ప్రత్యేక తెలంగాణ సాధనకు జరిగిన ఉద్యమంలో నీళ్లు, నిధులు,నియమకాలే ప్రధాన డిమాండ్లు, ఇందులో నీళ్లు, నిధుల గురించి పక్కనపెడితే గత బీఆర్‌ఎస్ సర్కార్ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడం పట్ల నిర్లక్ష్యం వహించింది. ఉద్యోగాలివ్వకుండా, ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా పేపర్‌లీకులు, పరీక్షల వాయిదాలు, కోర్టు వివాదాలు సష్టించేలా ఉండటంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందో ళన తలెత్తింది. దీంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నిరుద్యోగుల తరపున అప్పటి పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు పాదయాత్రలు చేశారు. వారి అధినాయకుడు రాహుల్‌గాంధీ సైతం హైదరాబాద్‌లో నిరుద్యోగులతో ములాఖత్ అయ్యారు.ఉద్యోగాల కల్పనకై యూత్ డిక్లరేషన్‌ను ప్రవేశపెట్టి ఉద్యోగాలిస్తామని చెప్పడంతో తెలంగాణలోని యాభై లక్షల మంది నిరుద్యోగుల ఓట్లతో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి ఈ ఏడాది కాలంలో నిరుద్యోగుల ఆశలు ఫలించాయా? మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలయ్యాయా? పాదయాత్రలో చేసిన వాగ్దానాలు నెరవేరాయా?పరిశీలించాల్సిన సమయమిది.
కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు యువతకు అనేక హమీలిచ్చింది.బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగాలను కూడా అమ్ముకుంటోందని, పదేండ్లుగా ఎలాంటి ఉద్యోగాలను భర్తీచేయలేదని, తాము అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది. గత ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని సొంత సంస్థగా మార్చుకుందని, తాము దేశంలో యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని తీర్చిదిద్దుతామని తెలిపింది. అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంగా చూస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వక పోగా గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ల ద్వారా 53,310 ఉద్యోగాలను మాత్రం భర్తీ చేసింది. అయితే మిగతా లక్షా యాభై వేల ఉద్యోగాలు సంగతి ప్రస్తావించింది లేదు. అంతే కాకుండా విద్యా, ఉపాధి అవకాశాలకు యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ప్రభుత్వ రాయితీలు పొందుతున్న ప్రయివేటు కంపెనీల్లోనూ తెలంగాణ యువతకు 75శాతం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలిస్తామని పేర్కొంది. సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా ఏడు జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్స్చెంజ్‌లను నెలకొల్పి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీన్చింది. వీటిల్లో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదు. ఇవే కాదు, అన్ని స్థాయిల్లో ఉద్యో గాలు పొందలేని యువతకు ఆర్థిక సహకారానికి రూ.వెయ్యి కోట్లతో రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటుచేసి స్వయం ఉపాధిని ప్రొత్సహిస్తామని చెప్పింది. కానీ ఏడాది గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు.
అమలుకాని జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి
తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వనరులకు కొదవేమిలేదు. వాటిని ఉపయోగించుకుని పరిశ్రమలు ఏర్పాటుచేసి స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. సింగరేణి, కెటిపిఎస్, గ్రానైట్, ప్రూట్స్, లెదర్, పాడి, బయ్యారం ఉక్కు లాంటి స్థానిక పరిశ్రమలను జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేయవచ్చు. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఆపని చేయడం లేదు. గత సర్కార్‌లాగే నిరుద్యోగులకు సంబంధించిన కొన్ని అంశాల్లో మొండిగా వ్యవహరిస్తున్నది.అసలు బిస్వాల్ కమిటీ చెప్పిన ఖాళీ పోస్టుల భర్తీపైన ఫోకస్ చేయకుండా దేశంలో ఒకే ఏడాదిలో 53వేల ఉద్యోగాలిచ్చిన ఘనత తమదేనని ప్రచారం చేసుకుంటోంది. ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో, ఏ నెలలో ఎన్ని ఉద్యోగ నియామకాలు చేపడతామో జాబ్ క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తామని నమ్మబలికింది. కానీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల తర్వాత ఇదే జాబ్ క్యాలెండర్ అంటూ ప్రణాళిక లేకుండా, తూతూ మంత్రంగా ఉద్యోగాల భర్తీకి చర్యలంటూ ఓ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఇందులో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో, ఎంత కాలా నికి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో కనీస ప్రస్తావన లేదు. ప్రకటించిన వాటికి కూడా ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. దీంతో జాబ్ క్యాలెండర్ ప్రక్రియనే ఓ ప్రశ్నార్ధకంగా మారింది. అంతేకాదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేంతవరకు నిరుద్యోగ భతి రూ.4వేలు ఇస్తామని ప్రకటించింది. కానీ బడ్జెట్‌లో దీనికి సంబంధించి నిధులు కేటాయించలేదు. అంటే ఇది అమలుకు నోచుకునే పరిస్థితి లేనట్టే కనిపిస్తోంది.
