అచ్ఛే దిన్‌ అంటే ఇదేనా..!

– నిత్యావసర ధరల్ని అదుపుచేయరేం.. : మోడీ సర్కారుపై మల్లికార్జున్‌ ఖర్గే ఆగ్రహం
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏ రకమైన ”అభివద్ధి చెందిన భారతదేశం” అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌ చేశారు.ద్రవ్యోల్బణాన్ని హైలైట్‌ చేస్తూ.. పాలు, ఉల్లిగడ్డలు, టమాటా, చక్కెర వంటి నిత్యావసర వస్తువుల ధరలతో.. 2014 నాటి ధరలను పోల్చే ఒక వీడియోను ఆయన పంచుకున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్‌ ఆరోపణల దాడిని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా, దేశ ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో నిలదీస్తూ వస్తున్నది.