వర్తమాన దశాబ్ది చివరికి చైనా వెయ్యి అణ్వాయు ధాలను సమకూర్చుకోనుందని అమెరికా రక్షణశాఖ నివేదికలో జోస్యం చెప్పింది. ఒకవైపు చైనా ఆర్థికంగా కుప్పకూలనుందంటూ తేదీలను చెబుతూ గతంలో అనేక నివేదికలను వెల్లడించి కమ్యూనిస్టు వ్యతిరేక జనాల బుర్రలను మరింత ఖరాబు చేశారు. ఇప్పుడు ప్రపం చానికి బూచిగా చూపేందుకు అణ్వస్త్రాల గురించి చెబు తున్నారు. చైనా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. గతంలో సోవియట్ యూనియన్- అమెరికా తమ దగ్గర ఉన్న కొన్ని ఆయుధాలను నిర్వీర్యం చేస్తామని ప్రకటించటం తప్ప నిజానికి ఏ దేశం దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయన్నది అధికారి కంగా చెబితే తప్ప ప్రచారంలో ఉన్న అంకెలన్నీ అంచ నాలే. జనానికి జ్ఞాపక శక్తి తక్కువ గనుక తామేం చెబితే దాన్ని గుడ్డిగా నమ్ముతారని అమెరికా అనుకుంటున్నది. 2020 నివేదికలో చైనా దగ్గర 200లోపు అస్త్రాలు ఉన్నట్లు, 2030 నాటికి రెట్టింపు చేస్తారని పేర్కొన్నది. 2021 నివేదికలో 2027 నాటికి 700కు పెంచుతుం దని, 2030నాటికి వెయ్యికి చేరుస్తుందని రాసుకున్నారు. ఇవన్నీ చైనా మిలిటరీ శక్తిగా ఎదుగుతోంది జాగ్రత్త అని ఇరుగు పొరుగుతో పాటు ప్రపంచ దేశాలను ఆయుధ పోటీకి ప్రోత్సహించే ఒక వ్యూహంలో భాగమే. ఎందు కంటే ప్రపంచ ఆయుధతయారీ, పెద్ద ఎగుమతిదారు అమెరికా గనుక.
స్టాకహేోం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (సిప్రి) వెల్లడించిన అంచనా ప్రకారం ఈ ఏడాది జనవరి నాటికి ప్రపంచంలో 3,844 అణ్వాయుధాలను మోహ రించగా వాటిలో అమెరికా 1,770, రష్యా 1,674,ఫ్రాన్స్ 280,బ్రిటన్ 120 ఉన్నాయి. ఒక్క బాంబును కూడా మోహరించని చైనాతో తమకు, ప్రపంచానికి ముప్పు వచ్చిందని అణ్వాయుధాల గుట్టమీద కూర్చున్న అమెరికా చెబితే జనాలు నమ్మాలి. పాతబడిన వాటిని ధ్వంసం చేయగా ప్రస్తుతం మొత్తం తొమ్మిది దేశాల వద్ద మోహ రించినవి, సిద్ధం చేసుకున్నవి అన్నీ కలిపి 12,512 ఉన్నాయి. వాటిలో రష్యా 5,889, అమెరికా 5,244, చైనా 410,ఫ్రాన్స్ 290,బ్రిటన్ 225, పాకిస్తాన్ 170, భారత్ 164, ఇజ్రాయెల్ 90, ఉత్తర కొరియా 30 కలిగి ఉన్నట్లు సిప్రి చెప్పింది. అణ్వాయుధాలు ప్రపంచానికి ముప్పు అన్నది నిజం, ముందుగా ఎవరు మీట నొక్కినా కొద్ది క్షణాల్లో ఇతరులు కూడా అదేపని చేస్తారన్నది కూడా తెలిసిందే. అదే జరిగితే ప్రపంచం మిగలదు.
నిజంగా చైనా అణ్వాయుధా లను పెంచుకుంటే, తమకెలాంటి ఆందోళన లేదని పెంటగన్ నివేదిక మీద రష్యా స్పందిం చింది. సర్వసత్తాక దేశంగా చైనాకు ఆత్మరక్షణ హక్కు ఉన్నదని కూడా స్పష్టం చేసింది. అసలు అమెరికా ఏడుపు, ఆందోళన ఏమిటంటే ఇటీవలి కాలంలో చైనా ఆయుధ రంగంలో చేసిన పరీక్షల వివరాలను పసిగట్ట లేక మల్లగుల్లాలు పడుతోంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య లో రష్యా ప్రయోగిస్తున్న ఆధునిక హైపర్‌సోనిక్ క్షిపణులు చైనా నుంచి తెచ్చుకున్నవే అని అనుమానిస్తు న్నారు. వాటి తయారీలో చైనా అగ్రస్థానంలో ఉందని అమెరికా రక్షణశాఖ నిపుణులే చెబుతున్నారు. ధ్వని కంటే ఎన్నో రెట్లు వేగంగా ఆ క్షిపణులు ప్రయాణిస్తాయని, వాటిని పసిగట్టటం, నిరోధించటం అంత తేలిక కాదని అంచనా. ఇటీవల ఉక్రెయిన్ మీద రష్యా ప్రయోగించిన కింఝాల్ క్షిపణి గంటకు 12,348 కిలోమీటర్ల వేగంతో రెండువేల కిలోమీటర్లు ప్రయాణిం చగలదని అమెరికా అంచనా వేసింది. తమ వద్ద గంటకు పాతికవేల కిలో మీటర్ల వేగంతో పదివేల కిలోమీటర్లు వెళ్లే క్షిపణులు న్నట్లు రష్యా చెప్పింది. అలాంటివి చైనా వద్ద కూడా ఉన్నట్లు అమెరికా భయపడుతోంది. చైనా అమ్ముల పొది లో నిర్ణీత లక్ష్యాన్ని చేధించే జలాంతర్గామి అణుక్షిపణులు కూడా చేరాయని పెంటగన్ ప్రత్యేకంగా పేర్కొన్నది. ఒకటి స్పష్టం, ఆయుధ పోటీ ప్రపం చానికి ముఖ్యంగా వర్ధమాన దేశాలకు ఎంతో నష్టం. అమెరికా నుంచి తలెత్తుతున్న ముప్పును తప్పించుకోవాలన్నా, దాన్ని నిరో ధించాలన్నా ఆయుధాలు సమకూర్చుకోక తప్ప దన్నది తిరుగులేని వాస్తవం. ఇతర దేశాలన్నీ తమ మీద కుట్ర చేస్తున్నట్లు, ముప్పు తలపెట్టి నట్లు స్వజనాన్ని నమ్మించటం అమెరికా నిత్యకృత్యాలలో ఒకటి. ఆ పేరుతో అన్ని ఖండాలలోని 80 దేశాలలో 800కు పైగా చిన్నా, పెద్ద సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంటే ఎక్కడికైనా కొద్ది గంటల్లోనే తన మిలిటరీని దింపగలదు. చరిత్రలో ఇంత వరకు అమెరికా మీద దాడి చేసిన దేశం ఒక్క టంటే ఒక్కటీ లేదు. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత 1,776 నుంచి ఇప్పటివరకు అమెరికా 68 దేశాల మీద దాడి చేసింది.అందువలన ముప్పు అమెరికా నుంచి రావాలి తప్ప మరొకదేశం నుంచి వచ్చే అవకాశమే లేదు.