పసుపుబోర్డు ఒడిసిన ముచ్చటేనా?

– పసుపు బోర్డుపై కేంద్రం యూటర్న్‌
– మాటతప్పిన బీజేపీ ఎంపీ.. మోసపోయిన రైతులు
– ఎన్నికలకు ముందు 5 రోజుల్లో బోర్డు అంటూ ప్రచారం
– ఉత్తుత్తిగానే బాండ్‌ పేపర్‌.. దాని ఊసే ఎత్తని కాషాయ నేతలు
– మసాలా దినుసుల కార్యాలయం ఏర్పాటుతో మమ
నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తామంటూ బీజేపీ జాతీయ నేతలు నమ్మబలికారు. అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు కేంద్రం నేతలు ఇచ్చిన ఈ వాగ్ధానం అటకెక్కింది. పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి రైతుల ఉద్యమానికి నేతృత్వం వహిస్తానన్న ఎంపీ అరవింద్‌ బాండ్‌ పేపర్‌ కూడా రాసిచ్చారు. అది కూడా ఉత్త మాటే అయింది. బోర్డు పేరుతో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందింది బీజేపీ. ఆ తరువాత బోర్డు హామీనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొందపెట్టింది. నిజామాబాద్‌లో మసాలా దినుసుల కార్యాలయం ఏర్పాటు చేసి మమ అనిపించింది. పసుపు బోర్డుతోనే ఆర్మూర్‌ రైతుల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఎంపీ అరవింద్‌.. గెలిచిన తరువాత బోర్డు ఒడిసిన ముచ్చటేనని తేల్చేశారు.
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్‌ జిల్లా పసుపు పంటకు పెరెన్నికగన్నది. దేశంలో ఉత్పత్తి అయ్యే పంటలో ఒక ప్రధాన భాగం జిల్లా నుంచి ఉన్నది. మార్కెట్‌ సౌకర్యం లేక ప్రతియేటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో పసుపు బోర్డు డిమాండ్‌ దశాబ్దాల నుంచి ఉన్నది. 2019 లోక్‌సభ సమయంలోనూ పసుపు రైతులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆ ఎజెండాతోనే ఎన్నికల్లో 170 మందికి పైగా రైతులు ఎన్నికల్లో నిల్చున్నారు. ఆ సమయం లో బోర్డు డిమాండ్‌ను బీజేపీ తనకు అనుకూలంగా మలుచు కుంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్‌ తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తా మని పలు సభల్లో హామీనిచ్చారు. ఒక వేళ బోర్డు ఏర్పాటు చేయక పోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఏకంగా బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు. ఆర్మూర్‌, బాల్కొండ, జగిత్యాల తదితర అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రధాన చౌరస్తాల్లో బాండ్‌ పేపర్‌ ప్రతులను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అప్పటి కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సైతం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. అప్పటికే కేంద్రంలో బీజేపీ సర్కారు ఉండటంతో.. బోర్డు ఏర్పాటు సాధ్యమవుతుందని ఇక్కడి రైతాంగం నమ్మి గత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అరవింద్‌ను గెలిపించారు. అప్పటి ఎంపీ, కేసీఆర్‌ కుమార్తె కవితపై అరవింద్‌ 70,875 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
రైతుల ఆశలు అడియాసలు
అరవింద్‌ గెలిచిన తర్వాత బోర్డుపై రైతాంగం పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. మొదట దాటవేస్తూ వచ్చిన ఎంపీ.. ఆ తరువాత బోర్డుకు మించింది తీసుకొస్తామంటూ చెప్పుకొచ్చారు. ఆ తరువాత పసుపు దిగుబడి పెంచేందుకు చర్యలు తీసుకోబో తున్నట్టు చెప్పారు. చివరాకరకు పసుపు బోర్డు స్థానంలో ‘స్పైసెస్‌ బోర్డ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసు’ను ఏర్పాటు చేశారు. గతంలో ఈ కార్యాలయం వరంగల్‌లో ఉండగా.. దాన్ని నిజామాబాద్‌కు తరలించి మమ అనిపించారు. ఈ కార్యాలయంతో పసుపు రైతులకు ఏం ప్రయోజనం లేదు.
బీజేపీ ఎంపీపై ఆగ్రహం
ప్రత్యేక పసుపు బోర్డు ఉంటే.. పసుపు దిగుబడికి అవసరమైన చర్యలు తీసు కోవడం, నూతన వంగడాలు సృష్టించ డంతో పాటు పండిన పంటకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేం దుకు ప్రత్యేకంగా చర్యలు తీసు కుంటుందని రైతులు భావిం చారు. అదేదీ జరగలేదు. పసుపు రైతులు ఎంపీ అరవింద్‌పై, బీజేపీపైనా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మోసపోయామని ఆగ్రహం తో ఉన్నారు. బీజేపీ నేతలు, ఎంపీ అరవింద్‌ను రైతులు నిల దీస్తున్నారు.