హైదరాబాద్‌ను లేక్‌సిటీగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ చేపట్టిన ‘హైడ్రా’ ఆదిలోనే విమర్శల్ని మూటకట్టుకుం టోంది. దీనికి కారణం లేకపోలేదు. చెరువులున్న ప్రాంతాల్లో కబ్జాలకు పాల్పడి బడా బాబులు నిర్మించిన విల్లాలు, గెస్ట్‌హౌస్‌లు కూల్చినపుడు నగర ప్రజల నుంచి ప్రశంసలు రాగా, ఆ చర్యలు కాస్తా సామాన్యుల ఇండ్లను తాకడంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఇపుడు హైడ్రా అంటే కూల్చి వేతల డిపార్ట్‌మెంటు అన్నట్లుగా ప్రజల మదిలో నాటుకుపోయింది. వాస్తవానికి కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా ఉద్దేశాలను ఇక్కడ తప్పుపట్టలేం. కానీ స్పష్టమైన ప్రణాళిక, పేదల ఇండ్లకు ప్రత్యామ్నాయ చర్యలు, వారిని ఒప్పించే వంటి ప్రణాళికలతోపాటు అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో హైడ్రా చర్యలు చేపట్టివుంటే పరిస్థితి వేరేలా ఉండేది. లేక్‌సిటీ పేరును సార్థకం చేయాలంటే అక్రమ కట్టడాలను కూల్చాల్సిందే. కానీ ఈ కబ్జాలో వెలసిన అపార్ట్‌మెంట్లు, ఇండ్లలో సామాన్య ప్రజలు ఇది కబ్జా ప్రాంతమని తెలియకుండానే అక్కడ నివాస ముంటున్నారు. ఇప్పుడు కబ్జాల తొలగింపు పేరుతో హైడ్రా పెంచిన దూకుడుతో పేదలు కూడా రోడ్డుపాలవుతున్న పరిస్థితి. కబ్జాలను తొలగిం చాలంటే బాడా బాబులతోపాటు సామాన్య, మధ్య తరగతి ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్న ముందుచూపు, ఆ ఆలోచన లేకపోవడంతో సర్కార్‌ను ఇప్పుడు సమాజం దోషిగా నిలబెట్టింది. కాస్తా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, ప్రణాళికతో ముందుకు సాగితే ప్రజల నుంచే మద్దతు లభించేదన్న వాదన వాస్తవం.
మనదేశంలోని జైపూర్ అంటే పింక్‌సిటీ.. లక్నో అంటే నవాబుల నగరం.. బెంగళూరు అంటే గార్డెన్ సిటీ.. మరి మన హైదరాబాద్..? అటు కుతుబ్ షాహీలు.. ఇటు అసఫ్ జాహీలు.. మధ్యలో మొఘులులు పాలించిన నేల. భారత దేశంలో రోజురోజుకూ ఎదుగుతున్న నగరం.. ఒకప్పుడు భాగ్యనగరంగా ప్రసిద్ధిచెందిన నగరం. కానీ, రానురానూ కాంక్రీట్ జంగిల్ అవుతుందనే ఆందోళన కలుగుతోంది. పెరిగిపోతున్న నగరీకరణతో చెరువులను మింగేస్తూ భారీ భవంతుల నిర్మాణాలు వెలిశాయి. అయితే ఒకప్పుడు హైదరాబాద్‌కు ఉన్న పేరేమిటో తెలుసా…? లేక్‌సిటీ(సరస్సుల నేల). చాలా సరస్సులు 16,17వ శతాబ్దాలలో కుతుబ్ షాహీల పాలనలో నిర్మితమయ్యాయి. ఇది చాలామందికి తెలిసి ఉండదు. ఇప్పుడంటే హైడ్రా కారణంగా అందరూ చెరువుల ఆక్రమణల గురించి మాట్లాడుతున్నారు. అయ్యో ఇన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయా? అని నోరెళ్లబెడుతున్నారు. ఏ దిక్కున చూసిన సరస్సులతో అలరారేది భాగ్యనగరం. వీటిలో సహజమైనవి కాగా, నిర్మించినవీ కూడా ఉన్నాయి. కాలక్రమంలో ఈ సరస్సులలో చాలావరకు కనుమరుగయ్యాయి. మనుగడలో ఉన్నవి ఆక్రమణలతో కుంచించుకుపోయాయి. తీగల్ కుంట, సోమాజిగూడ ట్యాంక్, మీర్ జుమ్లా ట్యాంక్, పహార్ తీగల్ కుంట, కుంట భవానీ దాస్, నవాబ్ సాహెబ్ కుంట, అఫ్జల్‌సాగర్, నల్లకుంట, మసాబ్ ట్యాంక్ ఇలా హైదరాబాద్‌లో దాదాపు కనుమరుగైన కొన్ని సరస్సులు. నగరం చుట్టుపక్కల ప్రాంతాలలో 1970లలో వివిధ పరిమాణాల్లో ఉన్న వేలాది నీటి వనరులలో నేడు 70 నుంచి 500 వరకు మాత్రమే మనుగడలో ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆక్రమణలు, రియల్ ఎస్టేట్, ప్రాజెక్టుల కోసం వీటిని చెరబట్టారు.
