అడవి బిడ్డలకు చదువు అసంపూర్ణమేనా?

అడవి బిడ్డలకు చదువు అసంపూర్ణమేనా?‘ప్రతి మనిషి జీవితంలో వెలుగు నింపేదే చదువు. అదే మన ఆయుధం, దాని అసలు లక్ష్యం సమాధానాలందించడం కాదు, మరిన్ని ప్రశ్నలను సంధించడం.’ అని అమెరికన్‌ రచయిత, ఉపాధ్యాయురాలైన హెలెన్‌ కిల్లర్‌ అన్నారు. దీన్నిబట్టి విద్య ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు. సమాజానికి దూరంగా, కొండకోనల్లో అడవుల మధ్య జంతువులతో సమానంగా జీవిస్తున్న అడవి బిడ్డలకు విద్యనందించడంలో ప్రభుత్వాలు నేటికీ విఫలమవుతూనే ఉన్నాయి.2011లెక్కల ప్రకారం గిరిజనులకు అందిన విద్య 49.51శాతం. అంటే సగానికి సగం ఇంకా చదువుకు దూరంగానే ఉన్నారన్నది వాస్తవం. మరి వారిక్కూడా సంపూర్ణంగా అందాలంటే ఇంకెంకాలం పడుతుందో! స్వతంత్ర భారతావనిలో బయటి ప్రపంచమంటే తెలియకుండానే గిరిజనులు నేటికీ జీవిస్తున్నారు. వారు తమ మాతృభాష(లిపి) రావడానికే ఐదారేండ్లు పడుతుంది. ఎందుకంటే గిరిజనులు వారి పిల్లలతో నిరంతరం ఉండరు. జీవనోపాధి కోసం నిరంతరం పనుల్లో ఉంటారు. ఉదయాన్నే అడవి, వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటారు. గిరిజనుల్లో వలసలు కూడా ఎక్కువే! తక్కువ సమయమే పిల్లలతో గడుపుతారు. కడుపునిండా భోజనం కూడా వారికి సరిగా దొరకదు. అప్పుడు పిల్లలతో మాట్లాడే భాష పరిమితమే కాబట్టి మాతృభాష మీద పట్టు రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే లంబాడి, గోండు, కోయ, ఎరుకల భాషలోనే తెలుగులో పుస్తకాలు ఫ్రింట్‌ చేసి ప్రాథమిక స్థాయిలో విద్యను అభ్యసిస్తున్నారు. ఇది అరకొరగానే అందుతుంది.
రాష్ట్రంలో బడిబయట పిల్లలు వేల సంఖ్యలో ఉన్నారని పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో వెళ్లడవుతున్నాయి. గిరిజనుల విద్యార్థులకు విద్యనందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సరి పోవడం లేదు. డిమాండ్‌కు అనుగుణంగా గురుకులాలు, సీట్ల సంఖ్య లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. హైదరాబాద్‌లో గిరిజన గురుకులం సెక్రటరీ కార్యాలయానికి వందల సంఖ్యల్లో గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తులు పట్టుకుని సీట్ల కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉన్నది. అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతూ చివరికి సీట్లు రాకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్న వారు అనేకమంది. ఇలాంటి తంటాలు పడకుండా కొంతమంది ఇంటిదగ్గరే ఉండిపోయేవారు మరికొంతమంది. రెసిడెన్షియల్‌/ గురుకులం సీట్ల కోసం ప్రయత్నం చేసి రాకపోవడంతో దళారుల చేతుల్లో మోసపోతున్నటువంటివారూ ఇంకొందరు. ఇలా చాలామందికి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడం మన విద్యారంగం పట్ల అనాసక్తి కోల్పోయి చదువుకోవాలనుకునే వారు నష్టపోవాల్సి వస్తున్నది. గిరిజన విద్యార్థులందరికీ సీట్లు ఇచ్చి చదువును కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో చదువు విలువ తెలియకపోవడంతో గిరిజనులు ఆ కాలంలో దాని ప్రాధాన్యత గుర్తించలేదు. ఈరోజు గిరిజనులు తమ పొట్ట పోసుకుంటూ తమ పిల్లలే ఆస్తిగా భావించి చదివించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి అడవి బిడ్డలకి వారు అడిగిన ప్రాంతంలో స్కూళ్లలో విద్యనందించే వెసులుబాటు కలిగించి సీట్లివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రెసిడెన్షియల్‌/ గురుకులాలు మొత్తం 183 ఉన్నాయి. 