రాష్ట్రంలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ప్రాథమిక అంచనాలు 4 నుండి 12 రెట్లు పెరగడం సహజమని, అది నేరం కాదని మాజీ నీటి పారుదల శాఖా మంత్రి కడియం శ్రీహరి నిన్న (01.03.2024) మేడిగడ్డ విలేకరుల సమావేశంలో విన్నవించారు. గతంలో రెండు టర్మ్‌లు నీటి పారుదల శాఖా మంత్రిగా ఉన్న అనుభవంతో చెబుతున్నానని, ఎక్కడైనా ప్రాథమిక అంచనా మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్లు రుజువు చేయాలని సవాల్ విసిరారు. మొదటి నుండి ఇరిగేషన్ ప్రాజెక్టులు పాలక వర్గాలకు, కాంట్రాక్టర్లకు ఏటీఎంలుగా పనిచేస్తున్నాయి. పని ప్రారంభించేటప్పుడు వేసిన అంచనాలు పెంచడానికి వీలుగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని జాఫ్యం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. భారీ ప్రాజెక్టులకే కాక, చివరకు మధ్యతరహా ప్రాజెక్టులు కూడా ఈ భారం నుండి తప్పించుకోలేకపోతున్నాయి. రెండు దశబ్దాల క్రితం ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో చేపట్టిన జగన్నాదపూర్ ప్రాజెక్టుకు ప్రాథమిక అంచనా రు.65కోట్లు కాగా, 2023 మార్చి నాటికి రు.244.66 కోట్లు వ్యయం చేయడం జరుగుతుంది. ఇంకా రు.127 కోట్లు వ్యయం చేస్తే తప్ప ప్రాజెక్టు పూర్తి అయి నిర్ణీత 15వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేయలేమని కాంగ్రెస్ శ్వేతపత్రంలో చెప్పింది. గతంలో ఎకరాకు సాగునీటి వనరులు కల్పించడానికి రు.93వేల కోట్లు ఖర్చుకాగా, 2014 నుండి 2024 వరకు ఎకరాకు రు.11.20లక్షల కోట్లు ఖర్చు చేయడం జరుగుతున్నది. ఇంత ఖర్చు చేసినా సకాలంలో నీరు ఇవ్వలేకపోతున్నారు. రాష్ట్రంలో 18 భారీ ప్రాజెక్టులు, 26 మధ్యతరహా ప్రాజెక్టులు దశబ్దాలుగా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి.
బాధ్యత కలిగిన మంత్రిగా పనిచేసి రివైజ్డ్ పేరుతో 12-15 రెట్లకు అంచనా వ్యయం పెరుగుతుందని వాధించడం అవినీతికి కీలకంగా భావించవచ్చునా? ఏ ప్రాజెక్టునైనా నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయడానికి తగిన ఏర్పాటు లేకుండా తమకు ఉపయోగపడే ఏటీఎంగా మార్చుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజా ధనాన్ని ప్రాజెక్టుల రూపంలో కొల్లగొట్టడం జరుగుతున్నది. 2014 నుండి నేటి వరకు రు.1,81,067 కోట్లు వ్యయం చేసి 15.81 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి వనరులను కల్పించడం జరిగింది. నేడు సాగు నీటి వనరులు కల్పించడం అత్యంత వ్యయంతో కూడుకున్నది. ఈ దురాచారాన్ని తగ్గించడాన్ని నిర్ణీతకాలంలో ప్రాజెక్టులను పూర్తిచేయడం ఒక్కటేమార్గం.
మేడిగడ్డ – సుందిల్ల ప్రాజెక్టుల వ్యయాన్ని గమనిస్తే ఎన్ని రెట్లు అంచనాలు పెరుగుతున్నాయో అర్థమవుతుంది. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని పాలకవర్గాలు నిరంతరం అంచనాలను పెంచుతున్నాయి. అందుకు ఈ దిగువ గణాంకాలే ఉదాహరణ. – సారంపల్లి మల్లారెడ్డి