తెలుగు సాహిత్యంలో ‘ఈ శతాబ్దం నాది’ అని ప్రకటించుకున్న కవి శ్రీశ్రీ (1910 – 1983). అందుకు ఆయన తెలుగు సాహిత్యంలో చేసిన ప్రయోగాలు, కషి, ఆయన సజన ఆయన ఆ మాట అనేందుకు పురికొల్పాయి. తెలుగు కవిత్వాన్ని ఒక సంధి కాలంలో ప్రతిభావంతంగా వెలిగించినవాడు శ్రీశ్రీ. పద్యం నుంచి అనువాదం వరకు ఏది చేసినా ఉన్నత ప్రమాణాలు అందుకునేందుకు ప్రయత్నించాడు. ప్రపంచ సాహిత్యాన్ని విస్తతంగా చదువుకోవడమే కాకుండా తెలుగు సమాజానికి పరిచయం చేశాడు.
అయితే తన సమకాలీన కవుల కన్నా శ్రీశ్రీ నాలుగడుగులు ముందు ఎందుకున్నాడోనని పరిశీలిస్తే, ఆయన ప్రపంచ సాహిత్యాన్ని చదువుకోవడమే కాకుండా, ఆ సాహిత్యాన్ని వస్తుశైలీ గతంగా తెలుగులోకి అనువదించాడు. అలాగే తన కవిత్వాన్ని విశ్వ వినువీథుల వినిపించాడు. అందుకే శ్రీశ్రీ కవిత్వంలో వస్తు వైవిధ్యమూ, నవ్య వ్యక్తీకరణ, భావ లాలిత్యమూ, ఆర్ద్రత, అభ్యుదయ భావజాలమూ, మహోగ్రమయిన కవితాలయ వుంటాయి. ఇవే శ్రీశ్రీని మిగతా కవులకు భిన్నంగా, అభ్యుదయ కవిత్వానికి ఒక ఐకాన్‌గా నిలబెట్టాయి.
‘ఒక కథ గాని, గీతం గాని, నాటకం గాని ఎంతగానో నన్ను ఆకర్షిస్తేనే తప్ప దాన్ని నేను అనువదించను ‘అని ప్రకటించుకున్న శ్రీశ్రీ ఆ పనిని నిష్టగా చేశాడు. ప్రపంచ కవిత్వాన్నే కాక, తన తోటి కవుల కవిత్వాన్ని కూడా ఆంగ్లీకరించాడు. ఇట్లా తన తోటి కవుల కవిత్వాన్ని ఆంగ్లీకరించిన తెలుగు కవులు బహు అరుదు. శ్రీశ్రీ కవిత్వం చదువుతున్నప్పుడు ఆ కవిత్వంలోని పదాల ప్రవాహ వేగాన్ని ఆంగ్లంలోకి ఎవరయినా చేశారా అన్నది ఆసక్తికరం. అందులోనూ ఆయన కవిత్వంలో లయాత్మక శాబ్దిక ధ్వనిని ఆంగ్లంలోకి తీసుకువచ్చారా అన్నది ఇంకా ఆసక్తిదాయకం. శ్రీశ్రీ కవిత్వం ఆంగ్లంలోకి అనువాదం చేసినవారు ఎవరైనా వున్నారో లేదో గానీ, శ్రీశ్రీ సాహిత్యనిధి తరపున అశోక్ కుమార్ గారు శ్రీశ్రీ ఆంగ్లం నుండి తెలుగు చేసిన కవితలతో ‘ఆంధ్రీ కవనం’, తెలుగు నుండి ఆంగ్లంకు చేసిన కవితలతో ‘ఆంగ్లీకవనం’ పుస్తకాలు వెలువరించారు.
ఆంగ్లీకవనంలో శ్రీశ్రీ మొత్తం 53 కవితలు తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. అందులో 40 శ్రీశ్రీ సొంత రచనలు కాగా మిగతా 13 మిగతా తెలుగు కవులవి. అందులో 5 కవితలు దిగంబర కవులవి కాగా, మిగతా వారు పేరు గాంచిన తెలుగు కవులు.
