
– అక్రమాలకు చెక్ పెట్టేలా చర్యలు
నవతెలంగాణ – మల్హర్ రావు
అంగన్ వాడి కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పౌష్టికాహారం సరఫరా విషయంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది.ఆయా కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు,చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందడం లేదన్న ఆరోపణలున్నాయి.ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు సర్కారు నడుం బిగించింది.ప్రతి కేంద్రంలో బయోమెట్రిక్, సిసి కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.మండలంలో మొత్తం 32 అంగన్ వాడిలు,ఒక మినీ అంగన్ వాడి కేంద్రం ఉంది.
అక్రమాలకు కళ్లెం: బయోమెట్రిక్ ఏర్పాటు ద్వారా అంగన్ వాడి కేంద్రాలకు ప్రభుత్వం నెలనెలా సరఫరా చేస్తున్న సరుకులు పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు అందే అవకాశం ఉంటుంది.చిన్నారులు,గర్భిణీలు,బాలింతలకు ప్రభుత్వం ఈ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేస్తోంది.అయితే చాలాచోట్ల పౌష్టికాహారం లబ్ధిదారులకు అందకుండా పక్కదారి పడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి.ఈ క్రమంలో వీటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
బయోమెట్రిక్, సీసీ కెమెరాలు
అంగన్ వాడి కేంద్రాల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా అభివృద్ధి శిశుసంక్షేమ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశించారు.ఆయా కేంద్రాల్లో పోషకాహారం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని పేర్కొన్నారు.
పక్కాగా అమలు చేయాలి..డాక్టర్ లుబన్న సర్వత….సామాజిక కార్యకర్త: గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు,బాలింతలు,గర్భిణీలకు సరైన పోషకాహారం అందడం లేదు.ఈ నేపధ్యంలో సీఎం ఆదేశాలను అధికారులు పక్కగా అమలు చేయాలి.లబ్ధిదారులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టాలి.
ప్రభుత్వ నిర్ణయం స్వాగతిస్తున్నాం..అక్కల బాపు యాదవ్ ప్రజా సంఘాల నాయకుడు: అంగన్ వాడి కేంద్రాల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగుంది.ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.దీంతో పోషకాహారం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.