కేంద్రం నిద్రపోతోందా?

– నేడు రాష్ట్ర గవర్నర్‌తో భేటీ
– మణిపూర్‌లో హింస దేశ ప్రతిష్టకు దెబ్బ
– శాంతి నెలకొన్నదని కేంద్రం చెబుతున్నది
– మరి ప్రజలు ఇంకా తమ సొంత ఇండ్లకు ఎందుకు వెళ్లలేదు?
– తీవ్ర భయాందోళనలో ప్రజలు
– ప్రభుత్వంపై నమ్మకం పోయింది
– రెండు బృందాలుగా మణిపూర్‌ వాసులను కలుసుకుంటున్న ప్రతిపక్ష ఎంపీలు
న్యూఢిల్లీ : దాదాపు తొంబై రోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ కాలిపోతుంటే, కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా? అని ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నించారు. మణిపూర్‌లో హింస దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నదని తెలిపారు. అక్కడ శాంతి నెలకొందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదనీ, అయితే ప్రజలు ఇంకా తమ సొంత ఇండ్లకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మణిపూర్‌కు శాంతి కావాలని, అందుకు ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం 16 పార్టీలకు చెందిన 20 మంది ప్రతిపక్ష ఎంపీలు శనివారం మణిపూర్‌కు చేరుకున్నారు. పది మంది చొప్పున రెండు బృందాలుగా ఏర్పడి మణిపూర్‌లోని హింసాత్మక ప్రాంతాలను, సహాయ కేంద్రాలను సందర్శించారు. అక్కడ బాధితులను కలిసి వారి బాధలను విన్నారు. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. ప్రతిపక్ష ఎంపీలు తమ మద్దతును ప్రకటించారు. మణిపూర్‌లో శాంతి నెలకొని, సాధారణ పరిస్థితులు ఏర్పడేవరకూ అక్కడి ప్రజలకు అండగా ఉంటామని ఎంపీలు స్పష్టంచేశారు. అలాగే కుకీ, మైతీ తెగల నాయకులను కూడా కలిశారు. ఎంపీలు అధిర్‌ రంజన్‌ చౌదరి, ఫూలో దేవి నేతమ్‌ (కాంగ్రెస్‌), కనిమొళి (డీఎంకే), సుస్మిత సేన్‌ (టీఎంసీ), ఎఎ రహీం (సీపీఐ(ఎం)), పి. సంతోష్‌ కుమార్‌ (సీపీఐ), మనోజ్‌ కుమార్‌ ఝా (ఆర్‌జేడీ), జావిద్‌ అలీ ఖాన్‌ (ఎస్‌పీ), డి. రవి కుమార్‌, తిరుమవలవన్‌ (వీసీకే)లతో కూడిన ఇండియా కూటమి బృందం చురచంద్‌ పూర్‌లోని బార్సు హాస్టల్‌లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాన్ని సందర్శించింది. అక్కడ బాధితులతో మాట్లాడిన అనంతరం, కుకీ నాయకులు, పౌర సమాజ సభ్యులను కలుసుకుంది. అక్కడి నుంచి ఇంఫాల్‌ చేరు కుంది. అక్కడ బిష్ణుపూర్‌ జిల్లాలోని మోయిరాంగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాన్ని సందర్శించింది. అక్కడ బాధితులను, ముఖ్యంగా చిన్నారులు, మహిళలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకుంది. అక్కడి నుంచి హింసాత్మక ప్రాంతాలను సందర్శించింది.
ఎంపీలు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌, అనిల్‌ ప్రసాద్‌ హేగ్డే (జేడీయూ), గౌరవ్‌ గోగోరు (కాంగ్రెస్‌), పి.పి మహ్మద్‌ ఫైజల్‌ (ఎన్‌సీపీ), ఈ.టి మహ్మద్‌ బషీర్‌ (ఐయూఎంఎల్‌), ఎన్‌.కె ప్రేమ్‌చంద్రన్‌ (ఆర్‌ఎస్‌పీ), సుశీల్‌ గుప్తా (ఆప్‌), అరవింద్‌ సావంత్‌ (శివసేన, ఠాక్రే), మహువా మాఝీ (జేఎంఎం), జయంత్‌ చౌదరి (ఆర్‌ఎల్‌డీ)లతో కూడిన మరో ఇండియా కూటమి బృందం చురచంద్‌పూర్‌లోని డాన్‌ బాస్కో స్కూల్‌లోని సహాయ శిబిరాన్ని సందర్శించింది. అక్కడ ప్రజలతో మాట్లాడి వారి ఆవేదనలు తెలుసుకుంది. అక్కడ నుంచి ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లాలకు చేరుకుంది. అక్కడ అకంపేట్‌లోని ఐడిల్‌ గర్ల్స్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాన్ని సందర్శించారు. ఇంఫాల్‌ వెస్ట్‌లోని లంబోయిఖోంగాంగోన్‌లో సహాయక శిబిరాన్ని సందర్శిం చారు. రెండు బృందాలూ కుకీ, మైతీ కమ్యూనిటీ సభ్యులను కలుసుకున్నాయి.
