కార్మికుల సంక్షేమం గాలిలో దీపమేనా?

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం రోజురోజుకూ గాలిలో దీపంగానే మారుతోంది. ఈ రంగంలో తాపి, మట్టి, సెంట్రింగ్‌, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌, రాడ్‌ బైండింగ్‌, పెయింటర్‌, టైల్స్‌ ఇలా సుమారు 20లక్షల మంది కార్మికులుగా పనిచేస్తున్నట్టు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. కానీ వారి జీవన భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు శూన్యం. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేసి ఆయా పనుల్లోని కార్మికులకు సంక్షేమ బోర్డు పేరుతో గుర్తింపు కార్డులనందించింది. మంచిదే కానీ… ఇది పేరుకు మాత్రమేనని స్పష్టమవుతున్నది. సహజ, ప్రమాదవశాత్తు మరణించిన, గాయపడిన కార్మికుకుల కుటుంబాలు వీధిన పడే పరిస్థితులు నెలకొన్నాయి. సహాయం కోసం ధరఖాస్తు అందజేసిన కొన్ని రోజుల్లో భాధిత లబ్దిదారులకు సత్వరమే ఆయా పథకల ప్రయోజనాలందించాల్సి ఉండగా ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. సాయం కోసం సంవత్సరాల కొద్ది ఎదురుచూస్తుండటంతో ఆయా కుటుంబాలు దుర్భర పరిస్థితుల్లో జీవనాన్ని సాగిస్తున్నాయి. గతిలేని పరిస్థితుల్లో ఇతరుల వద్ద అప్పులు తెచ్చి, కాలం వెళ్లదీస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి అందించే సహాయం వడ్డీలకే సరిపోవడం లేదు. కొంతమంది కార్మికులు అవగాహన లేమితో కార్మికులుగా తమ పేర్లను సంక్షేమ బోర్డులో నమోదు చేసుకోలేదు. వారు పని చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గాయపడినా ఆర్థిక సహాయం గురించి తెలియకపోవడంతో నష్టపోతున్నారు. ఇవన్నీ కార్మిక శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని వారికి అవగాహన కల్పించాల్సినవే. ఇవే కాదు రాష్ట్రంలోని ప్రతి జిల్లా, పట్టణాల్లోని లేబర్‌ అడ్డాల్లో కార్మికుల సౌకర్యార్థం ప్రభుత్వం మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఎండా, వానల నుండి రక్షించుకునేందుకు షెడ్డులను నిర్మించాలి. అలాగే కార్మికుల రవాణా సౌకర్యార్థం మోటార్‌ సైకిళ్లతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, కర్నాటక, మహరాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలోనూ అమలు చేయాలి. కార్మికులకు ప్రత్యేకంగా ఆర్థిక సహాయార్ధం రుణాలందించాలి. ప్రతియేటా సంక్షేమ బోర్డు నుండి అర్హులైన వారికి ఆయా వృత్తుల పనిముట్లను సబ్సిడితో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. అప్పుడే కార్మిక కుటుంబాలు ఎంతోకొంతైనా బాగుపడతాయి.
-ఈదునూరి మహేష్‌,
సెల్‌:9949134467