బీజేపీ నాయకత్వాన అధికారానికి వచ్చిన ప్రధాని మోడీ 2018 నుండి ”ప్రపంచలో భారతదేశాన్ని మూడవ ఆర్ధిక వ్యవస్ధగా” చేస్తానని పదేపదే ప్రకటించారు. అంతే కాక రైతుల ఆదాయాన్ని 2022 వరకు రెట్టింపు చెస్తానని అప్పుడే ప్రకటించాడు. ఈ రెండు ప్రకటనల అమలును విశ్లేషిస్తే ఇవి అమలుకావడం అసాధ్యంగా గోచరిస్తున్నది. ప్రజలను నమ్మించ డానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. మేధావులు, ఆర్ధికవేత్తలు, సాధారణ ప్రజలు ఇలాంటి ప్రచారాలను ఎంతకాలం నమ్ముతారు. గ్లోబల్ స్థూల ఉత్పత్తి 2024లో 3.2శాతం గ్రోత్ ఉండగా 2025లో 3.3శాతానికి పెరిగినట్లు అంచనా వేశారు. వాస్తవంగా దేశంలో జరుగుతున్న ఆర్ధిక పరిస్థితిని పరిశీలించాలి. భారతదేశంలో 2023-24లో మొదటి క్వార్టర్ గ్రోత్ రేటు 8.2శాతం కాగా 4వ క్వార్టర్‌లో 7.8 శాతానికి తగ్గింది. 2024-25లో మొదటి క్వార్టర్ 6.4 శాతంగా 4వ క్వార్టర్‌లో 5.8 శాతానికి తగ్గింది. పై గణాంకాలు గమనిస్తే మన దేశ జిడిపి గ్రోత్‌రేటు తగ్గుతున్నది. ఉత్పత్తి రంగాలైన వ్యవసాయ రంగం గ్రోత్ రేటు 1.4శాతం మాత్రమే కానీ, దేశ స్ధూల ఉత్పత్తికి 17.7శాతం సహాకరిస్తున్నది. గత దశాబ్ద కాలంగా సగటు వ్యవసాయ రుద్దిరేటు 4.18 శాతంగా నిర్ధారించారు. పారిశ్రామిక రంగం గ్రోత్ రేటు 6శాతం నుండి 2024 నవంబర్‌లో 5.2శాతానికి తగ్గింది. దేశ స్థూల ఉత్పత్తికి 27.60 శాతం మాత్రమే సహకరిస్తున్నది. సేవా రంగం స్థూల ఉత్పత్తికి 54.7శాతం సహాకరించడం వల్ల కొంత నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతున్నది. కానీ, సేవా రంగ అభివృద్ధి నీటి బుడగ లాంటిది ఉత్పత్తి రంగాలైన వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు, స్ధిర ఆర్ధిక విధానం ఉండటంచే అవి అభివృద్ధిలో ఉండాలి. పారిశ్రామిక రంగం దేశ స్థూల ఉత్పత్తికి 60 శాతం కంట్రిబ్యూట్ చేయాలి. కానీ, అందులో 50శాతమే సహాకరిస్తున్నది. చాలా వరకు సన్న మధ్య తరహా పరిశ్రమలే కాక భారీ పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయి. దిగుమతులు యేటా పెరుగుతున్నాయి. ఎగుమతి – దిగుమతుల లోటు 15లక్షల కోట్లకు చేరుకుంది. విదేశీ మారక ద్రవ్యం లోటు కూడా పెరుగుతున్నది. వీటి ప్రభావంతో షేర్ మార్కెట్ పడిపోవడం, అందులో పొదుపు చేసుకున్న వారు లక్షల కోట్లలో దివాలా తీస్తున్నారు.
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలు
1. ఐటి – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
2. ఇంధన రంగం – పునరుత్పాధకశక్తి
3. ఈకామర్స్-ఆన్‌లైన్ రీటేల్-డిజిటల్
చెల్లింపులు
4. ఆరోగ్యసంరక్షణ-బయోటెక్నాలజీ టెక్నాలజి.