ఈ సందర్భంగా అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ మణిపూర్‌లోని ఘర్షణలు దేశ ప్రతిష్టను దెబ్బతీశాయని అన్నారు. మణిపూర్‌లో జాతి వివాదం దేశ ప్రతిష్టను మాత్రమే కాకుండా రాష్ట్రం, ఈశాన్య ప్రాంతాన్ని కూడా దెబ్బతీసిందని అన్నారు. ‘జాతి ఘర్షణల బాధితులను కలవడానికి, సమస్యను అర్థం చేసుకోవడానికి మేము ఇక్కడకు వచ్చాము. హింసకు ముగింపు పలకాలని, శాంతిని త్వరగా పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము. మణిపూర్‌లో ఏమి జరుగుతుందో ప్రపంచం మొత్తం గమనిస్తోంది’ అన్నారు. ”కేంద్రం సీబీఐ దర్యాప్తు గురించి మాట్లాడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిద్రపోతుందా?’ అని ప్రశ్నించారు. ”మణిపూర్‌ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వారు ప్రభుత్వం పై పూర్తిగా నమ్మకం కోల్పోయారు. ప్రభుత్వం మాకు సహాయం చేయదని వారు అనుకుంటున్నారు’ అని అన్నారు. ఇప్పటి వరకు మణిపూర్‌లో పర్యటించేందుకు కూడా ప్రధాని మోడీ ప్రయత్నించలేదని విమర్శించారు.
టీఎంసీ ఎంపీ సుస్మితా దేవ్‌ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. లైంగిక దాడి బాధితురాలిని కలిసిన తరువాత డీఎంకే ఎంపీ కని మొళి మాట్లాడుతూ వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోరు మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో శాంతి నెలకొందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదనీ, అదే నిజమైతే సహాయక శిబిరా ల్లోని ప్రజలు తమ ఇండ్లకు ఎందుకు వెళ్లలేకపోతున్నారని ప్రశ్నించారు.
నేడు గవర్నర్‌తో ప్రతిపక్ష ఎంపీల భేటీ
నేడు (ఆదివారం) రాజ్‌భవన్‌లో మణిపూర్‌ గవర్నర్‌ అనుసూయా ఉయికేతో ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితి, శాంతిని నెలకొల్పడానికి సాధ్యమయ్యే చర్యల గురించి చర్చిస్తారు.
సహాయక శిబిరాన్ని సందర్శించిన గవర్నర్‌
ప్రతిపక్షాలు మణిపూర్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో మణిపూర్‌ గవర్నర్‌ అనుసూయా ఉయికే చురచంద్‌పూర్‌ లోని సహాయక శిబిరాన్ని సందర్శించారు. చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన, ఆస్తి నష్టానికి గురైన వారికి ప్రభుత్వం పరిహారం అంద జేస్తుందని ఆమె తెలిపారు. ‘దాదాపు మూడు నెలలుగా ఈ ప్రజలు తమ తమ ఇండ్లకు దూరంగా ఉన్నారు. హింసలో చాలా మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పో యారు. చాలా మంది తమ వస్తువులను కోల్పోయారు. వారికి ఏమీ మిగలలేదు. కనీసం ఈ వ్యక్తులు శిబిరంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా చూడాలని నేను ఇక్కడకు వచ్చాను’ అన్నారు. ‘నేను రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహించే సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కలుసుకున్నాను. శాంతిని నెలకొల్పడంలో వారి సహకారం కోరాను. మనం రాజకీయాలకు అతీతంగా ఎదగాలి. మణిపూర్‌లో శాంతి, సాధారణ స్థితిని నెల కొల్పాలి’ అని అనుసూయా ఉయికే అన్నారు.