వృద్ధాప్యమే శాపమా?

Agewell Foundation' Survey– ‘ఆమె’ను వేధిస్తున్న కుటుంబం
– ‘పెద్ద’ అనే గౌరవమూ లేదు
–  45 శాతం మంది మహిళలది ఇదే పరిస్థితి
–  ‘ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌’ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : మహిళల రక్షణ, సాధికారత, స్వయంశక్తి కోసం ప్రత్యేక చట్టాలు, కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెడుతున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. అయితే, ఇవేమీ మహిళకు ఆశించిన ఫలితాలను అందించలేకపోతున్నాయి. సమాజంలోనే కాదు.. కుటుంబంలోనూ వేధింపులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, వయసు పైబడిన మహిళలపై ఈ వేధింపులు అధికంగా ఉన్నాయి. వీరిలో 45 శాతం మందికి పైగా కుటుంబంలో మానసికంగానో, శారీరకంగానో, సూటిపోటి మాటలతోనో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుటుంబంపై ఆధారపడటం, ఒంటరిగా ఉండటం, అవసరాలు వంటి అంశాలు ఈ వేధింపులకు కీలక కారణాలుగా ఉన్నాయి. ‘ఏజ్‌వేల్‌ ఫౌండేషన్‌’ స్వచ్ఛంద సంస్థ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఏడాది కాలానికి పైగా దాదాపు పదివేల మంది మహిళల నుంచి సంస్థ సమాచారాన్ని, అభిప్రాయాలను సేకరించింది.
ఈ సర్వే సమాచారం ప్రకారం.. ఒంటరితనం, చిన్నచూపు వంటి కారణాలను 51 శాతం మంది మహిళలు తెలిపారు. తమ అవసరాలను పొందటం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తున్నదని 71 శాతం మంది వెల్లడించారు. స్వంత కుటుంబసభ్యులు, బంధువుల నుంచి వేధింపులున్నాయనీ, చిన్న చూపు చూస్తున్నారని 45 శాతానికి పైగా స్త్రీలు తెలిపారు. ఇక వృద్ధులైన మహిళలైతే ఇతరులపై ఆధారపడాల్సి వస్తున్నదనీ, గొంతెత్తకుండా రాజీ జీవితాన్ని గడుపుతున్నారని సర్వేలో వెల్లడైంది.
వయసు పైబడిన మహిళల పరిస్థితికి సంబంధించి ఇప్పటికే అనేక అధ్యయనాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. గతేడాది ‘హెల్ప్‌ఏజ్‌ ఇండియా’ తన అధ్యయనంలో సర్వేలో పాల్గొన్న 16 శాతం మంది మహిళలు భౌతికంగా, మానసికంగా వేధింపులను ఎదుర్కొంటున్నారని వివరించింది. వీరిలో 40 శాతం మంది వారి కొడుకునే ప్రాథమికంగా నిందించారు. 17 శాతం మంది తమ భాగస్వామి కారణంగా వేధింపులను ఎదుర్కొంటున్నట్టు వివరించారు. వేధింపులను ఎదుర్కొన్నవారిలో 43 శాతం మంది భౌతికంగా హింసను ఎదుర్కొన్నారని అధ్యయనం వివరించింది. చిన్నతనంలో, యువతులుగా ఉన్న సమయంలో హింసను ఎదుర్కొన్నామనీ, తండ్రులు (31 శాతం), బంధువులు (39 శాతం), మహిళలు (5 శాతం), అత్తమ్మలు (5 శాతం), మామలు (4 శాతం), తాత (3 శాతం), అమ్మమ, నానమ్మ (2 శాతం) ల ద్వారా ఇది జరిగిందని తెలిపారు.దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా జరిపిన అధ్యయనం ‘ఉమెన్‌ అండ్‌ ఏజింగ్‌ : ఇన్‌విజిబుల్‌ ఆర్‌ ఎంపవర్డ్‌?’లో వయసు పైబడిన మహిళల్లో 47 శాతం మంది వేధింపులు ఎదుర్కొన్నారనీ, అగౌరవానికి గురయ్యారని తేలింది. కుమారులు, భర్తల ద్వారానే కాకుండా కోడళ్లు (27 శాతం), కూతుర్లు (10 శాతం), ఇతర బంధువులు (31 శాతం), మనవళ్లు, మనవరాళ్లు (7 శాతం), అల్లుళ్లు (ఆరుశాతం) ద్వారా కూడా వారికి వేధింపులు ఎదురయ్యాని అధ్యయనం వివరించింది. 15 శాతం మంది మహిళలకే ‘మెయింటెనెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజెన్స్‌ యాక్ట్‌’ గురించి తెలుసని అధ్యయనం పేర్కొన్నది.ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిని సారించి, ఇలాంటి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలనీ, చట్టాలు, వాటిని ఉల్లంఘిస్తే పడే శిక్షల గురించి కూడా అవగాహన కల్పించాలని సామాజిక కార్యకర్తలు, మేధావులు సూచిస్తున్నారు.