– బీఆర్‌ఎస్‌పై చనగాని దయాకర్ ఫైర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పదేండ్లు అధికారంలో ఉండి ఒక్కరోజైన గురుకులాలను సందర్శించారా? వారి సమస్యల పరిష్కారం ఎప్పుడైనా ఆలోచించారా? అని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గురుకులాలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రక్షాళన కోసం ఎన్నో సంస్కరణలు చేపడుతుంటే, బీఆర్‌ఎస్ నేతలు తట్టుకోలేక రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గురుకుల విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ ఛార్జీలు పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సీఎం రేవంత్‌రెడ్డిని ఎంతో కొనియాడుతున్నారని గుర్తు చేశారు. దాన్ని బీఆర్‌ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. ఆరు లక్షల మంది విద్యార్థుల బంగారు భవిషత్తు కోసం తమ ప్రభుత్వం బాటలు వేస్తున్నదని చెప్పారు. విద్యా, ఉద్యోగ అవకాశాలు పెంపుదల కోసం నిరంతరం పరితపిస్తున్నదని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో 36 మంది గురుకుల విద్యార్థులు పాముకాట్లకు గురై మరణించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో జేజేలు కొట్టించుకునేందుకు తాపత్రాయ పడుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం నాణ్యామైన భోజనం పెట్టేందుకు కృషి చేస్తున్నదని చెప్పారు. పేద బిడ్డలపై బీఆర్‌ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వంపై అవాక్కులు, చవాకులు పేలితే తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు.