సృష్ట్టిలో ఏ జీవరాశికి లేని వరం మనిషికి ఉంది. అదే ఇతరులకు అర్ధమయ్యే భాష. మాట్లాడే వరం. ఈ మాటలు ఎదుటి వారిని నొప్పించకుండా మాట్లాడాలి. ఎదుటి వారు అర్ధం చేసుకోకుండా అదే పనిగా మాట్లాడుతూ, మొండివాదనకు దిగుతూ ఉం టే, వారి పట్ల మౌనం వహించటం మంచిది. మౌనం కూడా భాషేగా! మౌనం అనేది ఎదుటి మనిషి పై నిరసన తెలిపే పదునైన ఆయుధం. కొన్నిసార్లు అనేక మాటలలో వ్యక్తం చేయలేని భావోద్రేకాలను సైతం మౌనవ్రతంతో, కనుచూపుతో వ్యక్తం చేయవచ్చు. పరుషంగా చెప్పవలసిన కఠినమైన సత్యాన్ని కూడా ప్రియంగా చెప్పాలని పెద్దలంటారు. ”అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను…సజ్జనుండు పలుకు చల్లగాను” అనే చిన్న పద్యం మనం చిన్నప్పుడు చదు వుకున్నదే. అది చిన్న పద్యమే కావచ్చు. కానీ, దాని భావాన్ని మనం జీవిత కాలమంతా… నానా యాతన పడుతూ కూడా సాధన చేయవలసిన గొప్ప విద్య. మాటలు చెప్పినంత తేలికకాదు ఆచరించటం. మనిషి సమాజంలో బతుకు తున్నప్పుడు అనునిత్యం ఎదురయ్యే సంఘర్షణాయుత సందర్భాలలో సైతం భావోద్రేకాలను అదుపులో ఉంచుకుని శాంతంగా ప్రవర్తించటం. ప్రియంగా సంభాషించటం నిజంగా ”కత్తి మీద సామే” ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకంటే… ఇటీవల మాజీ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పద్మపురస్కార గ్రహీతలకు చేసిన పౌర సన్మాన సభలో కొన్ని మంచి విషయాలు చెప్పారు. ఈ మాటల విలువల గురించి సభలో వివరించారు. శాస నసభల్లోనూ, బయటా ప్రజా జీవితంలో ఉండే నాయ కులు ఆచితూచి మాట్లాడాలనీ చెప్పారు. ఇప్పుడు ప్రతి చోటా అధికార, ప్రతిపక్షాల వారు మాట్లాడాల్సిన విషయాన్ని వదిలేసి, అనవసరపు మాటలు మాట్లా డుతూ రాయలేని విధంగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని చెప్పారు. ఇది నిజంగా శోచనీయం. మన వెనుకటితరం ప్రజా ప్రతినిధులు శాసనసభల్లో మాట్లేడేటప్పుడు విషయ ప్రధానంగా మాట్లాడేవారు. గణాంక వివరాలతో, బలంగా తమవాదన వినిపించే వారు. మాట్లాడవలసిన విషయంపై ‘హోంవర్క్’ చేసి సభకు వచ్చే వారు. చెప్పవలసిన విషయాన్ని సూటి గా, స్పష్టంగా ఆసక్తిదాయకంగా చెప్పేవారు. వారి మాటల్లో పొదుపు,అదుపు ఉండేది. విషయం ఏదైనా వినసొంపుగా ‘నస’ లేకుండా ప్రసంగించటం ఒక కళ. వారు ఉపన్యాస కళలో మంచి ‘తర్బీతు’ పొం దారు. జనరం జకంగా ప్రసంగిచేవారు. చట్ట సభల్లో వారు మాట్లాడేటప్పుడు అధికార ప్రతిపక్షం పరస్పరం చలోక్తులతో, సరస సంభాషణలతో, సున్నిత వ్యంగ్యం తో తమ వాదనలను వినిపించేవారు. ముఖ్యంగా పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరావు, వావి లాల గోపాల కృష్ణయ్య, వెంకయ్యనాయుడు, గౌతు లచ్చన్న మొదలైన పెద్దలు ఈ విషయంలో మంచి మార్గ దర్శనం చూపించారు. కేంద్రంలో కూడా పార్ల మెంట్లో అనేకమంది వక్తలు ఉండేవారు. వారు పార్టీలకతీతంగా, స్నేహ భావంతో, పరస్పర గౌరవం తో, సభామర్యాదను, నియమాలను, సంప్రదాయా లను పాటిస్తూ… అద్భుతంగా ప్రసంగించేవారు. ఇప్పుడు శాసనసభలలోనూ, బయటా, బహిరంగ సభ ల్లోనూ నాయకులు తిట్ల పురాణంతోనే సంభాషణ మొదలౌతుంది.ఎక్కడ చూసినా వ్యక్తిగత దూషణలే వినిపిస్తాయి. చట్టసభల్లో కూడా ”నువ్వెంత? అంటే, నువ్వెంత?” అనేవరకు పోయింది. సభలో లేని కు టుంబ సభ్యులను, వారి వ్యక్తిగత జీవితాలను తవ్వి తీస్తూ దూషణపర్వం మొదలైంది. చెప్పులు చూపిస్తూ ముఖ్యమంత్రిని నిందించే స్థాయికి యువనాయకులు తయారయ్యారు. సభా గౌరవం, విలువలు దారు ణంగా పడి పోయాయి.అలాగే ముఖ్యమంత్రి కూడా తన స్థాయి మరచి మాజీ ముఖ్య మంత్రిపై మాటలు తూలటం ఎవరికీ మంచిది కాదు.ఆ సీటు గౌరవం కాపాడాలి. ఒకరిని చూసి మరొకరు రెచ్చిపోవడం మంచిది కాదు. నేడు మనమున్నది డిజిటల్ ఎలక్ట్రా నిక్ మీడియా యుగంలో అని మరచిపోరాదు.ప్రతి మాట, కదలిక రికార్డు అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఆ విషయం చిలువలు పలువలు చేరి చిన్న విషయం కూడా ‘రచ్చ రచ్చ’ అవుతుంది. సీనియర్ శాసనసభ్యులు, మంత్రులు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు తమ మంచి నడవడిక ద్వారా విలువలు, శిక్షణ, నడవడికనివ్వాలి. తిరిగి పూర్వవైభవంతో మన శాసనసభలు, పార్టీ అంతర్గత సభలు, బహిరంగ సభలు వెలుగొందాలి. గౌరవప్రదంగా మంచి ఉపన్యాసాలతో, సంయమనంతో, మంచి భాషతో లోతైన అవగా హనతో, పార్టీ సిద్ధాంతాల పూని కతో, అర్ధవంత మైన విమర్శలతో పరిధి దాటకుండా జాగ్రత్తలు తీసు కోవాలి. ఇది వారికే కాదు, భవి ష్యత్తు తరానికి ఆదర్శదాయకం.
– డాక్టర్. కోలాహలం రామ్ కిశోర్
9849328496