వివాదాలు, నిర్భందాలు, ప్రచార ఆర్భాటాలు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాల కల్పనే తమ ప్రధాన ఎజెండాగా తీసుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి అవకాశాలను,ఉద్యోగాల కల్పనను గొప్ప ప్రచార అస్త్రంగా మార్చుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దుచేసి అద నంగా పోస్టులను కలిపి నూతన నోటిఫికేషన్ వేసింది. ఈ డీఎస్సీ ప్రకటనపై రాష్ట్రంలో నిరుద్యోగత యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. ప్రభుత్వం చెప్పే మెగా డీఎస్సీ అంటే 11వేల పోస్టులు కాదని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగ యువత కోరింది. అంతేకాదు, డీఎస్సీ పరీక్షలు ఉన్న సందర్భంలోనే గ్రూప్1, ఇతర పోటీపరీక్షలు వస్తున్నాయని, డీఎస్సీని కొంతకాలం వాయిదా వేయాలని, ప్రిపరేషన్‌కు తగిన సమయమివ్వాలని విన్నవించింది. హైదరాబాద్ అశోక్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగ అభ్యర్థులు ప్రతిరోజు శాంతియుతంగా తమ ఆవేదనను నిరసనల రూపంలో తెలిపింది. ప్రభుత్వం స్పందించపోగా ప్రశ్నించిన అభ్యర్థులపై ఉక్కుపాదం మోపింది. ఈ ఆందోళనల వెనుక కోచింగ్ సెంటర్ల నిర్వహకులున్నారని అసత్య ప్రచారం చేసింది.
గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసులతో లాఠీచార్జీ చేయించి, తీవ్ర గాయాల పాల్జేసింది.పైగా కేసులు కూడా బనాయించింది. జీవో 29పై కూడా ప్రభుత్వం సరైన అవగాహన కల్పించకుండా అనేక గందరగోళ పరిస్థితులు సష్టించింది. ఈ జీవో ప్రకారం ఎలా రిక్రూట్మెంట్ చేస్తారో కూడా కనీసం అభ్యర్థులకు వివరించక వారిని ఆందోళనకు గురిచేసింది. ఉద్యోగ అవకాశాలు, కొత్త నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగభతి, యూత్ డిక్లరేషన్ అమలు గురించి అడుగుతున్న నిరుద్యోగ యువతపై నిర్బంధకాండ ప్రయోగిస్తోంది. గత సర్కార్‌లాగే రాష్టవ్యాప్తంగా నిరుద్యోగుల ముందస్తు అరెస్టులు, లాఠీఛార్జీలు, కేసులు బనాయించడం ‘ప్రజాప్రభుత్వం’లోనూ షరమామూలే అయింది.
హామీలు మరిచి..యువతను ఏమార్చి…
తాము అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పేరైతే మార్చింది గానీ, నిరుద్యోగుల ఆశల్ని నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో ఖాళీలకనుగుణంగా ఉద్యోగావకాశాలు కల్పించాలని యువత అడుగుతుంటే ఇచ్చిన అరకొర ఉద్యోగాలకు ప్రచార ఆర్భాటాలు చేపట్టింది. ఎల్బీ స్టేడియంలో నియామాక పత్రాలందజేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇటీవల పెద్దపల్లిలోనూ ప్రజాపాలన విజయోత్సవాల(యువ వికాసం) పేరుతో పెద్ద బహిరంగసభ తల పెట్టింది. ఈ సభల ద్వారా ఉద్యోగ నియామకాలు, ఉపాధి కల్పనకు సంబంధించి యువతను పక్కదారి పట్టింటే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ఈ ఏడాది పాలనలో ప్రణాళికబద్ధంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినా ఆ దిశగా చర్యల్లేవు. మరో డీఎస్సీ ప్రకటన, గురుకులాల పోస్టుల భర్తీ, పోలీస్ రిక్రూట్మెంట్, గ్రూప్స్ పోస్టుల భర్తీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన ఖాళీ పోస్టుల ఆధారంగా స్పష్టమైన జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించలేదు. అందుకే కాంగ్రెస్ ప్రచార ఆర్భాటాలు మానుకుని ఎన్నికల్లో యూత్ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే దిశగా కార్యచరణకు పూనుకోవాలి. లేదంటే గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ సర్కార్ కూడా యువత ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
ఆనగంటి వెంకటేష్
9705030888