1575లో నిజాంలు నిర్మించిన హుస్సేన్‌సాగర్ 1930లలో హైదరాబాదీల తాగునీటి వనరు. అతిపెద్ద సరస్సు అయిన దీని వైశాల్యం 30 ఏళ్లలో 40శాతం కంటే ఎక్కువ (550 హెక్టార్ల నుంచి 349 హెక్టార్లకు) తగ్గిపోయింది. ఇక దుర్గం చెరువు వంటి పెద్ద చెరువులు పర్యాటక కేంద్రాలుగా మారగా చిన్నవాటిని పట్టించుకోవడం మానేశారు. హైదరాబాద్‌లో ఒకప్పుడు 250పైగా మానవ నిర్మిత సరస్సులు ఉండేవి. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం గతేడాది ఫిబ్రవరి నాటికి జీహెచ్‌ఎంసీలోని 185 సరస్సులలో 23 ఎండి పోయాయి. కుతుబ్ షాహీల అధీనంలో గోల్కొండ ప్రఖ్యాతి చెందింది. అయితే పెరుగుతున్న జనాభా కోసం 1589లో 5వ సుల్తాన్ మహ మ్మద్ కులీ కుతుబ్ షా కొత్త నగరాన్ని నిర్మించ తలపెట్టారు. మూసీ నది దక్షిణ ఒడ్డున గోల్కొండకు తూర్పు దిశలో నిర్మించాలని దీనికి ప్రదేశం నిర్ణయించారు. నిర్మాణం ప్రారంభం సందర్భంగా కులీ కుతుబ్ షా మూసీ ఒడ్డున ఏమని కోరుకున్నాడో తెలుసా? ఈ నదిలో చేప పిల్లల్లాగే ”నా కొత్త నగరాన్ని ప్రజలతో నింపు” అని. ఆయన అనుకున్నట్టే హైదరాబాద్ ప్రజలతో నిండిపోయింది. కానీ.. నదులే కాలుష్య ప్రదేశాలుగా మారిపోయాయి.మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ లేక్ సిటీగా మారాలంటే కచ్చితంగా హైడ్రా అవసరమే. కాకపోతే పేదలు, సామాన్యులు, మధ్య తరగతి వారికి వారు కట్టుకున్న ఇండ్ల విలువకు సమానమైన నివాస ప్రాంతాలు చూపాలి. వారికి అవగాహన కల్పించాలి. విపక్ష పార్టీలతో ముఖ్యమంత్రే స్వయంగా సమావేశం ఏర్పాటు చేసి ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలి. అప్పుడే రేవంత్‌రెడ్డి సర్కార్ ఆశించిన హైడ్రా సంకల్పం నేరవేరుతుంది. లేదంటే ఇది భవిష్యత్తులో కాంగ్రెస్‌కు గుణపాఠం నేర్పుతుంది!
– నిసార్ అహ్మద్, 7801019343