– మైనంపల్లికి దారులు మూసకుపోయినట్టేనా?
– ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో బీసీలకు రెండు అసెంబ్లీ సీట్లు దక్కుతాయా..?
– కాంగ్రెస్‌కు సమస్యగా మారిన ఉదరుపూర్ డిక్లరేషన్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి/సిటీ బ్యూరో
”పార్టీలో ఐదేండ్ల కన్న తక్కువ అనుభవమున్న నాయకుల కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇవ్వాలి. అలాగే ప్రతి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు సీట్లను బీసీలకు కేటాయించాలి’ అని గతేడాది మేలో రాజస్థాన్ ఉదరుపూర్‌లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిరంలో డిక్లరేషన్ చేశారు. దీన్ని కర్నాటక ఎన్నికల్లో అమలు చేయగా, తెలంగాణలో అమలు చేయాలా.. వద్దా అనే చర్చ నడుస్తోంది. పీఈసీ సమావేశంలో ‘ఉదరుపూర్ డిక్లరేషన్’ పైనే ప్రధానంగా చర్చ సాగింది. అంతిమంగా అధిష్టానం నిర్ణయం వచ్చే వరకు రెండు టికెట్లు ఆశించే కుటుంబాలు, దరఖాస్తు చేసిన బీసీలకు ఉత్కంఠ తప్పదని తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అలాగే రెండు లోక్‌సభ సెగ్మెంట్లున్నాయి. పది స్థానాలకు 22 మంది ఆశావహులు టికెట్ల కోసం దరఖాస్తు చేశారు. వీరిలో ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు ఆశిస్తున్న వారున్నారు. ఏడుగురు బీసీలు తమకు టికెట్ కావాలని పట్టుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల బలాబలాల్ని పరిశీలించేందుకు పీఈసీ కమిటీ సమావేశమైంది. అందులో రెండు టికెట్లపై పెద్ద వాగ్వివాదమే జరిగింది. కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులు ఉదరుపూర్ డిక్లరేషన్ ఆంశాన్ని తెరమీదికి తెచ్చారు. దీంతో రెండు టికెట్లు ఆశిస్తున్న రెండు పెద్ద కుటుంబాలకు నిరాశ ఎదురయ్యే అవకాశముందంటున్నారు. బీసీలు మాత్రం అదే డిక్లరేషన్‌ను బేస్ చేసుకుని టికెట్లు
పొందాలని చూస్తున్నారు.
ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు
కాంగ్రెస్‌లో ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు ఆశిస్తున్న వాళ్ల సంఖ్య అధికంగానే ఉంది. ఆ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తాజాగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు, జానారెడ్డి ఇద్దరు కొడుకులు, సీతక్క, సూర్య తల్లీకొడుకులు, అంజన్‌కుమార్‌యాదవ్ తన కొడుకు, బలరాం నాయక్, శంకర్‌నాయక్ తండ్రీకొడుకులు, కొండాసురేఖ, మురళీ భార్యాభర్తలు, ఏఐసీసీ సభ్యులు దామోదర రాజనర్సింహ, తన కూతురు త్రిష.. ఇలా చాలా కుటుంబాలు రెండేసి టికెట్లు కోరుతున్నారు. అలాగే, బీఆర్‌ఎస్‌కు దూరమైన మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరేందుకు కర్నాటకకు వెళ్లి డీకే శివకుమార్‌ను కలిశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డితో కూడా మాట్లాడి రెండు టికెట్లు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినట్టు చెబుతున్నారు. హన్మంతరావు మల్కాజిగిరి, కొడుకు మైనంపల్లి రోహిత్ మెదక్ సీటు కావాలని కోరుతున్నారు. మైనంపల్లి కుటుంబాన్ని చేర్చకోవడం ద్వారా సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీశ్‌రావును ఎదుర్కొవాలని, అలాగే మేడ్చేల్ నుంచి హనుమంతరావును పోటీకి దించి మంత్రి మల్లారెడ్డిని ఓడించాలని ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ వారు కాంగ్రెస్‌లో చేరినా ఉదరుపూర్ డిక్లరేషన్ అడ్డువచ్చే పరిస్థితి ఉంది.
మైనంపల్లికి మూసకుపోయిన దారులు..!
తన కొడుక్కి టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిలో ఉన్న మైనంపల్లికి దారులన్నీ దాదాపు మూసుకుపోయినట్టే. ఏకంగా మంత్రి హరీశ్‌రావునే టార్గెట్ చేయడంతో బీఆర్‌ఎస్ అధిష్టానం ఖచ్చితంగా మైనంపల్లిపై సెస్పెన్షన్ వేటు వేస్తుందనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో.. ఆయన చేరికపై కాంగ్రెస్, బీజేపీల్లోనూ పెదవి విరుపు ప్రకటనలు వస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో తండ్రీ కొడుకుల్లో ఎవరికో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామని ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా మల్కాజిగిరి నుంచి కాకుండా మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం. మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ మైనంపల్లిని అక్కడి నుంచి బరిలోకి దించి మంత్రి మల్లారెడ్డికి చెక్ పెట్టాలని చూస్తోంది. ఈ విషయంపై మైనంపల్లి ఇంకా ఎటూ తేల్చలేదు. కాగా, ఆయన కుటుంబం కాంగ్రెస్‌లో చేరినా.. కనీసం ఐదేండ్లు పార్టీలో సేవ చేయని నాయకుడి కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వకూడదన్న ఉదరుపూర్ డిక్లరేషన్ నిబంధనలు ఉల్లంఘించి టికెట్లు ఎలా ఇస్తారనే చర్చ నడుస్తోంది. ఇక బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మైనంపల్లిని తమ పార్టీలో చేర్చుకునేది లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాక, బీజేపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించిన మైనంపల్లి లాంటి వారికి తమ పార్టీలో చోటు లేదని చెప్పేశారు. దాంతో బీఆర్‌ఎస్‌లో ఉండలేక.. అటు కాంగ్రెస్‌లో చేరలేక.. ఇటు బీజేపీలోకి వెళ్లలేక మైనంపల్లి అయోమయంలో పడ్డారు.
డిక్లరేషన్‌పై ఆశతో ఏడుగురు బీసీలు దరఖాస్తు
ఉదరుపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ టికెట్లు బీసీలకు ఇవ్వాల్సి ఉన్నందున ఆ ఆశతో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఏడుగురు బీసీలు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, జహీరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మెదక్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో పటాన్‌చెరు నుంచి కాట శ్రీనివాస్ (గౌడ్), గాలి అనిల్‌కుమార్ (మున్నురుకాపు), నర్సాపూర్ నుంచి అంజనేయులు (గౌడ్), గాలి అనిల్‌కుమార్ (మున్నురకాపు), దుబ్బాక నుంచి కత్తి కార్తిక (గౌడ్), సిద్దిపేట నుంచి దరిపల్లి చంద్రం (కుమ్మరి), సూర్యచంద్రవర్మ (పెరిక) టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జహీరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి సంజీవరెడ్డి (బీసీ కర్ణాటక రెడ్డి) కూడా బీసీ కోటాలో టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.