నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
లగచర్లలో అర్థరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండే చేయడమే కాకుండా పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా ? అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోంది ? వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోంది ? సీఎం సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి ? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా? లేక లగచర్ల చైనా బార్డర్లో ఉన్న కల్లోలిత ప్రాంతమా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేశారనీ, కొడంగల్‌కు వెళ్లే అన్ని దారుల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ దాచే ప్రయత్నం చేసినా నిజం దాగదని తెలిపారు. ఇప్పటికే లగచర్లలో కాంగ్రెస్ సర్కారు కిరాతకం ఢిల్లీకి చేరిందనీ, అక్కడ కాంగ్రెస్ అరాచకపర్వంపైనే తీవ్ర చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే కాంగ్రెస్ సర్కారు తప్పుచేసినట్టు ఒప్పుకున్నట్టే లెక్క అని స్పష్టం చేశారు. మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పాలనీ, లగచర్లలో నిర్బంధాన్ని ఎత్తేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.