ఇజ్రాయిల్‌తో ఇస్లామిక్‌ దేశాల యుద్ధం అనివార్యమా?

హ్‌నెల్లూరు నరసింహారావు
లెబనీస్‌ షియా గ్రూప్‌ హిజ్బుల్లా నాయకుడు హసన్‌ నస్రుల్లా హత్య మధ్యప్రాచ్యంలో తీవ్రస్థాయి సైనిక సంఘర్షణ ప్రమాదాన్ని గణనీయంగా పెంచింది. ఇది ఈ ప్రాంతానికే కాకుండా యావత్‌ ప్రపంచానికి కూడా వినాశకరమైనది. ఇప్పటికే క్లిష్ట స్థాయికి చేరుకున్న ఉద్రిక్తతలు ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా చెలరేగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది లెబనాన్‌, ఇజ్రాయిల్‌ లను మాత్రమే కాకుండా ఇరాన్‌, టర్కీ వంటి ఇతర ప్రాంతీయ శక్తులను కూడా ప్రభావితం చేస్తుంది. హిజ్బుల్లా ఈ ప్రాంతంలో ఇరాన్‌ మద్దతుతో ఒక బలమైన సైనిక, రాజకీయ శక్తిగా ఉంది. అంటే హిజ్బుల్లాపైన ఇజ్రాయిల్‌ దాడి అంటూ చేయటం జరిగితే అది ఇరాన్‌ పైన దాడి చేసినట్టే అవుతుంది.
నస్రుల్లా హత్యతో ప్రతీకార దాడులు, ఉన్నత స్థాయి సైనిక కార్యకలాపాలు పెరిగాయి. ఇది ఈ ప్రాంతంలో పరిస్థితిని మరింత అస్థిరపరుస్తుంది. ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ భద్రతకు ముప్పును కలిగిస్తుంది. టెహ్రాన్‌లో ఇటీవల జరిగిన ఇస్మాయిల్‌ హనియెహ్‌, బీరూట్‌లో హిజ్బుల్లా వ్యవస్థాపకులలో ఒకరైన ఫువాద్‌ షుక్ర్‌ల హత్యలను పరిశీలిస్తే వీటి వెనుక ఇజ్రాయిల్‌ ప్రత్యక్ష ప్రమేయం ఉందనేది సుస్పష్టం. అయితే, హిజ్బుల్లా నాయకుడి మరణం నిజంగా ఊహించనిది కాదు. ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ అనేక ఏండ్లుగా నస్రుల్లా కోసం వేటాడుతోంది. అక్టోబర్‌ 7 నాటి విషాద సంఘటనలు జరగకపోయినా, ఇజ్రాయిల్‌ ఏజెన్సీలు తమ జాతీయ భద్రతకు ముప్పుగా భావించిన వ్యక్తిని అడ్డు తొలిగించేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తాయి. నస్రుల్లా చాలా ఏండ్లుగా బహిరంగంగా కనిపించలేదు. నిరంతరం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతుండేవాడు. అతని ప్రాణానికి ముప్పు ఉందని అతనికి స్పష్టంగా తెలుసు. అయితే, అతని మరణం ఒక శకం ముగింపుకు సూచికగా నిలిచేలా వుంది.
హసన్‌ నస్రుల్లా ఎవరు?
నస్రుల్లా అనేక విధాలుగా ఒక సమస్యాత్మక వ్యక్తి. అంకితమైన షియా. అతను అమల్‌ ఉద్యమంలో చేరాడు. ఈ ఉద్యమం 1975లో లెబనీస్‌ అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అతను లెబనాన్‌కు తిరిగి రావడానికి ముందు పవిత్ర ఇరాకీ నగరమైన నజాఫ్‌లోని షియా సెమినరీలో చదువుకున్నాడు. అక్కడ అతను తిరిగి అమల్‌ ఉద్యమంలో చేరాడు. 1982లో ఇజ్రాయిల్‌ లెబనాన్‌పై దాడి చేసిన కొద్దికాలానికే నస్రుల్లా, అతని మిత్రులు అమల్‌ నుంచి విడిపోయి ఇస్లామిక్‌ అమల్‌ అనే కొత్త సైనిక ఉద్యమాన్ని ప్రారంభించారు. వారు ఇరాన్‌లో కొత్తగా స్థాపించిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్జీసీ) నుంచి గణనీయమైన సైనిక, సంస్థాగత మద్దతును పొందారు. అలా ఇరాన్‌ మద్దతు ఈ లెబనీస్‌ ఉద్యమం ప్రముఖ షియా శక్తిగా మారడానికి సహాయపడింది. చివరికి, ఈ సమూహం హిజ్బుల్లాగా పరిణామం చెందింది.