తెలుగు సాహిత్య ప్రపంచంలో ముందు నుంచీ ఇతర భాషల నుంచి తెలుగులోకి వస్తున్న సాహిత్యం ఇబ్బడి ముబ్బడిగా వుంటే, తెలుగు నుంచి ఆంగ్లంలోకి వెళుతున్న సాహిత్యం, అందునా కవిత్వం బహు తక్కువ. తెలుగు కవిత్వంతో , ఆ మాట కొస్తే అసలు కవిత్వ అనువాదంతోనే అనేక సమస్యలు వున్నాయి. పద్యం/ కవితలో వుండే నడక, లయ, సొగసు, చంధస్సు, శాబ్దిక గాంభీర్యం అనువాదానికి లొంగదు. ఇతర భాషలలోని ప్రక్రియా రూపాలైన అమెరికన్ల సోనెట్, పారసీక గజల్, జపనీయ హైకు పరభాషలలోకి అంతే సారంతో అనువాదం కావు. లక్ష్యభాషను నేర్చుకున్న అనువాదకులు కూడా మూలభాషలో ప్రావీణ్యులైన స్కాలర్స్‌ని సహ అనువాదకులుగా ఏర్పాటు చేసుకొని, అనువాద పుస్తకాలు ప్రచురిస్తున్నదీ ఇందుకే. ఇందువల్ల అనువాదం మూలభాషకు దగ్గరగా వచ్చే అవకాశం వుంది. అనువాదాలు నమ్మదగినవిగా, నాణ్యంగా, రచయిత అంతరాత్మను పట్టి ఇచ్చేవిగా వుండడానికి అవకాశం వుంది.
‘అనువదించడం ఎలా?’ అనే పుస్తకంలో కవిత్వ అనువాదం గురించి చర్చిస్తూ గోవిందరాజు చక్రధర్ ఇలా అంటున్నారు. పరభాషలో పాండిత్యముండాలే గానీ వేమన కవిత్వం అనువాదానికి చక్కగా ఒదుగుతుంది. బ్రౌన్ కూడా మరీ తేలిగ్గా వీటిని అనువదించలేదు. వేమన పద్యాల అనువాదకర్తవ్యంలో ఎదురైన ఇబ్బందుల్ని గురించి బ్రౌన్ ఇలా వివరించారు.
ªThese poems have attained very great popularity and parts are found translated into Tamil and Malayalam or Canarese.Their terse closeness of expression sometimes renders them difficult to translate with elegance. బ్రౌన్ elegant గా అనువదించడం కష్టం అన్నారు. వేమన పద్యానికొక అందమైన శైలి వున్నది. ఆ శైలిని అనువాదంలో పునఃసష్టించడం కష్టమని బ్రౌన్ మహాశయుడు అంగీకరించారన్నమాట.’
శ్రీశ్రీ కూడా దీనికి అతీతుడు కాడు. మిగతా అన్నిచోట్ల అనువాదాన్ని నెగ్గించుకుంటా వచ్చిన శ్రీశ్రీ తన సొంత కవిత్వంలోని ప్రవాహ లయని ఆంగ్లంలో సాధించలేకపోయాడు అధయ’బాటసారి’ కవిత ఉదాహరణగా చూడండి:
(AWayfarer )
Consuming fever vibrant, virulent,Sends shocking fear through his entire being; He raves, he roars half a consciously And the louds gather, strong winds rage, A storm, a flood, pitch darkness around In grief he is drowned. He lost his way, how sad his plight!
రెంటికీ పోల్చి చూడండి. తెలుగులోని కవితా శైలి ఉత్తుంగ తరంగాల్లా పోటెత్తితే..ఆంగ్లంలో ఆ లయ, పోటెత్తే శైలి,సంక్షిప్తత లుప్తమయి, కేవలం భావార్థాన్ని మాత్రమే కలిగివుంది. కాబట్టి కవిత్వానువాదంలో కూడా భేష్ అనిపించుకున్న శ్రీశ్రీ కూడా తన కవిత్వాన్ని ఆ లయ, నడక,స్వరం, పదాలు, శాబ్దికసౌందర్యంతో, సంక్షిప్తీకరణతో, తీవ్రతతో సహా అనువదించలేక పోయాడని నిరూపితమవుతున్నది. ఇది శ్రీశ్రీ కవిత్వంలో పరవళ్ళుగా ప్రవహించే శైలి గల ప్రతి కవితకు వర్తిస్తుంది. మహాప్రస్థానం (Long March) చూడండి, ప్రతిజ్ఞ (Now I Vow) చూడండి, జయభేరి (The March of History) చూడండి, దేశ చరిత్రలు (ుష్ట్రవ వీaతీషష్ట్ర శీట నఱర్‌శీతీy) ఇలా మరికొన్ని..
