”ఓ 2024 సంవత్సరమా!?”

”నీవూ కొలువుదీరబోయే
సమయం ఆసన్నమైంది!!

ఏదీ నీ మ్యానిఫెస్టో?
ప్రకటించు ఇప్పటికైనా!?

నీ పాలనా కాలంలో…
అంటే 2024 సంవత్సరంలో

ఏ యుద్ధాలు ఆగిపోతాయా?
ఏ పసిపిల్లలు, వృద్ధులు, మహిళలు
యుద్ధోన్మాదానికి, ఆధిపత్య పోరుకు
బలి కావడం ఆగుతుందా?

ఏ చిన్నారులకు కాలుష్యం లేని గాలి,
కల్తీ లేని నీరు, కల్మషం లేని సమాజం
ఇచ్చే దిశలో ఒక్క అడుగైనా పడుతుందా?
ఏ బాలికలు, మహిళలు ధైర్యంగా,
సురక్షితంగా, స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో, ఆత్మనిర్భరతతో జీవించే
వాతావరణం ఏర్పడుతుందా?

ఏ అడ్డదారుల్లో ఓట్లు కొల్లగొట్టే వారు
అలవికాని డొల్ల హామీలివ్వడం మానేస్తారా?
ఏ పేదలని కొట్టి పెద్దలకిచేచ్చే
విధానాలు ఆపేస్తారా?
ఏ ఈ క్రమంలో పేదలను, చేతగాని
అభాగ్యులను సోమరిపోతులుగా,
దోచుకునే వారుగా చిత్రీకరించి, ప్రజలందరికీ వారిపట్ల
కసి పెంచే (కు)యత్నాలు ఆపేస్తారా?

ఏ నిరాశ, నిస్పృహలను విడిచి,
భవిష్యత్తు పట్ల గొప్ప ఆశలతో, ఆకాంక్షలతో
సరైన అవకాశాలు అందిపుచ్చుకునే
నైపుణ్యాలను యువతకు అందజేస్తారా?
ఏ సమాజంలో అపార సంపద సృష్టించే
కష్టజీవుల పట్ల
కొద్దిపాటి సానుభూతి కలిగి,
వారి శ్రమను దోచుకునే దొరల దాష్టీకాన్ని
రూపుమాపే చర్యలు మొదలవుతాయా?

ఏ ఎన్నో వేదనలు, ఎన్నో ఒత్తిళ్లు,
మరెంతో దు:ఖ భాజితమైన
ఈ ప్రపంచంలో.. ఇవేవీ లేనట్లు..
”వినోదం” వెంట ప్రతిపూట,
ప్రతి క్షణం దారీ తెన్నూ లేక పరిగెడుతున్న
సమాజ భవిష్యత్‌ ముఖచిత్రం
”యువత” ఇప్పటికైనా
సరైన దారిలో నడుస్తుందా!?

ఏ దేవుడు తమ గోడు వింటాడని,
తమ సంతోషాలకు కారణమని
విపరీతంగా విశ్వసించే అమాయక భక్తులు
మతం, రాజకీయం వేరు వేరని,
కుటిల రాజకీయుల కుట్రలను
గుర్తించే రోజు వస్తుందా!?

ఇవన్నీ నెరవేర్చాలని మా డిమాండ్‌!
నెరవేరుస్తావని మా అపరిమిత విశ్వాసం!!
మేమంతా నీ వెంట నడుస్తాం!
విశాల విశ్వం నీతో నడిచేట్లు చూస్తాం!!

మా అందరి ఓట్లూ ఏకగ్రీవంగా నీకే!”

– గిరిధర్‌, 9849801947