ఇదేకదా నువ్వు..!

Is this you..!మౌనంగా వుండీ
నన్ను నేను ఎంతో కొంత
దాచుకుందామనుకుంటా….
నన్ను, నా మాటల్ని,
వాటిని అంటిపెట్టుకున్న అంతర్గత ఆనవాళ్లని
కొల్లగొట్టటానికి పురివిప్పిన ప్రేమై
నెమలీకలతో సుతారంగా
ఎన్నో వర్ణ చిత్రాలను మనసున స్పసిస్తారు మీరు
దేహం పులకించినా గుమ్మనంగా వుండిపోతాను
గుట్టుచప్పుడు కాకుండా
మదిని, హదిని భద్రపరుచుకుంటాను
ప్రేమకు పదాల పరంపరలెందుకనుకుంటాను
హదయాన్ని చీల్చే మాటల ముల్లుగర్రలు
మళ్లీ విఘాతం కల్గిస్తాయి
అగ్నిపర్వతం నుంచీ ఎగిసిపడే నిప్పురవ్వలు
లావలా పరుచుకుంటున్న లోలోని అలజడులు
నన్ను నేను ఎంత కప్పేసుకున్నా
గట్టిగా బిగించుకున్నా
కవచాలన్నీ రెప్పపాటులో ఎగిరిపోతాయి
ఉన్నది ఉన్నట్టుగా దిగంబరంగా నన్ను నిలబెడతాయి
నన్ను మాట్లాడించకండీ
మాటే మనిషి తత్వం, మాటే మనసు కవిత్వం
మాటే ముసుగేయలేని మూర్తిమత్వం
మాటే హదయ వారథి
మాటే నన్ను నడిపే సారథి అంటూ మొర పెట్టుకుంటాను
ప్రకతీ సహకరించదు
పంచేంద్రియాలూ సహకరించవు
బడ బడా పదాలు పదాలుగా స్వరపేటికను చీల్చుకొని
గాల్లోనే రెక్కలు కట్టుకొని స్వేచ్ఛావచనాలై
పచ్చని చెట్లపై వెచ్చని మెట్లపై వాలిపోతాను
కొమ్మలూ రెమ్మలూ పూలూ కాయలూ అన్నీ
మాటల మూటల్ని తగిలించుకొని
బరువెక్కి భుమ్మీదికి వంగుతాను
శబ్ధపల్లవులు కాళ్లు తొడుక్కుని
గబ గబా గగనపు మెట్లెక్కేస్తాయి
ప్రపంచమంతా పక్కున నవ్వేస్తూ
ఇదేకాదా నువ్వు అనేస్తుంది..!
– డా.కటుకోఝ్వల రమేష్‌, 994903327