ఆయనకు చాలా పేరు తెచ్చిన కవితలు ‘ కవితా!ఓ కవితా!'(To Posey : A Rhapsody) జగన్నాథుని రథచక్రాలు (Chariot Wheels of Jagannatha) ఆంగ్లీకరణ కూడా తెలుగు కవిత ప్రమాణాలు పూర్తిగా అందుకోలేకపోయిందనే చెప్పాలి.
కానీ స్థితప్రజ్ఞత, దయ, సౌందర్యం, అనుభూతి వంటి విషయాలు వున్న కవితలు మాత్రం ఆంగ్లంలోకి బాగానే తర్జుమా చేసినట్టు కనపడుతోంది.ఆశాదూతలు (Messengers of hope), ఐ (I), అవతలి గట్టు (The Shore beyond),, సాహసి(Adventurer), భిక్షువర్షీయసి(An Old Beggar Women), పరాజితులు
(The Departed), ఆః నిజంగానే(Good News),, నీడలు ఇలాంటి కవితలకు చేసిన ఆంగ్ల అనువాదం చాలా బాగా వచ్చాయిTone, mood, syntax అంతా కూడా మూల కవితకు చాలా దగ్గరగా వున్నాయి. నేరుగా ఆంగ్ల కవిత చదివినా గానీ, తెలుగు కవిత చదివినా గానీ అదే రకమైన పఠనానుభవం ఇస్తుంది.
ఖడ్గసష్టి లాంటి కవితలో ఆంగ్లానువాదం కొన్ని కవిత్వ పేరాలు పైకీ కిందకీ మారాయి. శరచ్చంద్రిక కవితలో ఆంగ్లానువాదం తెలుగు పాద/ పద్య విభజన పాటించలేదు. కొన్ని కవితలలో తెలుగు పదాలకి సరితూగే ఆంగ్ల పదాలు వాడలేదు. ఉదాహరణకు ‘బహుళ పంచమి జోత్స్న’ అనే పద బంధానికి Moonlight అనే ఆంగ్ల పదంతో సరిపెట్టడం కనిపిస్తుంది.
శ్రీశ్రీ ఆంగ్లం నుండి తెలుగు అనువాదం చేసేప్పుడు మాత్రం మరలా ఆయనలో శైలీవిన్యాసం, పద తీవ్రత, శబ్దలయ అన్నీ వచ్చి చేరతాయి. దీనికి మనం ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. మయకోవ్‌స్కీ రాసిన ‘లెనిన్’ కావ్యం శ్రీశ్రీ అదే భావతీవ్రతతో, శబ్దసౌందర్యంతో తెనిగించాడు.
మొత్తంగా చూసినప్పుడు శ్రీశ్రీ కి తెలుగు, ఆంగ్ల పదాల మీద వున్న పట్టు తెలిసి వస్తుంది. ఆంగ్ల కవితను నిర్వహించడం ఆయనికి పాశ్చాత్య సాహిత్య అధ్యయనం వల్లనే సాధ్యమయిందనేది నిర్వివాదాంశం.
అనువాదం మీద అభిరుచి, అధ్యయనం మీద ఆసక్తి, తులనాత్మక సాహిత్యం ఆకళింపు వున్నవాళ్ళు తప్పక చదవవలసిన పుస్తకం శ్రీశ్రీ ‘ ఆంగ్లీకవనం.’
ఈ కష్టతరమైన పనిని ఎంతో ఇష్టంతో చేస్తున్న శ్రీశ్రీ సాహిత్యనిధి అశోక్ కుమార్ గారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఈ విషయంగా తెలుగు సాహిత్య లోకం ఆయనకు ఋణపడి వుంటుంది.
పి. శ్రీనివాస్ గౌడ్,
99494 29449