా నిరం కుశంగా వ్యవహరించి, ప్రతిపక్షాన్ని విస్మరిం చాడని హిందూత్వ సిద్ధాంతకర్తలు కొందరు వాదిస్తున్నారు.
ఆర్టికల్‌ 370, విదేశాంగ విధానం, ఎస్సీ, ఎస్టీల పరిస్థితులపై నెహ్రూతో ”విభేదాలు” ఉన్న కారణంగానే నెహ్రూ మంత్రివర్గంలో మంత్రి పదవికి అంబేద్కర్‌ రాజీనామా చేశాడని, బీజేపీ నాయకుడు, హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నాడు. హిందూ కోడ్‌ బిల్లు విష యంలో నీచంగా వ్యవహరించిన తీరుపై తీవ్ర నిరుత్సాహానికి గురైన కారణంగానే అంబేద్కర్‌ కేబినెట్‌ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆరెస్సెస్‌ పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించింది. ఆరెస్సెస్‌ కార్యకర్తలు పార్లమెంట్‌ ముందు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. 11డిసెంబర్‌ 1949న రామ్‌ లీలా మైదానంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించి, అంబేద్కర్‌, నెహ్రూ దిష్టిబొమ్మలను దహనం చేయడంతో వారి చర్యలు పరాకాష్టకు చేరాయి. హిందూ కోడ్‌ బిల్లును వ్యతిరేకిస్తూ, పత్రిక ”ఆర్గనైజర్‌” 7 డిసెంబర్‌ 1949న ”మేము హిందూ కోడ్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే, ఆ బిల్లు విదేశీ మరియు అనైతిక సూత్రాలపై ఆధారపడిన ఒక దిగజారుడు చర్య. అది హిందూ కోడ్‌ బిల్లు కానేకాదు.” అని పేర్కొన్నారు. హిందూ కోడ్‌ బిల్లుపై ఆరెస్సెస్‌ సాగించిన దూకుడు ప్రచారం ఫలితంగా ఆ బిల్లు ఆలస్యమై, నీరుగారి పోయిన కారణంగా ఆవేదనతో అంబేద్కర్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
అంబేద్కర్‌కు, సావర్కర్‌ దగ్గర నుంచి బీజేపీ వరకు మధ్య ఉన్న విభేదాలలో ముఖ్యమైనది మనుస్మతి, చాతుర్వర్ణ వ్యవస్థ. డిసెంబర్‌ 25, 1927 నాడు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మనుస్మతిని తగుల బెట్టిన సందర్భంలో, ఆరెస్సెస్‌ రెండవ సర్సంగ్‌ చాలక్‌ గోల్వాల్కర్‌ మనుస్మతిని స్తుతిస్తూ,పొగడ్తలతో రాయడం మొదలుపెట్టాడు. సావర్కర్‌ కూడా చాతుర్వర్ణ వ్యవస్థకు మద్దతు తెలిపి, మనుస్మతిని ఇలా ప్రశంసించాడు: ”మన హిందూ దేశానికి వేదాల తరువాత అత్యంత పూజ్యనీయమైన పురాణం మనుస్మతి. ఇది, ప్రాచీన కాలం నుండి మన సంస్కతి, ఆచారాలు, ఆలోచనలు, అలవాట్లకు ఆధారమైనది. శతాబ్దాల కాలంగా ఈ గ్రంథం మన దేశ ఆధ్యాత్మిక, దైవిక ప్రగతిని క్రోడీకరిస్తోంది. నేటికి కూడా హిందువులు కోట్ల సంఖ్యలో తమ జీవితాల్లో, తమ ఆచరణలో అనుసరిస్తున్న నియమాలన్నీ మనుస్మతి ఆధారంగానే జరుగు తున్నాయి. నేడు మనుస్మతే, అన్నిటికీ మూలాధారమైన హిందూచట్టం. నూతన భారత రాజ్యాంగంలో అత్యంత దారుణమైన విషయం ఏమంటే, దానిలో అసలు భారతీయత అనేది లేదు. ప్రాచీన భారతీయ రాజ్యాంగ చట్టాలు, సంస్థలు, పేర్లు, పదాల ప్రస్తావనే ఆ నూతన రాజ్యాంగంలో లేవు”.