5. టెలికమ్యూనికేషన్
6. ఆర్థిక సేవలు – ఫిన్‌టెక్
పై రంగాల పెరుగుదల వల్ల 20శాతం మేర నిరుద్యోగ సమస్య పరిష్కరించబడినప్పుటికీ ఇంకా 8శాతం నిరుద్యోగం కొనసాగుతూనేవుంది. ప్రధానీ మోడీ దేశాన్ని 3వ ఆర్థిక దేశంగా 2025నాటికి చేస్తానని అనేక సందర్భాలలో చెప్పాడు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా 29 ట్రిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా 18.80 ట్రిలియన్ డాలర్లతో చైనా రెండోస్ధానంలో ఉంది. జపాన్ 4.25 ట్రిలియన్ డాలర్లు, జర్మనీ 3.85 ట్రిలియన్ డాలర్లు, భారత్ 3.41 ట్రిలియన్ డాలర్లతో ఐదవ స్థానంలో ఉంది. 3వ స్థానానికి చేరడానికి ప్రస్తుతం ఉన్న దేశ స్థూల ఉత్పత్తికి మరో 2ట్రిలియన్ డాలర్ల ఉత్పత్తి పెరగాలి. 2025 ముగింపు నాటికి ఇది సాధ్యమేనా? గత అనుభవాన్ని బట్టి చూస్తే 1947 నుండి 2010 వరకు 63 సంవత్సరాలు దేశం ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 2010 నుండి 2017వరకు రెండు ట్రిలియన్ డాలర్లకు, 2018నుండి 2020 వరకు మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. రానున్న ప్రతి 1.5 సంవత్సరాలకు ఒక ట్రిలియన్ డాలర్లకు పెరుగుతున్నది. ఈ లెక్కన 2 ట్రిలియన్ డాలర్లు పెరగాలంటే మరో 3 సంవత్సరాలు వేచి చూడాలి. అప్పటికీ 3వ, 4వ స్థానంలో ఉన్న జపాన్, జర్మనీ దేశాలు ఆర్థికంగా మరింత దూసుకుపోతాయి. మనదేశంలో ప్రస్తుతం పెరుగుతున్న ఎగుమతి – దిగుమతి లోటును తగ్గించకపోతే దేశ స్ధూల ఉత్పత్తి పెరగదు. మన బడ్జెట్‌లో 25శాతం రుణ వడ్డీ చెల్లింపులకు వ్యయం చేస్తున్నాం. 2023 – 24లో రూ.173.82 లక్షల కోట్లు దేశ, విదేశీ అప్పులుండగా 2024-25 నాటికి 184.88 కోట్లకు చేరుకుంటుంది. నేటికి భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముకగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి పెరగనంత వరకు దేశ స్ధూల ఉత్పత్తి పెరగదు. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడమంటే ఉత్పత్తి పెరుగుదలతో పాటు నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. పరిశ్రమలు ఉత్పత్తి చేయాలంటే వాటి వ్యాపారం పెరగాలి. అనగా ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. అన్నింటికి మూలం ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడే, దేశీయ వినియోగం పెరుగుతుంది. ప్రస్తుత 143 కోట్ల జనాభాలో 23.58శాతం మాత్రమే కొనుగోలు శక్తిని పెంచుకోగలుగు తున్నారు. దేశంలో శాశ్విత ఉద్యోగుల సంఖ్య 18.16 కోట్లు మాత్రమే. 15-64 సంవత్సరాల మధ్య వయస్సు గలిగినవారి ఉద్యోగితలో 60 దేశాల సర్వేలో మన దేశం 56వ దేశంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి.
వ్యవసాయ రంగంలో క్రమంగా మానవ శ్రమ తగ్గి యాంత్రికీకరణ పెరగాలి. అమెరికాలో 95శాతం, బ్రిజిల్ 75శాతం, చైనా 57శాతం, భారత్ 40.45శాతం (ఏఫ్రిల్ 2023 నాటికి) ఉంది. యాత్రీకరణ పెరగాలంటే సన్న చిన్న కారు రైతులకు ఉపయోగపడే యంత్రాలను జపాన్ తరహాలో తయారు చేసుకోవాలి. ప్రస్తుతం గ్రామాల నుండి పట్టణాలకు 20కోట్ల మంది వలసలు వెళ్లినట్లు కరోనా ద్వారా బహిర్గతమైంది. కరోన సందర్భంగా పట్టణాల నుండి తిరిగి గ్రామాలకు వెల్లిన వారిలో 5కోట్ల మంది తిరిగి పట్టణాలకు వెళ్లినట్లు సర్వేలు చెపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం 6.52కోట్ల కుటుంబాలు (32కోట్ల మంది) దారిద్య్ర రేఖకు దిగువనున్న వారిగా గుర్తించి వారికి రేషన్ ఇవ్వడం జరుగుతున్నది. ఇందులో 2.44 కుటుంబాలకు అన్నదాత అంత్యోదయ యోజన పథకం ద్వారా బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. గత దశాబ్ద కాలంలో 20కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖ నుండి ఎగువకు చేరినట్లు ప్రధాని మోడీ ఒక వైపున ప్రకటిస్తూ మరోవైపున 80కోట్ల మందికి రానున్న 5సంవత్సరాలు (2029 వరకు) ప్రతి మనిషికి 5కిలోల బియ్యం ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. దారిద్య్ర రేఖకు ఎగువకు చేరినప్పుడు కేంద్రం ఉచిత బియ్యం పథకాన్ని ఎందుకు అమలు జరుపుతున్నట్టు?
