ముహూర్తం కుదిరేనా

ముహూర్తం కుదిరేనా– ఆదిభట్లలో కాంగ్రెస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌
– ఇబ్రహీంపట్నంలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌
– రెండు మున్సిపాలిటీలో అవిశ్వాసం నోటీసులు
– ఇబ్రహీంపట్నంలో ఎస్సీ జనరల్‌(మహిళ), ఆదిభట్లలో జనరల్‌ (బీసీ మహిళ)
– ఆదిభట్ల కుర్చీపై జనరల్‌ అభ్యర్థి కన్ను
– ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకొని జిల్లా కలెక్టర్‌
– క్యాంపులకు చేరిన కౌన్సిలర్లు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలో ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై జిల్లా కలెక్టర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అవిశ్వాసానికి ముహూర్తం ఖరారు కాలేదు. ఇబ్రహీంపట్నంలో చైర్‌ పర్సన్‌పై బీజేపీ, బీఆర్‌ఎస్‌ సభ్యులు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఆదిభట్లలో కాంగ్రెస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ అన్నట్లుగా కొనసాగుతోంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సభ్యులందరూ కలిసి చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌పై అవిశ్వాస నోటీసులు అందజేశారు. ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన చైర్మన్‌ కొత్త ఆర్థిక, వైస్‌ చైర్‌ పర్సన్‌గా కోరె కళమ్మ కొనసాగుతున్నారు. వీరిని దింపి చైర్మన్‌గా ఓసీ కౌన్సిలర్‌, వైస్‌ చైర్మన్‌గా ఎస్సీ కౌన్సిలర్‌ కావాలని తహతహలాడుతున్నారు. కుర్చీలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇబ్రహీంపట్నంలో ఎస్సీ జనరల్‌ కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందినవారే చైర్మన్‌ అవనున్నారు. ఇక్కడ ఇప్పటికే అవిశ్వాస నోటీసు అందజేసిన కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టినట్టు తెలుస్తోంది. ఈ రెండు స్థానాలపై జిల్లా కలెక్టర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కౌన్సిలర్ల నిర్ణయ మేరకు అవిశ్వాసం జరిగేనా? లేక వాయిదా పడుతుందా అనేది తేలాల్సి ఉంది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాలుగు మున్సిపాలిటీల్లో తుర్కయాంజాల్‌ మినహా ఆదిభట్ల, పెద్ద అంబర్‌పేట, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలను అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కైవలం చేసుకుంది. ఆదిభట్ల, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో మెజార్టీ సభ్యులు లేకపోయినా ఎక్స్‌ ఆఫిషియో సభ్యులతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మెజార్టీ సభ్యులను గెలుచుకొని ఆ పార్టీ నుంచే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలను దక్కించుకుంది. ఇక రాజకీయ పరిణామాల రిత్యా మున్సిపాలిటీల్లో చైర్మన్లు పార్టీ ఫిరాయింపులు పాల్పడ్డారు. రెండేళ్ల క్రితమే ఆదిభట్ల చైర్‌పర్సన్‌ కాంగ్రెస్‌లో చేరగా, శాసనసభ ఎన్నికలకు ముందు ఇబ్రహీంపట్నం చైర్‌ పర్సన్‌ సైతం కాంగ్రెస్‌ గూటికి చేరారు. ప్రధానంగా ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన చైర్‌పర్సన్లను దింపేయడానికి అన్ని పార్టీలు ఒక్కటే అయ్యాయి.
కాంగ్రెస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌
బీఆర్‌ఎస్‌ మద్దతుతో ఆదిభట్ల చైర్‌ పర్సన్‌గా ఎన్నికైన కొత్త ఆర్థికగౌడ్‌ కొన్నాళ్లకే ఆ పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పోసగాక స్థబ్ధుగా ఉంటూ వచ్చారు. చివరకు రెండేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌ చేరారు. దాంతో ఆ పార్టీకి ఆ మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు న్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు సైతం చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి మొగ్గు చూపారు. వారికి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతో పాటు బీజేపీ కౌన్సిలర్లు తోడయ్యారు. చివరకు బీఆర్‌ఎస్‌ వైస్‌ చైర్మన్‌పై సైతం దింపేసేందుకు అన్ని పార్టీలు ఒక్కటయ్యారు. ఇక్కడ జనరల్‌ స్థానం అయిన్పటికీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. కాగా, అవిశ్వాసం తరువాత ఓసీ కౌన్సిలర్‌ చైర్మన్‌ కావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ కౌన్సిలర్‌ సైతం పట్టుబడుతున్నారు. అయితే బీసీ కౌన్సిలర్‌ను నలుగురు మాత్రం అంగీకరించడం లేదన్న ప్రచారం సాగుతోంది. కానీ ఓసీ కౌన్సిలర్‌కు మాత్రం ఎస్సీ, బీసీ కౌన్సిలర్లు మాత్రం మద్దతు ఇవ్వాలని పట్టుబడుతున్నారని వినికిడి. బీసీని దింపేసి, ఓసీని అంగీకరించబోమని, బీసీకే అవకాశం ఇస్తామని మెజార్టీ సభ్యులు తేల్చిచెప్పినట్లు తెలుస్తుంది.
అందరూ ఒక్కటయ్యారు..
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్‌ పర్సన్‌ కప్పరి స్రవంతికి వ్యతిరేకంగా అందరూ ఒక్కటయ్యారు. ఇక్కడ మొత్తం 24 మంది కౌన్సిలర్లున్నారు. వీరిలో బీఆర్‌ఎస్‌ 16, బీజేపీ రెండు, కాంగ్రెస్‌ ఆరు స్థానాల్లో విజయం సాధించారు. పూర్తి మెజార్టీ ఉన్న బీఆర్‌ఎస్‌ చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్లను కైవసం చేసుకుంది. ముగ్గురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌లో చేరగా, ఎన్నికలకు ముందు చైర్‌ పర్సన్‌తో పాటూ మరో ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలోమాజీ ఎమ్మెల్యేపై చైర్‌ పర్సన్‌ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దాంతో రాజకీయం మరింత వేడెక్కింది. బీజేపీ 2, బీఆర్‌ఎస్‌ 15 మంది కౌన్సిలర్లు కలుపుకుని చైర్‌ పర్సన్‌ కప్పరి స్రవంతిపై ఆవిశ్వాస నోటీసు ఇచ్చారు. వీరంతా ప్రస్తుతం క్యాంపునకు చేరినట్లు సమాచారం. ఇక రెండు మున్సిపాలిటీలపై జిల్లా కలెక్టర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది.