రైతులకిచ్చే ‘మద్దతు’ ఇదేనా?

ఖరీఫ్‌ సీజన్‌ పంటలకు ఈ నెల 7న కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనంత గొప్పగా తాము అన్నదాతలను ప్రోత్సహిస్తున్నామంటూ ఈ సందర్భంగా బీజేపీ నేతలు ప్రచార బాకాలూదుతున్నారు. కానీ వాస్తవమేంటి? రైతన్నల ఆదాయం రెట్టింపు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాషాయ పార్టీ… పాలనా పగ్గాలు చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తయినా ఇప్పటికీ వంచనకు పాల్పడుతోందే తప్ప వ్యవసాయోద్ధరణకు ఇసుమంత సాయం కూడా చేసింది లేదు. సాగు పెట్టుబడి, రైతు కుటుంబ కాయకష్టం విలువ కట్టి దానికి 50శాతం లాభం కలిపి మద్దతు ధరలు ప్రకటించాలనేది వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు, నిపుణులు మొదటి నుంచి ఘోషిస్తున్న డిమాండ్‌. స్వామినాథన్‌ కమిషన్‌ దీనినే శాస్త్రీయ రూపంలో సి2 ప్లస్‌ 50 పర్సెంట్‌గా ప్రతి పాదించారు. ఈ సూత్రీకరణలో మద్దతు ధరను చట్టబద్ధం చేస్తేనే రైతన్నకు కాస్త ఊరట కలిగి దేశానికి వెన్నుముకగా ఉన్న పల్లె సీమలు ప్రగతి బాట పట్టేది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి దారితీసిన కారణాల్లో సి2 ప్లస్‌ 50 పర్సెంట్‌ ప్రాతిపదికన పంటలకు మద్దతు ధర కల్పిస్తామనే వాగ్దానం కూడా ప్రధానమైనది. ‘ఏరుదాటేదాకా ఓడ మల్లన్న… ఏరుదాటాక బోడి మల్లన్న’ నానుడిలా అధికారంలోకి వచ్చాక ఆ వాగ్దానానికి బీజేపీ తిలోదకాలు ఇచ్చేసింది. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే చీకటి చట్టాలను తీసుకొచ్చి రైతన్నల ఆగ్రహాన్ని చవిచూసింది. ఎన్ని కుతంత్రాలు, కుట్రలకు తెరలేపినా… ఎంతటి తీవ్రమైన అణిచివేతలకు, వేధింపులకు పాల్పడిన మడమ తిప్పని పోరాట పటిమతో ఆ చీకటి చట్టాలను అన్నదాతలు వెనక్కినెట్టి వ్యవసాయోద్యమ చరిత్రకు కొత్త పేజీలను జత చేశారు. కానీ మోడీ సర్కార్‌ నేటికీ పాఠాలు నేర్చినట్టు లేదు. అందుకే తన దగాకోరుతనాన్ని ప్రస్తుత ఎంఎస్‌పి ప్రకటనలోనూ కొనసాగించింది.
కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల్లో ఒక్కటంటే ఒక్క పంటకు కూడా సి2 ప్లస్‌ 50 పర్సెట్‌ ప్రామాణికాల్లో ఇవ్వకపోవడం దుర్మార్గం. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారకాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సాగు ఖర్చులు రైతన్నకు గుదిబండగా మారాయి. అకాల వర్షాలు, ఇతర ప్రకృతి విపత్తులు మోసుకొచ్చే నష్టాలు చెప్పనలవికావు. ఇ-క్రాప్‌ వంటి డిజిటల్‌ చిక్కుముడులతో పంటలకు అందాల్సిన బీమా సైతం అందకుండా రూ.కోట్లాది ప్రీమియం సొమ్ము కార్పొరేట్‌ గల్లాపెట్టెలు చేరుతోందే తప్ప అన్నదాతకు ఊరడింపు దక్కడం లేదు. విత్త సంస్థల నుంచి రుణసాయం కూడా ఎండమావిలో నీటిచెమ్మ తీరునే తలపిస్తోంది. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న రైతన్నకు నామమాత్రపు ఎంఎస్‌పితో ప్రోత్సాహం దక్కకపోగా కన్నీరే మిగులుతోంది. కేంద్ర ప్రభుత్వ చర్యలు రైతులను ప్రత్యేకించి చిన్న, సన్నకారు రైతులను పచ్చి దగాకు గురిచేస్తున్నాయి.
అఖిల భారత కిసాన్‌ సభ వంటి రైతు సంఘాలు కేంద్రం మోసాన్ని ఆధార సహితంగా నిరూపించాయి. ధాన్యానికి క్వింటాలకు రూ.2183, జొన్నకు రూ.3180, కందికి రూ.7000, పత్తికి రూ.6620 చొప్పున కేంద్రం ఎంఎస్‌పి ప్రకటించింది. కానీ సి2 ప్లస్‌ 50 పర్సెంట్‌ ప్రకారం… ధాన్యానికి కింటాకు రూ.2866.5, జొన్నకు రూ.2833, కందికి రూ.8989.5, పత్తికి రూ.8679 ప్రకటించాలి. రైతు సంఘాల విశ్లేషణల ప్రకారం..సి2 ప్లస్‌ 50 పర్సెంట్‌ ప్రకారం ఎంఎస్‌పి ప్రకటించని కారణంగా ధాన్యం పండించే రైతులు క్వింటాలుకు రూ.683.5 నష్టపోనున్నారు. అలాగే కంది పప్పు, పెసర, మినపగుళ్లు, పొద్దు తిరుగుడు విత్తనాలు, నువ్వులు, నైజర్‌ సీడ్స్‌, పత్తి పంటలకు క్వింటాలకు కనీసంలో కనీసం రూ.2000 చొప్పున రైతులు కోల్పోనున్నారు. వీటిలో కొన్ని పంటలకయితే క్వింటాలకు రూ.3000 మించి నష్టాన్ని చవిచూడాల్సిన దుస్థితిని కేంద్రం కల్పిస్తోంది. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ (సిఎసిపి) అంచనాల కంటే ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ సాగు పెట్టుబడులు అధికంగా ఉంటున్నాయి. అంటే సాగు పెట్టుబడులను కావాలనే సిఎసిపి తక్కువగా చూపి… జాతీయ సగటు కంటే అధికంగా ఎంఎస్‌పి ఇచ్చామంటూ ప్రచారం చేస్తుండటం మోడీ సర్కార్‌ నయవంచన. ఉదాహరణకు కేరళలో వరి సాగు ఖర్చు (సి2) క్వింటాలకు కనీసం రూ.2847 అవుతుంది. కానీ సిఎసిపి రూ.2338గానే లెక్కకట్టింది. పంజాబ్‌లో కనీస సి2 రూ.2089 అయితే దానిని కూడా రూ.1462గానే సిఎసిపి లెక్కకట్టింది. మిగిలిన అన్ని పంటలకూ ఇదే వంచన. దేశానికి అన్నం పెట్టే రైతన్నను వంచించడం కంటే దేశద్రోహం ఉండదు. మోడీ సర్కార్‌ ఇప్పటికైనా స్వామినాథన్‌ కమిషన్‌ ప్రతిపాదించిన సి2 ప్లస్‌ 50 పర్సెంట్‌ ప్రకారం ఎంఎస్‌పి ప్రకటించి చట్టబద్ధం చేయాలి. పదేపదే ఇదే ద్రోహానికి ఒడిగడుతున్న బీజేపీని సాగనంపేందుకు సాగుదార్లంతా సిద్ధం కావాలి.
– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