– ఏడాదికి రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వాలి
– మహిళా సంఘాల ద్వారా కుట్టించేందుకు కార్యాచరణ
– మండలాలకు యూనిఫామ్ వస్త్రం
– కొన్ని చోట్ల ముందుకు రాని మహిళా సంఘాలు
– జూన్ రెండో వారంలో పంపిణీకి చర్యలు: డీఈఓ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. అప్పటి వరకు విద్యార్థులకు ఇవ్వాల్సిన ఏకరూప దుస్తులు రెడీ అయ్యేనా..? ఏటా యూనిఫామ్స్ కుట్టించే విషయంలో ఆలస్యం జరుగుతూ వస్తోంది. కొత్త ప్రభుత్వంలోనైనా సమయానికి విద్యార్థులకు యూనిఫామ్స్ అందేలా చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులకు కావాల్సిన దుస్తుల్ని మహిళా సంఘాల ద్వారా కుట్టించేందుకు విద్యా శాఖ డీఆర్‌డీఏ ద్వారా కార్యాచరణ రూపొందించింది. కొన్ని చోట్ల దుస్తులు కుట్టేందుకు కూలి రేట్లు గిట్టుబాటు కావట్లేదని మహిళా సంఘాలు ముందుకు రాని పరిస్థితీ. దుస్తులు కుట్టిన వెంటనే డబ్బుల్ని సకాలంలో చెల్లించకపోవడం వల్ల కూడా మహిళలు ఆసక్తి చూపట్లేదంటున్నారు. దుస్తులకు కావాల్సిన వస్త్రం సరఫరాలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు అందజేయాలి. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ దుస్తులు సిద్ధం చేసి పాఠశాల పున:ప్రారంభం కాగానే పంపిణీ చేయాలి. లక్షలాది మంది విద్యార్థులకు దుస్తులు కుట్టించి పంపిణీ చేసే విషయంలో విద్యా శాఖ ఏటా ఆలస్యం చేస్తూ వస్తోంది. కనీసం ఈ సారైనా సకాలంలో పంపిణీ చేస్తుందో లేదో చూడాలి. రాష్ట్రంలో 41,337 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో 60.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 391 కస్తూర్బాగాంధీ పాఠశాలలు, 194 మోడల్ స్కూల్స్, 916 గురుకులాలున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 3277 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో గతేడాది 3.20 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాల్లో ఉత్తీర్ణత శాతం పెరగడం, విద్యా ప్రమాణాలు మెరుగుపడటం కోసం అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ‘మన ఊరు-మన బడి’ కింద 12 రకాల మౌలిక సదుపాయాల్ని కల్పించడం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. దాంతో ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాల్లో నో అడ్మిషన్స్ అనే బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అందించాల్సిన యూనిఫామ్స్ కుట్టించే పనిలో వేగం పెంచాల్సిన అవసరముంది.
మహిళా సంఘాల ద్వారా దుస్తులు కుట్టేందుకు కార్యాచరణ
విద్యార్థులకు కావాల్సిన ఏకరూప దుస్తుల్ని కుట్టించే పనిని స్థానిక స్వయం సహాయ మహిళా సంఘాలకు అప్పజెప్పేందుకు విద్యా శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సమన్యయంతో కార్యాచరణ రూపొందించాయి. ఆయా మండలాల్లో ఎంపీడీఓ, ఎంఈఓ, డీఆర్‌డీఏ, డీపీఎం, ఏపీఎం, మెప్మా నుంచి ఒకరు చొప్పున కమిటీ వేశారు. ఈకమిటీ సమన్యయంతో విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టించి పంపిణీ అయ్యేలా చూడాలి. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా యూనిఫామ్స్‌కు సంబంధించిన వస్త్రం మండలాలకు చేరింది. ఆయా పాఠశాలల వారిగా డీఆర్‌డీఏ ద్వారా పట్టణాల్లో మెప్మా ద్వారా స్థానిక స్వయం సహాయ సంఘాలతో దుస్తుల్ని కుట్టించాలి. మూడు జిల్లాల్లో కలిపి 3277 ప్రభుత్వ పాఠశాలల్లో 3.20 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి రెండు జతల చొప్పున దుస్తుల్ని పంపిణీ చేయాలి. వీటిని కుట్టించేందుకు అవసరమైన వస్త్రాలను రాష్ట్ర చేనేత శాఖ ద్వారా సమీకరించి ఆయా జిల్లా విద్యా శాఖ అధికారులకు అప్పజెప్పారు. సదరు వస్త్రాన్ని డీఆర్‌డీఏ ద్వారా గుర్తించిన మహిళా సంఘాల ద్వారా విద్యార్థుల నుంచి కొలతలు సేకరించి దుస్తుల్ని కుట్టిస్తారు.
చాలా చోట్ల ఆసక్తి చూపని మహిళలు
విద్యార్థులకు సంబంధించిన దుస్తుల్ని కుట్టే విషయంలో కొన్ని చోట్ల మహిళా సంఘాలు ఆసక్తి చూపట్లేదు. ప్రభుత్వం ఇచ్చే కుట్టు కూలి గిట్టుబాటు కావడంలేదని చెబుతున్నారు. ఒక్కో జత దుస్తుల్ని కుట్టినందుకు మహిళలకు రూ.50 మాత్రమే చెల్లిస్తున్నారు. రెండు జతల దుస్తులు కుడితే రూ.100 ఇస్తారు. రోజుకు నాలుగు జతలు కుట్టినా రూ.200 కూలి కూడా గిట్టట్లేదని పలువురు మహిళలు చెబుతున్నారు. విద్యార్థుల నుంచి కొలతలు తీసుకోవడం, దారం, సూది, ధరలు పెరగడం, దుస్తుల కోసం వస్త్రాన్ని కట్ చేయడం, కుట్టడం కోసం కూలీలు పనిచేయాల్సి రావడం, కుట్టు మిషన్స్ నడిస్తే కరెంట్ ఛార్జీల భారం పడటం వంటి కారణాల్ని చెబుతున్నారు. కష్టపడి దుస్తుల్ని కుట్టి ఇస్తే కూలి డబ్బులు విద్యా సంవత్సరం ముగింపులో చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 1045 పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు మాత్రమే దుస్తులు కుట్టేందుకు మహిళా సంఘాలు ముందుకొచ్చారు. మరో 252 పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు కుట్టేందుకు ముందుకు రాలేదు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం దుస్తులు కుట్టిన వెంటనే కూలి డబ్బులు చెల్లించడంతో పాటు కూలి రేట్లను కనీసం రూ.100కు పెంచాలని మహిళలు కోరుతున్నారు. మార్కెట్‌లో ఒక జత బట్టలు కుడితే రూ.500 కూలి ఉంది. యూనిఫామ్స్ అయినందున కనీసం అందులో పావొంతైనా ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రతి ఏటా ఆలస్యమవుతోంది
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్భాగాంధీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టించి పంపిణీ చేయడంలో ప్రతి ఏటా ఆలస్యం చేస్తున్నారు. విద్యా శాఖ పాఠశాలలు ప్రారంభించే సమయంలో హడావుడి చేస్తుంది. దీని వల్ల పాఠశాలల పున:ప్రారంభం నాటికే దుస్తులు అందడంలేదు. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి చదివి విద్యార్థులకు పాఠశాలలు ముగింపు సమయంలోనే కొలతలు తీసుకుని దుస్తుల్ని కుట్టించాలి. యూనిఫామ్ వస్త్రాన్ని తక్కువ పంపడం, టైలర్లకు తక్కువ కూలి ఇవ్వడం వల్ల ఆలస్యమవుతోంది. కొత్త ప్రభుత్వంలోనైనా సకాలంలో యూనిఫామ్స్ అందజేయాలి.
మహేష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సంగారెడ్డి
పాఠశాలల పున:ప్రారంభం వరకు దుస్తులు సిద్ధం
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 1045 పాఠశాలల్లోని విద్యార్థులకు దుస్తులు కుట్టే పని జరుగుతుంది. ఇప్పటికే 50 శాతం దుస్తులు కుట్టారు. మిగతావి ఈ నెలాఖరులోగా పూర్తవుతాయి. మరో 232 స్కూల్స్‌లోనూ మహిళా సంఘాలకు అప్పజెప్పే ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ రెండో వారంలోగా విద్యార్థులకు దుస్తుల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.
వెంకటేశ్వర్లు, జిల్లా విద్యా అధికారి, సంగారెడ్డి