86 పాఠశాలలు, 23 జూనియర్‌ కళాశాలలు, 22 డిగ్రీ కళాశాలలు, 29 మినీ గురుకులాలు, 23 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో మొత్తం 81,320 మంది విద్యార్థులు చదువుకుం టున్నారు. వీటిలో ప్రతిఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న దానికి అనుగుణంగా చదువుతున్న తరగతులలో సీట్ల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. ఫ్రీ మెట్రిక్‌ హాస్టల్‌ 138 ఉండగా ఇందులో 19,782 మంది విద్యార్థులు చదువుతున్నారు. 322ఆశ్రమ పాఠశాలలు 88,230 మంది విద్యార్థులు చదువు తున్నారు. పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లు 163 ఉన్నాయి 24,896 మంది విద్యార్థులు చదువుతున్నారు. లా, బీఈడీ, డైట్‌ కళాశాలల విద్యార్థుల సంఖ్య పెంచి మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది. ప్రయివేటు స్కూళ్లలో గిరిజన విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ -బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో దాదాపుగా 15వేల మంది దరఖాస్తు చేస్తే కేవలం 700 సీట్లు మాత్రమే కేటాయిస్తున్నా రు. దీంతో ఎక్కువ మంది విద్యా ర్థులు నష్టపోవా ల్సి వస్తున్నది. హైదరాబాద్‌, రామంతాపూర్‌ పబ్లిక్‌ స్కూల్లో కూడా సీట్ల సంఖ్యను, మెనూను పెంచా ల్సిన అవసరం ఉన్నది. దీంతోపాటు ప్రత్యేకంగా హాస్టల్‌ను కూడా ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పటినుంచో విన్నవిస్తున్నారు.
ఇప్పటికే అందుతున్న సగం విద్యద్వారానైనా ఎంతోమంది గిరిజనులు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నది కూడా నిజం. ఎందుకంటే బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నా, సౌకర్యాలలేమితో జీవనం సాగిస్తున్నా చాలామంది తమ ఉన్నతమైన ఆశయాలతో కలెక్టర్లుగా, పోలీసులుగా, ఇతర రంగాల్లో కూడా రాణించినవారిని చూస్తున్నాం. ప్రభుత్వం మరింత ముందడుగు వేసి గిరిజన తండాలు, గుడాలలో ఉన్న పాఠశాలను మెరుగుపరుస్తూ బలోపేతం చేస్తే గిరిజన విద్యార్థులు మరెన్నో అవకాశాలతో అభివృద్ధి అవుతారన్న విషయం పాలకులు గ్రహించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ 90శాతం మంది అధికారులు ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందిన వాళ్లు ప్రభుత్వ స్కూల్‌ నుండి వచ్చిన వాళ్లేనని ఒక మీటింగ్‌లో చెప్పారు. అది వాస్తవమే అయితే గనుక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, టీచర్ల కొరత లేకుండా, బోధన సక్రమంగా అందేలా చూడాలి. విద్యకు అధికంగా నిధులు కేటాయించాలి. గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల పిల్లలు దరఖాస్తు చేసుకున్న అందరికీ సీట్లు కేటాయించాలి. ఎందుకంటే సీట్లు రాకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్ల్లల విద్య కోసం వారికున్న అరకొర వ్యవసాయమో, లేదంటే ఆస్తిపాస్తులనో అమ్ముకుని ప్రయివేటులో చదివిస్తున్న పరిస్థితి ఉన్నది. అక్కడ యూనిఫామ్‌, అడ్మిషన్‌, బుక్స్‌, ఇలా ఫీజుల రూపంలో దండిగా దండుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య కోసం గిరిజనులు ఆసక్తి చూపుతుంటే సీట్లు దొరక్క ప్రయివేటు స్కూళ్లలో వారి పిల్లలను చేర్పించి ఆర్థికంగా మరికొంతమంది తల్లిదండ్రులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను పూర్తిగా ఉచితంగా అందించే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు పేద, ధనిక అనే తేడా లేకండా అందరూ ఒకేచోట చదువుకుంటారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతారు.
ఎం.ధర్మనాయక్‌
9490098685