1992లో నస్రల్లా తన పూర్వీకుడు, హిజ్బుల్లా సెక్రటరీ-జనరల్‌ అబ్బాస్‌ అల్‌-ముసావి హత్య తర్వాత హిజ్బుల్లా నాయకుడయ్యాడు. ఆ సమయంలో నస్రల్లా వయసు కేవలం 32 ఏండ్లు. ప్రాథమికంగా లెబనాన్‌లో ఇజ్రాయిల్‌ దళాలను ప్రతిఘటించడం లక్ష్యంగా పెట్టుకున్న చిన్న ఉద్యమం అతని నాయకత్వంలో లెబనీస్‌ సైన్యాన్ని అధిగమించే సైనిక శక్తిగా పరిణామం చెందింది. 2000లో హిజ్బుల్లాహ్‌ ఇజ్రాయిల్‌పై ”చిన్న యుద్ధం”గా ప్రారంభమై, దక్షిణ లెబనాన్‌ నుంచి ఇజ్రాయిల్‌ దళాల ఉపసంహరణతో ముగిసింది. ఇజ్రాయిల్‌ సైనికులతో జరిగిన పోరాటంలో నస్రుల్లా తన పెద్ద కుమారుడు హదీని కోల్పోయినప్పటికీ, హిజ్బుల్లా ఇజ్రాయిల్‌పై మొదటి విజయాన్ని సాధించినట్టు ప్రకటించాడు. ”లెబనాన్‌ మొత్తం భూభాగాన్ని విముక్తి చేయాలి” అని పట్టుబట్టి, ఉద్యమం ఎప్పటికీ ఆయుధాలను వదిలిపెట్టదని అతను స్పష్టం చేశాడు. నస్రుల్లా ఆధ్వర్యంలో, హిజ్బుల్లా తన స్వంత సామాజిక కార్యక్రమాలు, కేంద్రాలు, వైద్య సదుపాయాలను స్థాపించిన ప్రధాన రాజకీయ శక్తిగా కూడా మారింది. ఇరాన్‌ తన ప్రాంతీయ ప్రభావాన్ని విస్తరించే వ్యూహంలో ఇది కీలకమైన సాధనంగా మారింది. ఇరాక్‌, యెమెన్‌లోని హమాస్‌ యోధులు, షియా తిరుగుబాటుదారులకు హిజ్బుల్లా కమాండర్లు శిక్షణ ఇచ్చారు. ఇజ్రాయిల్‌ను ప్రతిఘటించడానికి కావలసిన క్షిపణులు, ఆయుధాలు హిజ్బుల్లాకు నిరంతరంగా అందుతూనే ఉన్నాయి. తత్ఫలితంగా హిజ్బుల్లా ఉద్యమం ఇజ్రాయిల్‌కు సవాలుగా మారింది. దీనితో ఇజ్రాయిల్‌ హిజ్జుల్లాను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసింది.
గత అక్టోబర్‌లో ఇజ్రాయిల్‌పై హమాస్‌ చేసిన దాడిలో హిజ్బుల్లా, దాని నాయకుడు హసన్‌ నస్రుల్లా ప్రమేయం లేదు. వాస్తవానికి, ఇజ్రాయిల్‌ అధికారులు కూడా హిజ్బుల్లా లేదా ఇరాన్‌ దాడికి సంబంధం ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవని గుర్తించారు. ఆగస్టులో ఐఆర్జీసీ నాయకులు టెహ్రాన్‌లో హిజ్బుల్లా నాయకులతో అనేక సమావేశాలు నిర్వహించారని, ఇజ్రాయిల్‌ను రెచ్చగొట్టవద్దని ఇరాన్‌ నాయకత్వం వారిని కోరారని అనేక మీడియా నివేదికలు తెలియజేశాయి. టెహ్రాన్‌లో హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో చైర్మెన్‌ ఇస్మాయిల్‌ హనియెహ్‌ హత్య నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. ఇది దేశ సార్వభౌమాధికారం, భద్రతకు ప్రత్యక్ష అవమానంలాగా కనిపిస్తున్నందున, ఈ ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు ఇరాన్‌ ప్రతిస్పందిస్తుందని ఆశించాయి.
ఇరాన్‌ మొన్నటిదాకా ఎందుకు మౌనంగా ఉంది?