హిందూత్వ భావజాలంతో అంబేద్కర్‌కు ఉన్న ముఖ్యమైన విభేదాన్ని చాపకింద దాచిపెడుతున్నారు. 13అక్టోబర్‌1935 నాడు అంబేద్కర్‌ నాసిక్‌ దగ్గర ఇయోలాలో మాట్లాడుతూ ”నేను హిందువుగా మరణించననే” ఒక పిడుగు లాంటి విషయాన్ని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం, ఈ మతంలో స్వేచ్ఛ, జాలి, కరుణ, దయ, సమానత్వాలకు స్థానం లేదు. సవరించబడిన ఆయన రచన,”థాట్స్‌ ఆన్‌ పాకిస్థాన్‌”లో, భారత ప్రజలకు ఒక ”పెద్ద విపత్తు” గా మారే హిందూమత రాజ్య స్థాపనకు మార్గాన్ని సుగమం చేసే అవకాశం ఉన్న ఇస్లామిక్‌ పాకిస్థాన్‌ ఏర్పాటును వ్యతిరేకించాడు. ఆయన దీన్ని ప్రకటించాడు కాబట్టి సిక్కు మతం లేదా ఇస్లాం మతాలను స్వీకరించాలని ఆయనపై ఒత్తిడులు వచ్చాయి. ఒకవేళ అంబేద్కర్‌ ఇస్లాం మతాన్ని స్వీకరించడం జరగకుంటే, హిందూ మహాసభ అతని చర్యను వ్యతిరేకించదని, హిందూ మహాసభకు చెందిన డాక్టర్‌ మూంజే, అంబేద్కర్‌తో ముందుగానే ఒక ఒడంబడిక చేసుకున్నాడు. బాబాసాహెబ్‌ స్వంత లోతైన అధ్యయనాలే ఆయన బౌద్ధాన్ని స్వీకరించేందుకు దారితీసాయి.
నేడు, అంబేద్కర్‌ విగ్రహాల్ని ఏర్పాటు చేయడం ద్వారా, ఆయన జ్ఞాపకార్థం ఒక అంతర్జాతీయ మ్యూజియంను, ఇతర స్మతి చిహ్నాల్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ను ”గౌరవిస్తున్నామన్న” విషయాన్ని బీజేపీ వారు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి గుర్తింపుకు సంబంధించిన సమస్యలు కాగా, బాబాసాహెబ్‌ విలువల్లోని ముఖ్యమైన అంశాన్ని బలహీన పరు స్తున్నారు. రిజర్వేషన్ల విషయంలో మండల్‌ కమిషన్‌ అమలైనప్పుడు, బీజేపీ, కమండల్‌ (హిందూత్వ) రాజకీయాల్ని ఆశ్రయించింది. కమం డల్‌ రాజకీయాల్లో భాగంగా నిర్వహించబడిన రథయాత్ర కాలంలో ప్రముఖ బీజేపీ నాయకుడు ఎల్‌.కే.అద్వానీని అరెస్ట్‌ చేయడంతో వీ.పీ.సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన పార్టీలలో భాగంగా ఉన్న బీజేపీ, ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయింది.
అంబేద్కర్‌, హిందూత్వ రాజకీయాలలో భాగమనే విషయాన్ని నిరూపించాలన్న బీజేపీ ఆరాటం అనేది, హిందూ దేశం అనేవారి భావజాలానికి పూర్తి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి జ్ఞాపకం నుండి చట్టబద్ధత పొందేందుకు ఒక శుద్ధమైన సమ్మేళనం. హిందూ రాజ్యాన్ని వ్యతిరేకించి, ప్రజాతంత్ర, లౌకిక గణతంత్రాన్ని కోరుకున్న అంబేద్కర్‌ను తమ సైద్ధాంతిక పరివార్‌లో భాగంగా ముందుకు తెచ్చేందుకు నేడు హిందూ రాజ్యం కోసం నిలబడే వారు ప్రయత్నించడం ఎంత విడ్డూరం!
(”న్యూస్‌క్లిక్‌” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451
రామ్‌ పునియానీ