బడ్జెట్‌లను పరిశీలిస్తే ప్రభుత్వ ప్రకటనల్లోని లోపాలను గమనించవచ్చు. 2022-23లో వాస్తవ వ్యయం బడ్జెట్ ప్రకారం రూ.41,93,157 కోట్లు కాగా 2024-25 బడ్జెటు రూ.48,20,512 కోట్లకు పెరిగింది. బడ్జెట్‌తో పాటు దళిత గిరిజనులకు సబ్‌ప్లాన్ ప్రకారం రూ.3లక్షల కోట్లకు పెంచారు. ఈ నిధులను 102 ప్రభుత్వ శాఖలో వ్యయం చేస్తారు. దీనివల్ల ఆ వర్గాలకు ఒరిగే లాభం ఏమిలేదు. ఈ వర్గాలకే అంబరిల్లా పథకం కింద మరో 13,500 కోట్ల అంబరిల్లా పథకానికి కూడా కేటాయించారు. 2021-22 నుండి మైనార్టీలకు అమ్మరిల్లా పథకం కింద రూ.1,428కోట్లు కాగా 2024-25 నాటికి రూ.2,500ల కోట్లకు పెంచారు. అయినా ఈ వర్గాలు అభివృద్ధి కావడంలేదు. మైనార్టీలు, బీసీలు, దళితులు, గిరిజనుల కొనుగోలు శక్తి పెరగనందున ”ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్నచందంగా ఉంది. అకలిలో భారతదేశం ప్రపంచదేశాల్లో 113వ స్ధానంలో ఉంది. మనకన్న చిన్న దేశాలు ఎంతో అభివృధ్ధిలో ఉన్నాయి. ఇంత వెనకబాటుతనమున్న దేశంలో బడ్జెట్‌లో ఉత్పత్తి రంగానికి కేటాయింపులు చేయకపోవడం వల్ల, ప్రణాళికా బద్ధమైన ఉత్పత్తి లేకపోవడంతో పెరుగుదలలో లోటు కనబడుతున్నది. కానీ, అదే సందర్భంలో కార్పొరేట్ సంస్థలు ఎలాంటి ఆటంకం లేకుండా తమ లాభాలను పెంచుకుం టున్నారు. అంతేకాక ప్రధాని మోడీ కార్పొరేట్లకు గత 10 సంవత్సరాలల్లో 15లక్షల కోట్ల లాభాలను కట్టబెట్టాడు. లాభాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను బుక్‌వ్యాల్యుకన్న తక్కువ ధరలకు కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు.
బ్లాక్ మనిని పట్టుకొని ప్రతి కుటుంబానికి రూ.15లక్షలు బ్యాంక్‌లో వేస్తానని చెప్పడం వెనక మోసాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రపంచంలో కార్పొరేట్లపై 30-35 శాతం పన్ను విధిస్తుండగా మనదేశంలో 20శాతం లోపే పన్ను విధిస్తున్నారు. దీనిని బట్టి దేశ స్ధూల ఉత్పత్తి ఏ మేరకు పెరుగుతుంది అన్నది ఆర్థికవేత్తలు ఆలోచించాలి. కొందరు కుహనా ఆర్థిక వేత్తలు దేశ ఆర్థిక ప్రగతి పెద్ద అంగలతో దూసుకుపోతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. తలసరి ఆదాయం, సగటు ఆదాయం పెరిగినట్లు గణాంకాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కార్పొరేట్లు-పేదల ఆస్థులను కలిపి తలసరి ఆదాయం పెరిగినట్లు చెబుతున్నారు. గతంలో మిలియనీర్లుగా ఉన్నవారు నేడు బిలియనీర్లు అయ్యారు. త్వరలో ట్రిలియనీర్లుగా పెరగబోతున్నారు. ఆ విధంగా కార్పొరేట్ల ఆస్తుల పెరుగుదలను దేశ స్ధూల ఉత్పత్తి పెరుగుదలలో గణించినప్పటికీ మరోవైపు దారిద్య్రం, నిరుద్యోగం పెరుగుతూనే ఉంది. అందువల్ల ఫిబ్రవరి 4న ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో ఉత్పత్తి రంగానికి, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి పథకాలు రూపొందించాలి. భారతదేశంలో ఉన్న మౌలిక వసతులను వినియోగించుకొని అన్ని రంగాలల్లో ఉత్పత్తిని పెంచాలి. జి-7 దేశాల ఆదేశాలకు లొంగి ఉత్పత్తిని పెంచకుండా దిగుమతుల బాండాగారం చేసే విధానాలకు స్వస్తి పలకాలి. ప్రస్తుత అభివృధ్ధిని శాస్త్రీయంగా పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుతమున్న 5వ స్థానాన్నైనా కాపాడుకోవాలి.
సారంపల్లి మల్లారెడ్డి
9490098