విద్యారంగానికి తగిన బడ్జెట్‌ కేటాయించాలనటం నేరమా?

– విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు
– ప్రజాపాలనలో నిర్బంధమేంటి? :ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి తగిన విధంగా నిధులు కేటాయించాలని కోరినందుకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ఎల్‌మూర్తి, టి నాగరాజు శనివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. విద్యారంగానికి బడ్జెట్‌లో నిధులు తగ్గించడాన్ని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జనగామ జిల్లా కేంద్రంలో బడ్జెట్‌ ప్రతులను దగ్ధం చేశారని తెలిపారు. దీంతో ఆ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులపై అక్రమంగా కేసులు బనాయించారని పేర్కొన్నారు. ఆ కేసులను భేషరతుగా ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో 15 శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. ఆచరణలో 7.3 శాతం మాత్రమే కేటాయించారని తెలిపారు. యూనివర్సిటీలకు, గురుకులాలకు నిధులు అత్యంత తక్కువగా కేటాయించారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌ నిధుల కేటాయింపులు లేవని తెలిపారు.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ ఆందోళన చేసిందని గుర్తు చేశారు. అదే మాదిరిగా ఎస్‌ఎఫ్‌ఐ కూడా ఆందోళన చేసిందని తెలిపారు. ప్రజాపాలన అంటూ ప్రశ్నించే వారిపై నిర్బంధాన్ని ప్రయోగించటం ఏంటని ప్రశ్నించారు. వారిపై కేసులు ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.