నిజానికి, ఇటీవలి వారాల్లో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ సుప్రీం లీడర్‌, అయతుల్లా అలీ ఖమేనీ, ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌, వివిధ ఇరాన్‌ రాజకీయ, సైనిక ప్రముఖు లతో పాటు, లెబనాన్‌లో పేజర్లు, ఇతర పరికరాల భారీ పేలుళ్ల తర్వాత ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా బలమైన ప్రకటనలు చేశారు. ఈ దాడిలో హిజ్బుల్లా మిలిటెంట్లే కాకుండా డజన్ల కొద్దీ అమాయక పౌరులు కూడా ప్రాణాలను కోల్పోయారు. ఈ ప్రాంతంలో ఇరాన్‌ కీలక మద్దతుదారైన హిజ్బుల్లాను పూర్తిగా నిర్మూలించడానికి పూర్తి స్థాయి సైనిక చర్యను ప్రారంభించిన వాస్తవాన్ని ఇజ్రాయిల్‌ దాచలేదు. ఇజ్రాయిల్‌ ‘అన్ని పరిమితులను’ దాటిందని తన చివరి బహిరంగ ప్రసంగంలో నస్రుల్లా ఆరోపించాడు. సెప్టెంబరు 27, శుక్రవారం సాయంత్రం నస్రుల్లా మరణం గురించి మొదటి నివేదికలు వెలువడ్డాయి. ఆ రోజు బీరూట్‌కు దక్షిణంగా ఉన్న దహీహ్‌ శివారులోని హరత్‌ హ్రీక్‌ మునిసిపాలిటీలో హిజ్బుల్లా కేంద్ర ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయిలీ సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది. ఇది అనేక టన్నుల ఆయుధాలను జారవిడిచింది. ఈ దాడిలో నస్రుల్లాతో పాటు ఇతర ఉన్నత స్థాయి కమాండర్లు చనిపోయారు. అయితే, ఇరాన్‌ ఎందుకు మౌనంగా ఉంది అనేదానికి ప్రధాన కారణం ఇది తన సమయాన్ని వెచ్చించి, సరైన సమయంలో ఊహించని విధంగా దాడి చేయడానికి సిద్ధమవుతోందని మొన్న ఇరాన్‌ ఇజ్రాయిల్‌పై చేసిన దాడి తేటతెల్లం చేసింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఇరాన్‌ పెద్ద యుద్ధంలోకి లాగబడుతుందని పేర్కొన్నాడు. అమెరికా మద్దతుతో ఇరాన్‌, హిజ్బుల్లాలను రెచ్చగొట్టడానికి ఇజ్రాయిల్‌ ప్రయత్నిస్తోందని, మధ్యప్రాచ్యంలో ప్రక్రియలపై వాషింగ్టన్‌ తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటోందని కూడా అతను పేర్కొన్నాడు.
ఇంతలో ఇజ్రాయిల్‌ బాంబుదాడులు, లెబనాన్‌పై దండయాత్ర కొనసాగుతోంది. బుధవారం కనీసం ఐదు ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు బీరుట్‌ దక్షిణ శివారు ప్రాంతాలపై జరిగాయి. 2006లో లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ చేసిన దాడిలో మరణించిన 1,200 మందితో పోలిస్తే, గత 12 నెలల్లో లెబనాన్‌లో ఇజ్రాయిల్‌ చేత చంపబడిన వారి సంఖ్య 2,000కు చేరువైంది. లెబనాన్‌ పైన దండయాత్రను ప్రారంభించిన ఒక రోజు తర్వాత ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ దాదాపు 200 క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడి ఇరాన్‌ ప్రభుత్వానికి అధికారిక అతిథిగా వచ్చిన టెహ్రాన్‌లోని హమాస్‌ రాజకీయ కార్యాలయ అధిపతిని హత్య చేయడంతో పాటు హిజ్బుల్లా సెక్రెటరీ జనరల్‌ హత్యకు ప్రతిస్పందనగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
ఇరాన్‌ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్‌ మిలిటరీ ఘర్షణను తీవ్రతరం చేసే మార్గాన్ని ఎంచుకుని, ఇరాన్‌ను ఒక పెద్ద యుద్ధంలోకి లాగితే మధ్యప్రాచ్చంలో జరగనున్న పరిణామాలు నిస్సందేహంగా యావత్‌ ప్రపంచానికి విపత్కరంగా మారతాయి. యుద్ధం అనివార్యమైనప్పుడు సిరియా, ఇరాక్‌, గల్ఫ్‌ దేశాలతో సహా అనేక ఇస్లామిక్‌ దేశాలు అమెరికా మద్దతిస్తున్న ఇజ్రాయిల్‌తో తలపడతాయి. నాటో సభ్యదేశమైన టర్కీ, పాకిస్తాన్‌లు కూడా తటస్థంగా ఉండజాలవు. ప్రపంచ ఇంధన మార్కెట్‌లో సంక్షోభం ఏర్పడుతుంది. కీలకమైన సముద్ర మార్గాల భద్రత ప్రమాదంలో పడుతుంది. ఈ పరిస్థితి ఇంధన ధరలు అపరిమితంగా పెరగటానికి, పర్యవసానంగా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత ఏర్పడటానికి దారి తీస్తుంది.